(చిత్రం : వీరసింహారెడ్డి, రేటింగ్ : 3/5, విడుదల తేది : 12, జనవరి – 2023, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : గోపీచంద్ మలినేని
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు : నవీన్ యెర్నేని-వై రవిశంకర్, నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్), హనీ రోజ్, నవీన్ చంద్ర, లాల్, అజయ్ ఘోష్ తదితరులు. సినిమాటో గ్రఫీ: రిషి పంజాబీ, సంగీత దర్శకులు: థమన్ ఎస్, డివోపీ: రిషి పంజాబీ , పాటలు : రామజోగయ్య శాస్త్రి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, వెంకట్, ఎడిటింగ్ : నవీన్ నూలి)
నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ అయ్యాయి. చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ చేసింది. ఎస్ థమన్ తన మాస్-అప్పీలింగ్ కంపోజిషన్లతో భారీ అంచనాలను నెలకొల్పాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఊపందుకునేలా సాగాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ ఈ గురువారం (12, జనవరి – 2023) విడుదలైంది. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా..లేదా.. ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..!
కథలోకి వెళదాం : రాయలసీమకి దేవుడు లాంటి మనిషి వీర సింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ). పులిచర్ల ప్రాంతానికి అండగా ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతాడు. అనుక్షణం సీమ ప్రజల మంచి కోసమే తపిస్తుంటాడు. అలాంటి వీర సింహారెడ్డికి తన సవతి చెల్లి భానుమతి (వరలక్ష్మి శరత్ కుమార్) అంటే ఎంతో ప్రాణం. ఆమె కోసం ఏది చేయడానికైనా వెనుకాడడు. చివరకు ఆ చెల్లి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. అయితే… చెల్లి భానుమతి మాత్రం అన్న వీర సింహారెడ్డిపై పగతో రగిలిపోతుంది. ఆయన చావు కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో వైపు..జయసింహా రెడ్డి (జూనియర్ బాలయ్య) ఇస్తాంబుల్‌లో తన తల్లి మీనాక్షి (హనీ రోజ్)వద్ద ఉంటూ ఆమెతో జీవితాన్ని సాగిస్తుంటాడు. అలా సాగిపోతున్న అతడి జీవితంలోకి కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈషా (శ్రుతి హాసన్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారుతుంది ఫలితంగా జయసింహా ఈషాతో ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తల్లికి చెబుతాడు. ఆమె అందుకు ఎంతో సంతోషిస్తుంది. అదే సమయంలో జయసింహాకి లేడనుకున్న తన తండ్రి వీర సింహారెడ్డి గురించి తల్లి ద్వారా తెలుస్తుంది. అసలు అలాంటి తండ్రీ కొడుకులు ఎందుకు దూరం అయ్యారు? ఎంతో ఆప్యాయంగా.. ప్రాణంగా ప్రేమించే చెల్లి మీనాక్షి..తన అన్న వీరసింహా రెడ్డి చావును ఎందుకు చూడాలనుకుంటుంది? చివరకు ‘వీరసింహారెడ్డి’ కథ ఎలా ముగిసింది? జయసింహారెడ్డి తన తండ్రి కోసం ఏం చేశాడు ? అనేది తెరపై చూడాల్సిందే..!
విశ్లేషణ : ఈ ‘వీరసింహారెడ్డి’కి దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ బావుంది. అయితే.. మంచి మాస్ థీమ్ తీసుకున్నప్పటికీ.. స్లో నేరేషన్ తో కొన్ని చోట్ల నత్తనడకన సాగింది. దర్శకుడు గోపీచంద్ టేకింగ్ మాత్రం బాగుంది. ఓ పవర్ ఫుల్ మాస్ డ్రామా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగలేక కాస్త నిరాశని కలిగిస్తుంది. అయితే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో దర్శకుడు ఆద్యంతం ఆకట్టకునే ప్రయత్నం చేసినప్పటికీ.. సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని సంతృప్తి పరచలేకపోయాయి. కొన్ని అనవసరమైన సన్నివేశాలతో సినిమా రేంజ్ ను కొంత మేరకు తగ్గించాడనిపిస్తుంది. కంటెంట్, నటీనటుల పరంగా చూసుకుంటే సినిమా మీద ప్రేక్షకుడికి పూర్తి స్థాయిలో ఆసక్తి కలిగించే స్కోప్ ఉన్నపటికీ దర్శకుడు మలినేని గోపీచంద్ ఆ ఎలిమెంట్స్ ను గాలికొదిలేశాడనిపిస్తుంది. ‘వీరసింహారెడ్డి’ అంటూ వచ్చిన ఈ పవర్ ఫుల్ మాస్ అండ్ యాక్షన్ డ్రామా నటసింహం బాలయ్య తన నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టు లేదనిపించింది.
ఎవరెలా చేశారంటే.. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, జయసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఈ రెండు క్యారెక్టర్లని బాలయ్య ఎప్పటిలాగే తన సహజ ధోరణీలో మాస్ ని మేళవించి చెడుగుడు ఆడేశాడు. తన నటనతో మాస్ యాక్టింగ్ తో అభిమానులను ఆద్యంతం అలరించేలా ఉత్తమమైన నటనను కనబర్చారు. కొన్ని ఎమోషనల్.. మరికొన్ని యాక్షన్ సన్నివేశాల్లో తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక క్లైమాక్స్ లో అయితే.. తీవ్రమైన భావోద్వేగాలను పండించిన బాలయ్య నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక బాలయ్య డ్యాన్సులంటారా.. ఇరగదీశాడు. మాస్ ప్రేక్షకులకు ఓ కిక్ ఇచ్చాడు. జూనియర్ బాలయ్యకు జోడీగా నటించిన శృతిహాసన్ తన గ్లామర్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. వీరసింహారెడ్డి మరదలు (భార్య)గా నటించిన హనీ రోజ్ నటన ఒకే అనిపించింది. ఆమెలోని నటిని ఈ చిత్రం వెలుగులోకి తెచ్చిందని చెప్పొచ్చు. ప్రతీ సన్నివేశంలో ఆమె నటనలో ప్రతిభ కనబరిచి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. వీరసింహారెడ్డికి చెల్లిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో కీలకమైన తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే ఓ కీలకమైనసన్నివేశంలో ఆమె నటన చాలా గొప్పగా ఉంది. విలన్ పాత్రలో నటించిన దునియా విజయ్ తన వైల్డ్ నటనతో అందర్నీ మెప్పించాడు. విలన్ అంటే ఇలాగే ఉండాలి అనిపించేలా పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు.ముఖ్యంగా తన నిజస్వరూపం గురించి వరలక్ష్మి శరత్ కుమార్ కు చెప్పే సన్నివేశంలో అతడి నటనకు మంచి మార్కులు పడతాయి. మరో కీలక పాత్రలో నటించిన నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించేలా నటించి మెప్పించారు. శ్రుతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు.
టెక్నీకల్ విషయాలకొస్తే… దర్శకుడు గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే అంతగా అతకలేదనిపించింది. సంగీత దర్శకుడు థమన్ అందించిన సంగీతం మాత్రం విశేషంగా అలరించిందని చెప్పొచ్చు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ వర్క్ ఫర్వాలేదు. ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఒకే! నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన ఇంటెన్స్ డైలాగ్స్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్, ఎస్ థమన్ స్కోర్ చేసిన బీజియం, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, సెకండాఫ్‌లోని ఎమోషనల్ పార్ట్ సినిమాను ఆసక్తికరంగా సాగేలా చేశాయి. మొత్తం మీద బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే ఈ ‘వీరసింహారెడ్డి’ పండగ వాతావరణాన్ని కలిపించింది. ఓన్లీ మాస్ అండ్ యాక్షన్ డ్రామా!
-ఎం.డి అబ్దుల్