యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో తీసిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీతో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్‌ని తెరకు పరిచయం చేశారు. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద తెరకెక్కించిన ఈ సినిమాని ఫిబ్రవరి 14న రిలీజ్ చేశారు. ఈ సినిమాకి ఆడియెన్స్, మీడియా నుంచి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు చిత్ర యూనిట్ థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
యాక్షన్ కింగ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ కథ గ్రాటిట్యూడ్, థ్యాంకింగ్‌కి సంబంధించింది. మా సినిమాకి ప్రేమను, ప్రశంసల్ని కురిపించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు ఈ ప్రయాణంలో తోడుగా నిలిచిన మీడియాకి థాంక్స్. పదమూడేళ్ల క్రితం నేను చూసిన యాక్సిడెంట్‌తో ఈ మూవీ లైన్ తట్టింది. ఒక పది సెకన్లు వెనకా ముందు అయినా కూడా ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు. అలా అక్కడి నుంచి ఈ ఐడియా పుట్టింది. చూసిన ప్రతీ ఒక్కరూ తమ జీవితాన్ని చూసినట్టుగా ఉందని అంటున్నారు. చెడులోనూ మంచి ఉంటుందని ఇందులోని పాత్రలు రియలైజ్ అవుతుంటాయి. ప్రతీ ఒక్కరి జీవితం ఒక జర్నీలాంటిదే. నాకు నటన అంటే ఏంటో తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను. ఆ తరువాత యాక్టింగ్ నేర్చుకున్నాను. ఆ తరువాత దర్శకత్వం చేయాల్సి వచ్చింది. ‘జెంటిల్మెన్’తో స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత మళ్లీ బాధ్యత పెరిగినట్టు అయింది. ‘సీతా పయనం’ అవుట్ పుట్, రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నాను. నా కూతురు అద్భుతంగా నటించింది అని ప్రశంసిస్తున్నారు. నేను అక్కడే పాస్ అయ్యాను. నేను గొప్ప సినిమా తీశాను అని కూడా చెప్పడం లేదు. కానీ మేం ఏం అనుకున్నామో అది జనాలకు కనెక్ట్ అయింది. నిరంజన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ప్రకాష్ రాజ్ గారు, సత్య రాజ్ గారు, కోవై సరళ గారు అద్భుతమైన యాక్టర్స్. బిత్తిరి సత్తి, సిరి, చరణ్ చక్కగా నటించారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, డైలాగ్ రైటర్ ఈ సినిమాకి ప్రధాన బలం. నేను, మూర్తి కలిసే ఈ సినిమాని కంప్లీట్ చేశాం. ధృవ్ సర్జా ఇందులో ఓ పవర్ ఫుల్ కేమియో పాత్రని చేశారు. మేం ఎంతో నిజాయితీతో ఈ మూవీని తీశాం. ఆడియెన్స్ అందరికీ మా చిత్రం నచ్చుతుంది. చూడని వాళ్లు వెంటనే చూడండి. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు’ అని అన్నారు.
ఐశ్వర్య అర్జున్ మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ మా అందరికీ చాలా ప్రత్యేకం. ఆడియెన్స్ ఇస్తున్న ప్రేమను చూస్తే ఇది మాకు మరింత స్పెషల్‌గా మారింది. ఆడియెన్స్, మీడియా ఇస్తున్న ప్రేమకు థాంక్స్. మా సినిమాని చూడని వారంతా కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అనూప్ గారి మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన నా నాన్న, నా దర్శకుడు, నా నిర్మాతకు థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.
నిరంజన్ మాట్లాడుతూ .. ‘నాలాంటి కొత్త వారిని సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. మేం ఈ మూవీని ఎంతో కష్టపడి చేశాం. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం. నాకు ఇంత మంచి పాత్రని, సినిమాను ఇచ్చిన అర్జున్ గారికి థాంక్స్. ఎన్నో విలువలతో తీసిన ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది. ఐశ్వర్యతో పని చేయడం సంతోషంగా ఉంది. మాకు అన్ని చోట్లా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలానే మా సినిమాని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ .. ‘ఇలాంటి స్టోరీతో సినిమా చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. జనాలకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే ఆలోచనతో అర్జున్ గారు ఈ మూవీని తీశారు. ప్రతీ ఒక్కరి జీవితంలో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఇలాంటి చిత్రాలే ప్రస్తుతం అవసరం. నా పాటలు, బీజీఎం గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఐశ్వర్య, నిరంజన్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. ఇది తప్పకుండా అందరూ చూడాల్సిన చిత్రం’ అని అన్నారు.
సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ .. ‘మంచి చిత్రంలో మాటలు రాసే అవకాశాన్ని నాకు అర్జున్ గారు ఇచ్చారు. ఇందులోని ప్రతీ పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ప్రతీ సన్నివేశంలో డెప్త్ ఉంటుంది. ప్రతీ సన్నివేశంలో అద్భుతమైన డైలాగ్ రాసే అవకాశం నాకు వచ్చింది. ఓ అద్భుతమైన సినిమాని చూశామనే ఫీలింగ్‌తో థియేటర్ నుంచి ఆడియెన్స్ బయటకు వస్తున్నారు. ఇలాంటి చిత్రాలే ఇప్పుడు రావాలని అంతా కోరుకుంటున్నారు’ అని అన్నారు.
అసోసియేట్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ అద్భుతంగా ఉంది. అర్జున్ గారు ఈ మూవీతో తనలోని కొత్త యాంగిల్‌ను చూపించారు. ఈ సినిమా ప్రయాణంలో ఆయన తపనను నేను దగ్గరుండి చూశాను. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆణిముత్యంలా ఉంటుంది. అనూప్ గారి పాటలు, అందులోని లిరిక్స్ ఎన్నో విలువల్ని చాటుతాయి. మా సినిమాని ఆదరిస్తున్న ఆడియెన్స్ అందరికీ థాంక్స్’ అని అన్నారు.
‘సీతా పయనం’ని ఎంతో నిజాయితీతో తీశాం.. మా సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు.. థాంక్స్ మీట్లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా
