తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వి.ఎన్. ఆదిత్య, సాయి రాజేష్ సాధికారత ప్యానెల్ విజయ దుందుభి మోగించింది. దర్శకుడు సాయి రాజేష్ నీలం రికార్డు బ్రేక్ విజయం సాధించాడు. తెలుగు సినీ దర్శకుల సంఘం నూతన అధ్యక్షులుగా 641 ఓట్లతో వి.ఎన్.ఆదిత్య గెలిచారు. తన సమీప ప్రత్యర్థి మద్దినేని రమేష్ కు 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. ట్రెజరర్ గా పోటీ చేసిన దర్శకుడు సాయి రాజేష్ 938 ఓట్లతో స్వీప్ చేసేశారు. పోటీలో వున్న జి. సుధాకరరావుకు 76, ఇ. ప్రేమరాజ్ కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉపాధ్యక్షులుగా ముగ్గురిని ఎన్నుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ కేటగిరిలో ఇద్దరు మాత్రమే ఉండాలి. అనూహ్యంగా ఇద్దరికి ఒకే సంఖ్యలో టై గా ఓట్లు పడటంతో ముగ్గురిని ఉపాధ్యక్షులుగా ప్రకటించారు. ఇందులో దర్శకుడు వి. సముద్ర 703 ఓట్లు గెలుచుకుని మొదటి ఉపాధ్యక్షులు అయ్యారు. ఎస్. వి.భాస్కర్ రెడ్డి, జర్నలిస్ట్ ప్రభులకు చెరో 522 ఓట్లు పడటంతో వీరిద్దరూ కూడా ఉపాధ్యక్షులు అయ్యారు. సమీప ప్రత్యర్థులు బి. సుబ్బారావుకు 149, డాడీ శ్రీనివాస్ కు 136, వి. శ్రీవాత్సవ్ కు 46 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రధాన కార్యదర్శిగా 520 ఓట్లతో పి.వి.రామారావు గెలిచారు. సిహెచ్ సుబ్బారెడ్డికి 364, కస్తూరి శ్రీనివాస్ కు 170 ఓట్లు మాత్రమే పడ్డాయి. జాయింట్ సెక్రటరీలుగా చెరుకూరి బాలాజి 598, ఎ. కృష్ణమోహన్ 581 ఓట్లతో గెలుపొందారు. వడ్డాణం రమేష్ గట్టి పోటీ ఇచ్చి 489 ఓట్లు తెచ్చుకున్నారు. రెట్టడి కోటేశ్వరరావు, కె. కోటేశ్వరరావు లకు వరుసగా 309, 131 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక కార్యనిర్వాహక కార్యదర్శి గా 549 ఓట్లతో రాజా వన్నెంరెడ్డి, 491 ఓట్లతో ఎ. సునీల్ గెలుపొందారు. మిగిలిన పోటీదారులు దొండపాటి వంశీకృష్ణ కు 424, కూరపాటి రామారావుకు 394, చిరుత బాలరాజుకు 154, ఎన్. నవకాంత్ కు 96 ఓట్లు లభించాయి. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా 26 మంది దర్శకులు పోటీపడగా తొమ్మిది మందిని విజేతలుగా ప్రకటించారు. ఆళ్ల ఆకాష్ (718), కొలను శైలేష్ (672), గుంటూరు అంజిబాబు (660) తలాటం మల్లిక (639), సాగర్ చంద్ర (633), టి. శ్రీరామ్ ఆదిత్య (629), ఎం. సాయి సురేంద్రబాబు (551), రమణ మొగిలి (534), కొండా విజయ్ కుమార్ (511) గెలుపొందారు.
నిన్నటి వరకు హోరా హో్రీ అనుకున్నది కాస్తా ఎన్నికల రోజు ఆదివారానికి వార్ వన్ సైడ్ లా సాయి రాజేష్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, శివ నాగేశ్వరరావు, ఎస్.వి. కృష్ణారెడ్డి, అనిల్ రావిపూడి తదితరులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కార్యవర్గం పదవీ కాలం రెండేళ్లు!
మరోపక్క తెలుగు సినీ, టీవీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కూడా జరిగాయి. దీనిలో వల్లభనేని అనిల్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. 1390 ఓట్ల భారీ మెజారిటీతో అనిల్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా పి. రవి, ట్రెజరర్‌గా రవీందర్ ఎన్నికయ్యారు. ‘సినీ కార్మికుల, జూనియర్ ఆర్టిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం’ అని వల్లభనేని అనిల్ కుమార్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.
తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా వి.ఎన్ ఆదిత్య
