తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కెసిఆర్ సంకల్పించి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. సాంస్కృతిక సారధి అని ఆ సంస్థకు నామకరణం చేసి సాంస్కృతిక శాఖ ఆధీనంలో ఏర్పాటు చేశారు. మాదాపూర్ చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో కార్యాలయం కేటాయించారు. కెసిఆర్ హయాంలో రెండు పర్యాయాలు అప్పటి మానకొండూరు ఎమ్మెల్యే ఉద్యమ గాయకుడు రసమయి బాలకిషన్ ను చైర్మన్ గా నియమించారు. సభ్య కార్యదర్శిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ వ్యవహరించే వారు. 550 మంది కళాకారులకు ఉద్యోగ కల్పన చేశారు. ఒక్కొక్కరికి 25,500 రూపాయలు నెల జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగించాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం, అధికారిక బహిరంగ సభల్లో ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ అధికారిక ఉత్సవాలు, పండుగల్లో కళా ప్రదర్శనలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా పాట ఆట జానపద కళా రూపాల్లో ప్రదర్శనలు ఇవ్వడం ఇలా వారి ఉద్యోగ విధి విధానాలుగా నిర్ణయించారు. భవిష్యత్ లో ఉద్యోగాలను క్రమబద్ధికరణ చేస్తామని అప్పట్లో కెసిఆర్ హామీ ఇచ్చారు. ప్రతి బడ్జెట్ నెల మార్చి నుంచి ఫైల్ రెన్యూవల్ చేయడంలో ఆలస్యం అవడం నాలుగైదు నెలలు జీతాలు ఆలస్యం అవడం షరా మామూలుగా కొనసాగుతూ వస్తోంది.
ఈ నేపథ్యంలో కొందరు ఉద్యమ కళాకారులు తమకు అన్యాయం జరిగిందని, తమను కూడా పారదర్శకంగా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని నిరసనలకు దిగారు. కోర్టును ఆశ్రయించారు. న్యాయబద్ధంగా తిరిగి ఇంటర్వ్యూ లు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాల మేరకు తిరిగి నోటిఫికేషన్ ప్రక్రియ, ఇంటర్వ్యూ కొనసాగించి అటు ఇటుగా 580 మందిని విధుల్లోకి తీసుకున్నారు. ఒక్కొక్కరికి 30,500 జీతభత్యాలుగా నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి గద్దర్ కుమార్తె వెన్నెలను చైర్ పర్సన్ గా నియమించింది.
మళ్ళీ మార్చి బడ్జెట్ ఆటంకం, గత నాలుగు నెలలుగా సారధులకు జీతాలు లేవు. గతంలో రసమయి బాలకిషన్ కళాకారుడు కాబట్టి కొంచెం ఉత్సాహంగా విరివిగా కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక మార్పిడిలో భాగంగా విదేశాలకు పంపించారు. ఉద్యోగులను వారి సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లాల్లో పని చేయించారు. ఇప్పుడు పగ్గాలు చేపట్టిన వెన్నెలకు అసలు ఆ పోస్ట్ గురించే తెలియదు. సారధికి శాఖకు సంబంధం తెలియదు. ఆమె ఇంటర్వ్యూ లలో సైతం సాంస్కృతిక శాఖ చైర్మన్ అని చెప్పుకుంటారు. కళాకారులతో ప్రత్యక్ష పరిచయాలు లేకపోవడం, కార్యక్రమం నిర్వహించే అనుభవం లేకపోవడం తదితర కారణాలతో సారధి సంస్థ కుంటుతోంది! జీతాలు రాని పరిస్థితి! ఈ నేపథ్యంలో ఈ సంస్థను బలోపేతం చేసి ప్రభుత్వ పథకాలను మరింత విస్తృతం చేసేందుకు ఒక ప్రత్యేక సలహా కమిటీని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఎమ్మెల్సీ ఎం. కోదండరాం అధ్యక్షతన ఇందులో బి.నర్సింగరావు, సుద్దాల అశోక్ తేజ, యాకుబ్, కిషోర్ లాంటి పలువురు సభ్యులుగా ఉన్నారు!
గత పదేళ్లు సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న డా. మామిడి హరికృష్ణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఆయనే కొనసాగడం విశేషం. సహకార శాఖ నుంచి డిప్యూటేషన్ పై వచ్చి రికార్డు స్థాయిలో 11 ఏళ్లుగా కొనసాగుతున్నారు! ప్రభుత్వం మార్చేందుకు ప్రయత్నం చేసి కూడా అంతకు మించిన నైపుణ్యం ఉన్న అధికారి దొరకక కొంత, ఏ అధికారి ఆసక్తి చూపించక కొంత ఆయన్నే కొనసాగించే పరిస్థితి! ఆయన కూడా సాధ్యమైనంత మేరకు పూర్తి సమయాన్ని కేటాయించి తెలంగాణలో సాంస్కృతిక పరంగా చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు! కానీ, కొన్ని కళలను, కొంతమంది కళాకారులను మాత్రమే ప్రోత్సహిస్తున్నారనే విమర్శను ఎదుర్కొంటున్నారు! తెలంగాణ యువ దర్శకులను ప్రోత్సహిస్తూ లఘు చిత్రాల ద్వారా వారి ప్రతిభకు వేదిక కల్పిస్తూ గుర్తింపు పొందారు.
మరో వైపు సాహిత్య అకాడమి వున్నా అప్పటి ప్రభుత్వం నియమించిన నందిని సిద్ధారెడ్డి అనంతరం కొత్త అధ్యక్షుని నియామకం ఇంకా జరగలేదు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు, కవి సంగమం వ్యవస్థాపకులు ప్రముఖ కవి డా.యకూబ్ ను సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా నియమించాలని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిఫారసు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న కోదండరామ్ తిరిగి వచ్చాక నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేచి చూస్తున్నట్లు సమాచారం. మరో వైపు సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలిగా ప్రఖ్యాత నాట్య గురువు డా. అలేఖ్య పుంజాలను నియమించారు. ఆమె తనదైన శైలిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు! ఇంకా లలిత కళల అకాడమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది!
ఈ ఏడాది బడ్జెట్ కూడా 450 కోట్లకు పైగా రికార్డు స్థాయిలో ప్రభుత్వం కేటాయించింది! కానీ, అభివృద్ధి నత్త నడక నడుస్తోంది! ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో కాంట్రాక్ట్ పధ్ధతిలో పేరిణి నాట్య శిక్షకులుగా పని చేస్తున్న వారికి దాదాపు 16 నెలలుగా జీతాలు లేవు! రవీంద్రభారతి ప్రాంగణంలో ఘంటసాల విగ్రహం పక్కనే దివంగత ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు హామీ అటకెక్కింది! అటు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉన్న తెలుగు లలిత కళా తోరణం ఒక్క కార్యక్రమం కూడా లేకుండా వెలవెలబోతోంది! రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాంస్కృతిక శాఖ పై దృష్టి సారించాలి! సమస్యలను తొలగించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించాలి! సాంస్కృతిక సారధులకు, పేరిణి నృత్య శిక్షకులకు బకాయి జీతాలను వెంటనే చెల్లించాలి! ప్రభుత్వ పథకాలను విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లేందుకు సాంస్కృతిక సారధి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది!
– డా. మహ్మద్ రఫీ