విప్లవ స్వాప్నికుడు కామ్రేడ్ బండ్రు నరసింహులు || నేల రాలిన ఎర్ర మందారం

Bandrunarashimhulu
Spread the love

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ మార్గంలో అట్టడుగు స్థాయిలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలు ముడిపడిఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై సాగిన ఉద్యమంలో సైతం బండ్రు నరసింహులు పాత్ర మరువలేనిది. భారత కమ్యూనిస్ట్ విప్లవ చరిత్రలో అవిభక్త కమ్యూనిస్ట్ పార్టీ నుండి విప్లవ రాజకీయాలదాక, తెలంగాణ సాయుధ పోరాటం, నక్సల్బరి, శ్రీకాకుళం, గోదావరి లోయ, కరీంనగర్ తదితర రైతాంగ ప్రతిఘటనలెన్నింటినొ తన జీవన గమనంగా మలుచుకున్న బండ్రు నరసింహులు జీవితం ఎందరికో ఆదర్శ దాయకం. హమాలి నుండి ఆంద్ర మహాసభకు నల్లగొండ జిల్లా ఆలేరు పట్టణంలోని గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన బండ్రు నరసింహులు తల్లిదండ్రులు కొమురవ్వ, బుచ్చిరాములుకి రెండవ సంతానం. చిన్న తనంలోనే తండ్రి మరణించడం, భూమి కోర్టు వివాదంలో చిక్కుకపోవడం, సోదరుల అనారోగ్యం కారణంగా కుటుంబ పోషణాభారం నరసింహులు పైనే పడింది. భూమి కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నతల్లి పట్టుదల నరసింహులును ఆంద్ర మహాసభ వైపుకు దారి పట్టించాయి. అక్కడే ఆయనలో కమ్యూనిజం బీజాలు బలంగా నాటుకున్నై. అప్పుడే ఆయన తన జీవనానికి కమ్యూనిజమే ఏకైక మార్గమమని నిశ్చయానికి వచ్చాడు. మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్ల దళ సభ్యుడిగా, కమాండర్ గా పోరాడుతూ రాయగిరి ఆయుధాల స్వాధీనానికి అయ్యగారి వేషం వేశాడు. ఎదురు కాల్పుల్లో గాయపడ్డా, అరెస్ట్ అయ్యి జనగామ మిలిటరీ క్యాంపు లో నెత్తుటి ముద్దగా మారినా, నల్గొండ జైలులో అధికారుల నెదిరించి క్రూరమైన చిత్రహింసలను ఎదుర్కొన్నా, తన ప్రతిఘటనా మార్గాన్ని విడువలేదు. 1964లొ డిఫెన్సు అఫ్ ఇండియా రూల్స్, 1975లొ ఎమర్జెన్సీ పరిస్థితి కాలంలో మీసా చట్టం కింద అరెస్ట్ అయి డెటెన్యో గా కొనసాగడంతో పాటు, జీవితకాలంలోని 12 సంవత్సరాలు జైలులోనే గడిచాయి. అనేక భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలకు నాయకత్వం వహించి దాడులు ప్రతిఘటనలో రాటుదేలి, రాజ్యహింస నేడుర్కుంటూ జనశక్తి పార్టీలో, రైతు కూలి సంఘంలో వివిధ హోదాలలో పంచేసారు. కమ్యూనిస్ట్ పార్టీలతో 75 సంవత్సరాలుగా పెనవేసుకున్న బండ్రు జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శ ప్రాయం. ఆయన జీవితం లో మిగిలిన ఏకైక బాధ అంతా శతాబ్ద కాలపు ఉద్యమాల తరువాత కూడా దేశం సంపూర్ణ విముక్తి పొందలేదనేది. అందుకే ఆయన ఏ వేదికేక్కిన నేటికి దేశ సంపూర్ణ విముక్తి కి ప్రజపోరాటాలే ఏకైక మార్గమమని దానికి కమ్యూనిస్ట్ శక్తుల ఐక్యత అవసరమని నినదిస్తుంటాడు. బతకటానికి భరోసా అంటే పోరాటమే మార్గమమని నినదించే బండ్రు నరసింహులు జీవితం ధన్యం.
బండ్రు నర్సింహులు తన జీవిత కాలంమంతా పీడిత ప్రజల పక్షం నిలబడ్డ కమ్యూనిస్టు. తన జీవితాన్ని 1944 భోనగిరి మహా సభల నుండి ప్రారంభించారు. జైలు జీవితం కూడా అనుభవించారు. కుట్ర కేసులతో తాను జైలు పాలవుతే తన సహచరి బండ్రు నర్సమ్మ భర్త పోరాటాన్ని ఎత్తి పట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధురాలు. ఆలేరు పట్టణంలో బండ్రు నర్సింహులు తెలియని వాళ్ళు లేరు ఆ గడప తొక్కని ఉద్యమ కారులు లేరు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో కూడా ఆలేరు లోని బండ్రు నర్సింహులు పోరు బాట పడితే తన సహచరి బండ్రు నర్సమ్మ ఇంటికి వచ్చే వారికి తల్లియైనది. ఈ నెల మీద కమ్యూనిస్టు పార్టీకి ఉన్నంత చరిత్రలో బండ్రు నర్సింహులుది ఒకటి కూడా. బండ్రు నర్సింహులు చిన్న కూతురైన అరుణోదయ విమలక్క చిన్నతనంలో తండ్రి వెంట నడుస్తూ పాటలు పాడితే తనని ఒక ప్రజా గాయకురాలుగా తీర్చడంలో నర్సింహులు పాత్ర కూడా ఉన్నది. బండ్రు నర్సింహులు ప్రజా విమోచన ప్రధాన సంపాదకుడు కూడా. తన జీవితమంతా పీడిత ప్రజల పక్షం వైపు నిలబడ్డ ఒక విప్లవ కార్యకర్త. తాను ఎన్నో వేదికల మీద మాట్లాడిన వ్యక్తి కమ్యూనిస్టు పార్టీలు ఐక్యం కావాలని కలగన్న విప్లవ స్వాప్నికుడు. ఎంతో సుధీర్ఘ కాలంగా మన మధ్య జీవించిన ఒక పోరాట యోధుడు ఈరోజు మధ్యాహ్నం మన నుండి భౌతికంగా దూరం కావడం జీర్ణించుకోలేనిది. బండ్రు నర్సింహులు జీవితం ఒక ఆదర్శం. పోరాటాలు ఒక తొవ్వ. తన జీవితం నేటి తరానికి ఒక ప్రేరణ.

Related posts

Leave a Comment