ఓ ఉద్విగ్న వాతావరణం..ఆత్మీయుల నులివెచ్చని స్పర్శ!

Mounasri mallik
Spread the love

● స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మౌనశ్రీ మల్లిక్ కు పౌర సన్మానం

● నేను రూ.250 ● వర్ధన్నపేట ● హైదరాబాద్

నిన్న మా స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మనసు నిండా చల్లని పొగమంచు ముసురుకుంది. ఆత్మీయుల నులివెచ్చని స్పర్శతో.. ఒక్కసారిగా 25ఏళ్ల ఒంటరి ప్రయాణం కళ్ళముందు కదలాడి సినిమా రీల్ లా గిర్రున తిరిగింది.
ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను 250 రూపాయలు పట్టుకుని 1997 డిసెంబర్ 24వ తేదీన హైదరాబాదులో దిగాను. సముద్రంలో నీటి బిందువు పడినట్టుగా ఈ మహానగర జనారణ్యంలో అడుగు పెట్టాను. జీవితంలో ఎంత దుఃఖాన్ని భరించానో, అంత ఆనందాన్ని అనుభవించాను. దుఃఖంలో కుదేలు పడింది లేదు. ఆనందంలో కాలర్ ఎగరేసింది లేదు. ఆనంద విషాదాలను సమదృష్టితో చూశాను. బాధలు సంతోషాలు జీవితంలో సహజం అని తెలుసుకున్నాను. ఇదంతా నాకు కవిత్వం చదవడం ద్వారానే బోధపడింది. ఎంతోమంది మహనీయుల పరిచయ భాగ్యం కూడా కవిత్వం వల్లనే సాధ్యమైంది. కలలోనైనా చూస్తానో లేదో అనుకున్న వారి పక్కన కూర్చునే అదృష్టాన్ని, వారితో పని చేసే అవకాశాలను కల్పించింది కూడా కవిత్వమే. నేను రాసిన కవిత్వం చాలా తక్కువ. అధ్యయనమే ఎక్కువ. బహుశా నేను చదివినన్ని కవితా సంపుటాలు నా వయసు వారు ఎవరూ చదివి ఉండకపోవచ్చు. ఆధునిక తెలుగు వచన కవిత్వం అప్పటి నుంచి ఇప్పటి దాకా చదివాను. దాని పరిణామాలను లోతులను చూశాను. కవిత్వం నాలో జీవితానికి సరిపడా తాత్వికతను నింపింది. నీతిగా ఉండటం వలన నిటారుగా నిలబడవచ్చనే విషయాన్ని నేర్పింది.
నిన్న మా ఊరి పెద్దలు వరద రాజేశ్వరరావు గారు, ఎర్రబెల్లి స్వర్ణ గారి ఆధ్వర్యంలో పౌర సన్మాన కార్యక్రమంలో నా ఆలోచనలు గతం వెంట పరుగులు తీశాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారికి, వందలాది మందికి భోజనాలు వడ్డించిన వారికి సహనంతో కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
-మీ మౌనశ్రీ మల్లిక్

Related posts

Leave a Comment