నీ ప్రచారం బావుందయ్యా మోహనయ్యా!

Your campaign is good, Mohanayya!
Spread the love

ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్! సినిమా రంగం అయితే మరీనూ! ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తారో చెప్పక్కరలేదు! ఇప్పుడు దర్శకుడు మోహన్ శ్రీవత్స అదే కోవలో నిలిచారు! ఏడ్చి సానుభూతి తెచ్చుకుని సినిమా చూసేలా చేయడమన్న మాట! సింపతి కార్డుకు జనం పడిపోతారనే పిచ్చి అమాయకపు తెలివి!
ఆయన ఏడుపుకు చాలామంది కరిగిపోయారు! బార్బరిక్ సినిమా గురించి గూగుల్ లో బాగా సెర్చ్ చేశారు! ఇప్పుడు ట్రెండింగ్ లో ఆయనే నంబర్ వన్! ఆయన తీసిన సినిమా ఏంటో ఒక్క ఏడుపుతో లక్షల మందికి తెలిసిపోయింది! సానుభూతిపరులు కొండొకచో నిన్నే థియేటర్ కు వెళ్లి చూసారు! ఇంకొంతమంది ఇవాళ రేపు ప్లాన్ చేసుకున్నారు! కొందరు మిత్రులు ఫోన్ చేసి బార్బరిక్ చూద్దాం అని ఫోన్! రివ్యూ రాయండి పాపం అని కొందరు! మొత్తానికి మోహన్ శ్రీవత్స సక్సెస్ అయ్యారు!
చాలామందికి సినిమా రంగం అంటే పిచ్చి ప్రేమ! వేరే లోకం ఉండదు! వున్నా తెలిసినా పట్టించుకోరు! ఒక మంచి సబ్జెక్ట్ తయారు చేసుకుని ఇండస్ట్రీ లో మంచి బ్యానర్ కోసం, మంచి హీరో కోసం, అంతకు మించి మంచి నిర్మాత కోసం పడిగాపులు కాస్తుంటారు! మొదటి కథ కాబట్టి అది ఎన్నో ఏళ్లుగా తయారు చేసుకుని ఉంటారు కాబట్టి అది బావుంటుంది! అదృష్టం కొద్దీ మంచి నిర్మాత దొరికితే అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది! ఆ తరువాత సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది! అందరూ అంతే! ఏ కొంతమందో మినహా! వందల మంది వచ్చారు, వెళ్లారు! వేల మంది ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్లు గా ఎదురు చూపులుతోనే సరిపెట్టుకుని కొనసాగుతూ ఉంటారు!
బార్బరిక్ దర్శకుడు మోహన్ శ్రీవత్స తన ప్రివ్యూ షో లోనే చెప్పారు! సినిమా నచ్చకపోతే చెప్పులతో కొట్టండి అని ఛాలెంజ్ విసిరాడు! పరవాలేదు నిజాయితీగా వున్నాడనుకున్నా! మహాభారతంలోని బర్భరీకుడు గురించి అంతగా ప్రచారం లేదు! కవి సౌదా ఒక నాటకం తీసుకొచ్చారు! ఇప్పుడు మోహన్ శ్రీవత్స రెండున్నరేళ్లు కష్టపడి ఒక మిస్టరి మర్డర్ కేసును బర్బరీకుడుతో పోల్చి చూపించే ప్రయత్నం చేశాడు! సినిమా చూడొచ్చు కానీ, ఆయన చేసిన ఛాలెంజ్ రేంజ్ లో అయితే లేదు!
తన చెప్పుతో తను కొట్టుకోవడం, ఆత్మహత్య చేసుకుంటాడేమో అని భార్య సినిమా థియేటర్ నుంచి హడావిడిగా ఇంటికి రావడం ఇదంతా నిజమే కావచ్చు! అతని ఏడుపులో నిజాయితీ ఉండొచ్చేమో! చాలామంది నమ్మారు! అయ్యో పాపం అనుకున్నారు! ఇక మీడియా మిత్రులు అయితే సోషల్ మీడియాలో వ్యాసాలు, ఎపిసోడ్స్ చేసి ఆఘమేఘాలపై వదిలారు! నాకు అయితే కించిత్ సానుభూతి కూడా అనిపించలేదు! మోహన్ శ్రీవత్స వదిలిన వలలో కొందరు ప్రేక్షకులు, కొందరు జర్నలిస్ట్ మిత్రులు, సమీక్షకులు చిక్కుకున్నారు అనుకున్న!
అసలు ఈ మోహన్ శ్రీవత్స ను సినిమా ఎవడు తీయమన్నాడు? సినిమా తీస్తే చూడాలని వుందా? ప్రేక్షకులకు డబ్బులు ఏమైనా వూరికే వస్తాయా? సినిమా తీసి చూడలేదని ఏడవడం ఎందుకు? చెప్పుతో కొట్టుకోవడం ఎందుకు? ఆ వీడియో చేసి వైరల్ చేయడం ఎందుకు? సినిమా తీసింది వ్యాపారం చేసి ఆదాయం పెంచుకుని పేరు తెచ్చుకుని ఇంకా ఇంకా పేరు ఆదాయం పెంచుకోవడానికేగా? జనాన్ని ఉద్దరించడానికి కాదుగా! సమాజం కోసం ఏదో సినిమా తీసి ఉచిత ప్రదర్శన వేస్తే చూడలేదంటే అర్ధం ఉంది! కమర్షియల్ సినిమా తీసి జనం డబ్బులు పెట్టి చూడలేదని ఏడవడం ఏమిటి? చెప్పుతో కొట్టుకోవడం ఏమిటి?
సినిమా ఇండస్ట్రీ లో ఎందరో వచ్చారు! కొందరే నిలబడ్డారు! చాలామంది అద్భుతాలు తీసి కూడా చేతులు ఎత్తేసి సైలెంట్ గా కనుమరుగయ్యారు! అయనలా ఏడవలేదు! ఎందుకంటే వారికంటూ ఆత్మ గౌరవం ఉంది! అతనిలా చీప్ పబ్లిసిటీ చేయలేదు! ఛండాలంగా సెంటిమెంట్ తో ప్రేక్షకులను రాబట్టే ప్రయత్నం చేయలేదు! ఇప్పటికి ఇండస్ట్రీలోనే ఉండి గుట్టు “చెప్పుడు”గా బతికే వాళ్ళు వందలాది మంది ఉన్నారు! దాదాపు వాళ్లలో 90 శాతం మంది అతని కన్నా ప్రతిభ ఉన్నవాళ్లే! కానీ ఫెయిల్ అయ్యారని చెప్పుతో కొట్టుకోలేదు! కొందరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు! కొందరు మనకు సరిపడదని సర్దుకుని పక్కకు తప్పుకున్నారు! ఏడవడడం సిగ్గుచేటు! ఏడ్చి సాధించేది ఏమీ ఉండదు! నచ్చితే ఇంకో సినిమా చెయ్! చేతకాకపోతే వేరే పని చూసుకోండి మోహన్ శ్రీవత్స గారు! దయచేసి ఏడవకండి ఏడవకండి! మీరు ఏడుస్తుంటే మిమ్మల్ని చూసి చాలామంది నవ్వుకుంటున్నారు!

– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment