‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను అర్థం చేసుకున్నా : అక్షయ్ లగుసాని

“When I Got the Call, I Immediately Thought of Chiranjeevi garu from Rudraveena”: Akshay Lagusani on Finding His Way Into Balu in Prime Video’s Jagamae Sangeetham
“When I Got the Call, I Immediately Thought of Chiranjeevi garu from Rudraveena”: Akshay Lagusani on Finding His Way Into Balu in Prime Video’s Jagamae Sangeetham
Spread the love

‘డెడ్ పిక్సెల్స్’, ‘కుమారి శ్రీమతి’, ‘హాస్టల్ డేస్’ వంటి వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అక్షయ్ లగుసాని. కామెడీ, డ్రామా, యూత్‌ఫుల్ కథల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న అక్షయ్, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రానున్న ‘జగమే సంగీతం’ సిరీస్‌లో బాలు అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ సిరీస్‌లో బాలు తన కుటుంబం నుంచి వచ్చిన సంగీత వారసత్వాన్ని కొనసాగిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేకమైన సంగీత ప్రయాణాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ పాత్ర కోసం తాను తీసుకున్న జాగ్రత్తల గురించి అక్షయ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బాలు పాత్ర గురించి అక్షయ్ మాట్లాడుతూ, “నాకు ఈ పాత్ర కోసం కాల్ వచ్చిన వెంటనే ‘రుద్రవీణ’ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా వినైల్ రికార్డు నా దగ్గర ఉంది. దాన్ని పాత బాక్స్ నుంచి తీసి, బాలు పాత్రకు సిద్ధమవుతున్న సమయంలో నా టేబుల్‌పై పెట్టుకున్నాను. సినిమాలో చూపించిన శాస్త్రీయ సంగీత ప్రపంచం నన్ను చాలా ప్రభావితం చేసింది. ‘జగమే సంగీతం’లో క్లాసికల్, మోడ్రన్ మ్యూజిక్ రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేశారు. అలాగే చిరంజీవి గారు మా సెట్స్‌కు రావడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. ‘రుద్రవీణ’ నాకు ఎంతో ఇష్టమైన సినిమా కావడంతో అది ఒక ఫుల్ సర్కిల్ మూమెంట్‌లా అనిపించింది. ఈ ప్రపంచంలో భాగమవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. బాలు పాత్రకు నా వంతు న్యాయం చేయాలని అనుకున్నాను” అని తెలిపారు.
సినిమాలో ప్రకాశ్ రాజ్ పోషిస్తున్న పాత్ర బాలకు తాతగా కనిపించనుంది. ఈ బంధంలో సహజత్వం రావడం కోసం తాను ప్రత్యేకంగా ఒక పద్ధతిని పాటించానని అక్షయ్ చెప్పారు.
“ప్రకాశ్ రాజ్ సర్ అంటే నాకు చాలా గౌరవం. అందుకే షూటింగ్ సమయంలో ఆయనతో కావాలనే కొంత దూరం పాటించాను. షాట్ల మధ్యలో ఎక్కువగా క్యాజువల్‌గా మాట్లాడేవాడిని కాదు. బాలు తన తాతను ఎంత గౌరవంగా చూస్తాడో, నేను కూడా ప్రకాశ్ రాజ్ సర్‌ను అదే భావంతో చూడాలని అనుకున్నాను. ఆయనను నా తాతగా భావించడం మొదలుపెట్టాను. ఆయన నటుడిగా కనిపించినా కూడా, కుటుంబంలోని పెద్దవారిని లేదా గురువును గౌరవించినట్టుగా రెండు చేతులతో ఆయన కాళ్లకు నమస్కారం చేసేవాడిని. ఆ విధానం బాలు పాత్రలోని భావోద్వేగంలో ఉండటానికి నాకు చాలా సహాయపడింది” అని అక్షయ్ వెల్లడించారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జగమే సంగీతం’ సిరీస్‌ను గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వంగల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఏ.ఆర్. ప్రభవ్ కలిసి కథను రాశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ ఎనిమిది ఎపిసోడ్ల మ్యూజికల్ డ్రామాలో ప్రకాశ్ రాజ్, మేకా శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మిత శెట్టి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సుమన్, సిజ్జు మీనన్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4, 2026 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు తమిళ డబ్బింగ్‌లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలు, ప్రాంతాల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు.