అంగరంగ వైభవంగా రష్మిక మెడలో మూడు ముళ్లు

Three thorns on Rashmika's neck in a state of grandeur
Spread the love

టాలీవుడ్ మోస్ట్ అడ్మైర్డ్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమ, పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి తెరదించుతూ.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు శుభ ముహూర్తాన విజయ్ దేవరకొండ, రష్మిక మెడలో మూడు ముళ్లు వేశారు. హిందూ శాస్త్రోక్తంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. సోషల్ మీడియాలో వీరిని అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోషి’ అనే పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. రష్మిక మందన్న కర్ణాటకలోని కూర్గ్ (కొడగు) ప్రాంతానికి చెందిన వారు. తమ ప్రాంత సంప్రదాయానికి గౌరవం ఇస్తూ.. ఈ రోజు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ జంట మరోసారి ‘కొడవ’ పద్ధతిలో వివాహం చేసుకోబోతున్నారు. సాధారణంగా కొడవ పెళ్లిళ్లు చాలా ప్రత్యేకంగా, విభిన్నమైన వస్త్రధారణతో సాగుతాయి. ఒకే రోజు రెండు వేర్వేరు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం విశేషం. విజయ్, రష్మిక పెళ్లి అంగరంగ వైభవంగా జరగడంతో టాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటవ్వడం పట్ల ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే వివాహ వేదిక వద్ద అతిథులు ఎవరూ ఫోన్‌ ఉపయోగించకూడదనే నిబంధన ఉండడంతో వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు. పెళ్లిలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని, డిజిటల్ పరధ్యానం లేకుండా కేవలం ఆత్మీయుల మధ్య ఈ వేడుక సాగాలని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇలాంటి వేడుకల్లో ఫోటోల కోసం చేసే హడావిడి కంటే, మనుషుల మధ్య ఉండే అనుబంధమే ముఖ్యమని విరోష్ జంట భావించింది. అందుకే, పెళ్లి మండపంలోకి ఫోన్‌లను అనుమతించలేదు. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసే అద్భుతమైన చిత్రాలను మాత్రమే ఆ తర్వాత అభిమానులతో పంచుకోవాలని వారు ప్లాన్ చేశారు. పెళ్లికి ముందు జరిగిన వేడుకలు కూడా ఎంతో వెరైటీగా సాగాయి. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో కుటుంబ సభ్యులు సందడి చేశారు. అలాగే, సాధారణంగా పెళ్లిళ్లలో సంగీత్ ఉంటుంది, కానీ ఇక్కడ విరోష్‌ ప్రీమియర్‌ లీగ్‌ పేరుతో ఒక సరదా క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. పెళ్లిని  ప్రైవేట్‌గా ఉంచినప్పటికీ, అభిమానుల కోసం ఒక భారీ విందును కూడా ప్లాన్ చేశారు.  చాలా కాలంగా స్నేహితులుగా ఉంటూ, ఇప్పుడు జీవిత భాగస్వాములుగా మారిన విజయ్ – రష్మిక జోడీకి సోషల్ మీడియా వేదికగా లక్షలాది మంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మార్చి 4న హైదరాబాద్‌ భారీగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.

Related posts