విజువల్ వండర్..’రామాయణ’ టీజర్

Visual wonder..'Ramayana' teaser
Spread the love

భారతీయ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నితేష్ తివారీ ‘రామాయణ’ స్పెషల్ రామ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ విజువల్ వండర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం టీజర్ అని కాకుండా, శ్రీరాముడి పాత్రను పరిచయం చేస్తూ ఒక ట్రైలర్ స్థాయిలో దీన్ని రూపొందించారు. హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గని విజువల్స్ చూస్తుంటే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించబోయే ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. టీజర్ ప్రారంభం నుంచే మనల్ని ఒక పురాణ కాలంలోకి తీసుకెళ్లడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఒక భారీ యుద్ధం చేస్తున్న సన్నివేశాలు, దాని వెనుకే వచ్చే భారీ ఏనుగులు సినిమా స్కేల్ ఏంటో చెబుతున్నాయి. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చిన విధానం పక్కాగా కుదిరింది. విల్లు పట్టుకుని నిలబడిన తీరు, ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత ‘మర్యాద పురుషోత్తముడి’ రూపాన్ని పక్కాగా ఆవిష్కరించాయి. అసలు విషయానికి వస్తే, ఈ టీజర్ లో విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన స్క్రీనింగ్ లో వచ్చిన టాక్ నిజమేనని నిరూపిస్తూ, గ్రాఫిక్స్ అత్యంత నాణ్యతతో ఉన్నాయి. ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేయడం వల్ల ప్రతి ఫ్రేమ్ చాలా క్లారిటీగా, భారీగా కనిపిస్తోంది. ముఖ్యంగా రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నడుచుకుంటూ వచ్చే సీన్, రాతి విగ్రహాల మధ్యలో ఆయన నిలబడిన షాట్స్ ఒక విజువల్ ట్రీట్ లా ఉన్నాయి. హాలీవుడ్ సంస్థ ‘డిఎన్ఈజీ’ ఈ సినిమా కోసం గట్టిగానే వర్క్ చేసినట్లు అర్ధమవుతుంది. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా, సంగీతం కూడా ఈ టీజర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే ఒక రకమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. రాముడి వీరత్వాన్ని, ప్రశాంతతను ప్రతిబింబించేలా ఉన్న సౌండ్ డిజైన్ టీజర్ కు మెయిన్ హైలైట్. “రామ.. అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ” అనే క్యాప్షన్ తో ఈ సినిమా రానుంది. నటీనటుల విషయానికి వస్తే, సాయి పల్లవిని సీతగా.. అలాగే సన్నీ డియోల్ హనుమంతుడి గెటప్ లో పవర్‌ఫుల్ గా నటిస్తున్నారు. వారి లుక్స్ ని ఇంకా రివిల్ చేయలేదు. అలాగే యశ్ ‘రావణ’ లుక్ ను పూర్తిగా రివీల్ చేయకపోయినా, ఆయన కనిపించే ఆ ఒక్క ఫ్రేమ్ లో ఉన్న ఇంటెన్సిటీ అదిరిపోయింది. శ్రీరాముడు అరణ్యాల్లో విల్లు పట్టుకుని వెళ్తున్న విజువల్స్ అన్నీ కథలోని ఎమోషన్ కు ప్రాణం పోశాయి. ఇక ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి 2026లో రాబోతోంది. రెండో భాగం 2027 దీపావళికి వస్తుందని టీజర్ చివర్లో స్పష్టం చేశారు. ఐమాక్స్ తో పాటు 4 డిఎక్స్ ఫార్మాట్ లో కూడా ఈ సినిమా రావడం దాదాపు ఖాయం అని టీజర్ మేకింగ్ క్వాలిటీని బట్టి అర్థమవుతోంది. భారతీయ ఇతిహాసాన్ని ఇంత గ్రాండ్‌గా చూపించడం ఇదే మొదటిసారి కావొచ్చు. ఈ టీజర్ సృష్టించిన హైప్ తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల లెక్కలు మారడం ఖాయంగా కనిపిస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. హనుమాన్ జయంతి కానుకగా విడుదలైన ‘రామ’ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోయినప్పటికీ, కేవలం విజువల్స్ ద్వారానే సినిమా స్థాయిని మేకర్స్ చాటిచెప్పారు. ముఖ్యంగా శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ లుక్ అందరినీ కట్టిపడేస్తోంది. ఆ కళ్లలో కనిపించే ప్రశాంతత, ముఖంలో వెలిగే దైవత్వం మరియు ఆ క్యారెక్టర్‌కు కావాల్సిన గాంభీర్యాన్ని రణ్‌బీర్ అద్భుతంగా పండించారు. శ్రీరాముడి పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు చూస్తుంటే, ఈ పాత్రకు రణ్‌బీర్ సరైన ఎంపిక అని స్పష్టమవుతోంది. ఐమ్యాక్స్ ..డాల్బీ సినిమా ఫార్మాట్లలో విడుదల కానున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది. నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా 2026 దీపావళి కానుకగా విడుదల కానుంది. భారతీయ పురాణ గాథను వెండితెరపై ఇంత భారీ స్థాయిలో చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Related posts