– ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకోవడంపై నందమూరి బాలకృష్ణ
– ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో బాలకృష్ణ చోటు దక్కించుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
– బాలయ్య బాబు గారు ఎప్పుడూ అన్ స్టాపబుల్.. ఆయనకు ఈ గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం.. ఏపీ ఐటీ మినిస్టిర్ నారా లోకేష్
-తెలంగాణలోని వర్ష ప్రభావిత ప్రాంతాల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించిన నందమూరి బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ అరుదైన గౌరవానికి ఎంపికైన తొలి హీరో బాలకృష్ణనే కావడం విశేషం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో స్థానం కల్పించినట్టుగా సీఈవో సంతోష్ శుక్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ బాలకృష్ణను ఘనంగా సత్కరించింది. ఈ మేరకు శనివారం (ఆగస్ట్ 30) నాడు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారు, ఏపీ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, సహజ నటి జయసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిత్ర పరిశ్రమలోని దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. ఈ ఈవెంట్‌లోనే నందమూరి బాలకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో వరదలకు అతలాకుతలం అయిన ప్రాంతాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై లక్షల ఆర్థిక విరాళాన్ని కూడా ప్రకటించారు.
కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ* .. ‘నాకు ఇంతటి ధన్యమైన జన్మను ఇచ్చిన దైవాంశ సంభూతుడు, నా గురువు, నా దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, కళా ప్రపూర్ణ, నట రత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, నా తల్లి బసవతారకం గారికి ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి శ్రీ బండి సంజయ్ గారికి, ఏపీ ఐటీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, సహజ నటి జయసుధ గారికి, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ సీఈఓ సంతోష్ శుక్లా గారికి, జాయింట్ సెక్రటరీ ఓలా గారికి, ఉస్మాన్ గారికి కృతజ్ఞతలు. ఈ రోజు మా బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అంతా చెప్పేశారు. నాది చాలా పెద్ద కుటుంబం. హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు, తెలుగు చిత్ర సీమలోని శ్రేయోభిలాషులు ఇలా నాది చాలా పెద్ద కుటుంబం. నేను ఇండస్ట్రీలో 50 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణాన్ని పూర్తి చేశాను. నాకు ఈ లెక్కలన్నీ సరిగ్గా గుర్తుండవు. అంకెలన్నీ కూడా అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. నా మనవళ్లు కూడా నన్ను బాలా అని పిలుస్తుంటారు. నటుడిగా మా నాన్న గారే నాకు స్పూర్తి. రాజకీయాల్లోకి రాక ముందే ప్రజా సేవా చేసేవారు. వరదల సమయంలో ముందుండి సాయం చేసేవారు. ప్రాంతాలు వేరైనా సరే విపత్కర పరిస్థితుల్లో ఆయన సేవా కార్యక్రమాలు చేశారు. అందరి సహాయ సహకారాలతో క్యాన్సర్ హాస్పిటల్‌ను నడిపిస్తున్నాను. నేను నా హిందూపురం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. కోట్ల మంది అభిమానాన్ని పొందడం నా పూర్వ జన్మ సుకృతం, జన్మజన్మల రుణబంధం అని అనిపిస్తుంటుంది. సినిమా అనేది బలమైన మాధ్యమం. నా దర్శక, నిర్మాతల సహకారంతోనే ఈ స్థాయికి వచ్చాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ది చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ, ఏపీలోనూ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. కళకి ఎప్పుడూ భాషా బేధం, లింగ బేధం ఉండదు. మన తెలుగు సినిమా ఇప్పుడు ఆస్కార్ స్థాయికి ఎదిగింది. ఇది మన తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం. ఈ రోజు నాకు ఇలా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నేను 13 ఏళ్ల వయసులోనే ‘తాతమ్మ కల’ మూవీ చేశాను. గత ఐదు దశాబ్దాల్లో నేను ఎన్నో జానర్లలో, ఎన్నెన్నో పాత్రల్ని పోషించాను. ‘ఆదిత్య 369’ అనేది ఇండియాలో మొట్ట మొదటి సైఫై చిత్రం. 50 ఏళ్లలో 110 చిత్రాలు చేశాను. నేను చిత్ర సీమకు చేసిన సేవకు గానూ ఈ గుర్తింపు దక్కడం ఆనందంగా ఉంది. నేను మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవలందిస్తున్నాను. ఇవన్నీ నేను ఒక్కడినే సాధించలేదు. ఈ ప్రయాణంలో నా దర్శక, నిర్మాతలు, కుటుంబ సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. నా భార్య వసుంధర ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిల్చుని కుటుంబాన్ని చూసుకున్నారు. కేంద్రం నుంచి రీసెంట్‌గా పద్మ భూషణ్ అవార్డు లభించింది. ‘భగవంత్ కేసరి’కి ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. నేను చేసిన ‘అన్ స్టాపబుల్’ షో అరుదైన రికార్డులు సాధించింది. నాకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. నాకు విషెస్ అందించిన అమితాబ్ గారికి, రజినీకాంత్ గారికి ధన్యవాదాలు. అభిమానుల ప్రేమ వల్లే ఈ విజయాల్ని, రికార్డుల్ని సాధించాను. ఇదే ఉత్సాహం, ప్యాషన్‌తో మున్ముందుకు సాగుతానని మాటిస్తున్నాను. ఈ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది’ అని అన్నారు. ఇటీవల తెలంగాణలో వర్షం కారణంగా ప్రభావితమైన ప్రాంతాలలో సహాయక చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కి 50 లక్షల విరాళాన్ని ప్రకటిస్తున్నాను’ అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ .. ‘బాలకృష్ణ గారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉంది. ఆయనలోని భోళా తనం, గంభీరత్వం, నచ్చిందే చేస్తాడు.. నచ్చకపోతే రుద్ర తాండవమే. ఆయన నిర్మొహమాటంగా అన్నీ మొహం మీదే చెబుతుంటారు అలాంటి ఓ మంచి వ్యక్తి పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. యాభై ఏళ్లుగా హీరోగా రాణిస్తున్న ఏకైక హీరోగా ఆయనకు ఈ అరుదైన గుర్తింపు వచ్చింది. ఇది మన తెలుగు వారికి గర్వ కారణం. బాలకృష్ణ గారు డాక్టర్ కావాల్సింది.. యాక్టర్ అయ్యారు. ‘తాతమ్మ కల’ నుంచి ‘మంగమ్మగారి మనవడు’, ‘సమర సింహా రెడ్డి’ నుంచి ‘డాకు మహారాజ్’ వరకు.. ఇప్పుడు ‘అఖండ 2’ కూడా రాబోతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరినీ అలరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారు గొప్ప నటులు అవుతారని ‘తాతమ్మ కల’ సమయంలో భానుమతి గారు అన్నారని నేను తెలుసుకున్నాను. ఆమె అన్నట్టే ఈ రోజు బాలకృష్ణ గారు గొప్ప స్థాయికి వెళ్లారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి అమిత్ షా గారు కూడా చెబుతుంటారు. ఎఫ్‌సీఆర్ విషయంలోనూ అమిత్ షా గారు సపోర్ట్ చేశారు. ఏపీలోనూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించబోతోన్నారని తెలిసిందే. ఈ రోజు ఇలా బాలకృష్ణ గారికి గౌరవం లభించడం తెలుగు వారికి గర్వ కారణం. బాలకృష్ణ గారు ఇంకా మున్ముందు ఇదే జోష్‌తో కొనసాగాలని, ఎన్నెన్నో రికార్డులు సృష్టించాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని అన్నారు.
ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడుతూ .. ‘బాలకృష్ణ గారి అల్లుడుగానా? ఏపీ మంత్రిగానా? ఏ పాత్రలో ఈ రోజు ఇక్కడ మాట్లాడాలో అర్థం కావడం లేదు. చరిత్ర రాయాలన్నా? మళ్లీ తిరిగి రాయాలన్నా? అది కేవలం బాలయ్య బాబు గారి వల్లే అవుతుంది. మీ అందరికీ ఆయన బాలయ్య బాబు.. కానీ నాకు మాత్రం ముద్దుల మావయ్య. 50 ఏళ్లు సినిమా రంగంలో, రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారు. మాస్ అనే పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు.. కానీ మా బాలయ్య బాబుకి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ‘తాతమ్మ కల’ నుంచి ‘అఖండ 2’ వరకు ఎన్నెన్నో గొప్ప పాత్రలు పోషించారు. అందరికీ వయసు పెరుగుతూ ఉంటే.. బాలయ్య బాబు గారు మాత్రం ఎఫ్పుడూ అలానే ఉంటారు. ఇప్పటి వరకు 110 చిత్రాలు చేశారు. ‘లెజెండ్’ మూవీ వెయ్యి రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. అన్ని రకాల జానర్లను టచ్ చేస్తూ ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో మీసం మెలేసినా, సింహంలా ‘అఖండ’లో గర్జించినా అది బాలయ్య గారికే సాధ్యం. బాలయ్య గారు దర్శక, నిర్మాతలకు డ్రీమ్ యాక్టర్. కరోనా సమయంలోనూ సినిమాను విడుదల చేసి ఎంతో మందికి స్పూర్తినిచ్చారు. బాలయ్య బాబు గారు ‘అన్ స్టాపబుల్’ షోతో దేశంలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. ఆయన బోళా శంకరుడు. అన్నీ మొహం మీదే చెబుతుంటారు. మనసులో ఏదీ దాచుకోరు. ఎన్నో ఎత్తు పల్లాల్ని చూసినా ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. బసవతారకం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూషన్ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. వరదలు, కరోనా సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళాల్ని అందించారు. బాలయ్య బాబు గారు ఎప్పుడూ అన్ స్టాపబుల్. ఆయనకు ఈ గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణం’ అని అన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్ సీఈవో సంతోష్ శుక్లా మాట్లాడుతూ .. ‘నందమూరి బాలకృష్ణ గారి గురించి గత కొన్ని రోజులుగా గూగుల్, యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటూనే ఉంటున్నాను. కానీ ఆయన గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువే అనిపించింది. నేను ఈ రోజు ఆయన్ను కలిసిన తరువాత ఆయన గొప్పదనం ఏంటో అర్థమైంది. నిజంగానే ఆయన ఓ సూపర్ స్టార్. భారతదేశంలో చాలా ప్రాంతాలు, భాషల్లో బాలకృష్ణ గారు ఫేమస్. ఆయనకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో ఆయన పేరు ఉండటం సంతోషంగా ఉంది. ఆయనకు ఈ రికార్డు దక్కడం తెలుగు వారికి, మన దేశానికి గర్వకారణం. జై హింద్.. జై భారత్’ అని అన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్ జాయింట్ సెక్రటరీ డా. ఓలా మాట్లాడుతూ .. ‘చిత్ర సీమలో 50 ఏళ్లుగా హీరోగా చేసిన సేవలకు గుర్తింపుగా నందమూరి బాలకృష్ణ గారి పేరుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కించాం. హీరోగా ఆయన ఇప్పటి వరకు 110 చిత్రాలు చేశారు. ఇందులో ఎక్కడా కూడా సైడ్ రోల్స్, విలన్ రోల్స్ చేయకుండా హీరోగా ఆయన అలరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 129 హీరోయిన్లతో ఆయన పని చేశారు. ఈ విషయంలోనూ ఇండియాలోని హీరోల్లో ఆయన రికార్డులు క్రియేట్ చేశారు. ఆయన నటించిన ‘లెజెండ్’ మూవీ ఒకే థియేటర్లో వెయ్యి రోజులు ఆడింది. అన్ని రకాల జానర్లను టచ్ చేస్తూ ఎన్నెన్నో గొప్ప పాత్రల్ని పోషించారు. బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గానూ ఆయన ఎన్నో సేవల్ని అందిస్తూనే ఉన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన రికార్డులు సృష్టించారు. అలా ఆయన సినీ, పొలిటికల్, సోషల్ సర్వీస్ విషయంలో ఎన్నెన్నో రికార్డులున్నాయి. కర్నూలులో వచ్చిన వరదల సమయంలో దాదాపు ఏడు కోట్ల సాయాన్ని ఆయన అందించారు. నరసింహానాయుడు, సింహా, లెజెండ్ చిత్రాలకు నంది అవార్డుల్ని అందుకున్నారు. కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయనకు చోటు కల్పించాం. ఈ రోజు నుంచి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్‌లో ఆయన పేరు ఉంటుంది. ఈ రోజు మేం ఆ సర్టిఫికేట్‌ను ఆయనకు అందిస్తుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
సహజ నటి జయసుధ మాట్లాడుతూ .. ‘నందమూరి బాలకృష్ణకు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం, ఈ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం ఆనందంగా ఉంది. కేవలం నటుడుగానే కాకుండా ఆయన గొప్ప వ్యక్తి. నేను నందమూరి తారకరామారావు గారితో నటించాను.. బాలకృష్ణ గారితో కూడా నటించాను. ఈ రోజు ఇలా మళ్లీ ఈ కుటుంబంతో ఇక్కడ ఉండటం ఆనందంగా ఉన్నాను. బాలకృష్ణ గారిని టెస్ట్‌మెంట్ అని అమితాబ్ గారు అన్నారు. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో ఆయనకున్న అంకిత భావం చాలా గొప్పది. బాలకృష్ణ గారు డెడికేషన్‌కు మారు పేరు. ఆయన ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి. ఇలాంటివెన్నో ఆయనకు రావాలి’ అని అన్నారు.
ఎఫ్‌డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. ‘బాలకృష్ణ గారు హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దక్కడం ఆనందంగా ఉంది. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారికి గర్వ కారణం’ అని అన్నారు.
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. ‘బాలయ్య బాబు గారి ఈ 50 ఏళ్ల సినీ జర్నీలో నేను కూడా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనకు కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఒకేలా ఉంటుంది. బాలయ్య బాబు 2.ఓని చూడబోతోన్నారు. బాలయ్య బాబు బంగారం.. ఐ లవ్ బాలయ్య.. జై బాలయ్య’ అని అన్నారు.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘బాలయ్య బాబు ఎప్పుడూ రికార్డులు బ్రేక్ చేస్తుంటారు. ఆయన ఇలానే ఇంకెన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ .. ‘బాలయ్య బాబు గారు నిజంగానే ఓ ‘లెజెండ్’. కష్టపడి పని చేస్తూ వెళ్తుంటే.. ఫలితం వెనకాలే వస్తుందని కృష్ణ పరమాత్ముడు చెప్పారు. బాలయ్య గారు ఇన్నేళ్లు కష్టపడుతూ వచ్చారు.. అందుకే అవార్డులన్నీ ఆయన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. బాలయ్య గారి ఎనర్జీ నాకు తెలుసు. ఆయన ఇంకెన్నో ఇలాంటి అవార్డులు, రివార్డుల్ని సాధిస్తారు. ఆయన ఈ యాభై ఏళ్ల జర్నీలో నేను 17 ఏళ్ల పాటు జర్నీని కొనసాగించడం ఆనందంగా ఉంది. మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మీ వెంటే ఉంటాను’ అని అన్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ .. ‘బాలయ్య బాబు ఎప్పుడూ ఫిల్టర్ లేకుండా ఉంటారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎప్పుడూ కూడా ఫిల్టర్ లెస్‌గానే ఉంటారు. ఆయన డాక్టర్ కాలేకపోయినా యాక్టర్‌గా మారి ఎంతో మందికి వినోదం రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు. ఆయనకు ఈ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ .. ‘బాలయ్య గారికి పని చేస్తుండేటప్పుడు వేరే ప్రపంచంలోకి వెళ్తుంటాను. ఇలా బుక్ రికార్డులే కాదు.. రేపు వచ్చే మా ‘అఖండ 2’ అన్ని రికార్డుల్ని చెరిపేస్తుంటుంది. ‘అఖండ’కి ముందు.. ‘అఖండ’కి తరువాత అన్నట్టుగా నా మ్యూజిక్ మారిపోయింది. నా మ్యూజిక్‌కు బాలయ్య గారు పునర్జన్మను ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆయనకు ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. బాలయ్య బాబు గారి యాభై ఏళ్ల సినీ జర్నీలో నేను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయనతో పని చేస్తుంటే గుడికి వెళ్లినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు.
నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ .. ‘సినీ రంగంలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన నా తమ్ముడు బాలకృష్ణకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం ఆనందంగా ఉంది. ‘రామ్ రహీం’ చిత్రానికి మొట్టమొదటగా మేకప్ వేసుకున్నారు. నాన్నగారి నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషించారు. ఆ తరువాత నా తమ్ముడు కూడా ఆయనలానే ఎన్నో జానర్లు, ఎన్నెన్నో పాత్రల్ని అద్భుతంగా పోషించారు. ఆయనలా ఈ తరంలో ఏ హీరో కూడా చేయజాలడు. నారథుడిలా మా నాన్న గారు ఓ పాత్రని మాత్రం పోషించలేకపోయారు. కానీ మా బాలకృష్ణ ఆ పాత్రని కూడా పోషించారు. అలా మా నాన్న గారిని మించిన తనయుడిలా బాలకృష్ణని చెప్పుకోవచ్చు. మా నందమూరి వంశానికి మకుటం మా నాన్న గారు అయితే.. ఆ మకుటానికి వన్నె తెచ్చే కలికితురాయి మా బాలకృష్ణ. మా బాలకృష్ణను చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. అతడిలా ఇంకెన్నో సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .. ‘పదేళ్ల వయసులో బాలయ్యని చూశాను. ఎంతో అందంగా ఉండేవారు. ఆ వయసులోనే శ్రీకృష్ణుడు, సత్య భామలా డైలాగ్స్ చెబుతుండేవారు. నట వారసత్వాన్ని కొనసాగిస్తాడని, రాణిస్తాడని అప్పుడే అనుకున్నాను. కానీ ఇలా యాభై ఏళ్లు కొనసాగుతాడని అనుకోలేదు. ఇలా కళా రంగంలో ఇన్నేళ్ల పాటు మెప్పించడం, ఒప్పించడం సాధారణ విషయం కాదు. ఎంతో అంకిత భావం ఉంటే తప్పా ఇలాంటివి సాధ్యం కావు. ఇంతటి పట్టుదల నీకు ఎక్కడిది? అని బాలయ్యని అడుగుతుంటాను. ఇప్పటికీ డైలాగ్స్‌ని ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తుంటాను.. ఎప్పుడూ వల్లెవేస్తుంటాను.. అని బాలయ్య చెబుతుంటాడు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలోని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. మళ్లీ శాతకర్ణి పుట్టాడా? అన్నట్టుగా అనిపించింది. ఎన్టీ రామారావు గారు ఆ పాత్రను పోషించినా.. అంత రక్తి కట్టించలేరేమో అన్నట్టుగా కనిపించింది. బాలకృష్ణ గారు ఇలాంటి అరుదైన రికార్డులు ఇంకెన్నో సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
<strong>ఫిల్మ్ ఛాంబర్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ‘తాతమ్మ కల’ ఈ రోజే రిలీజ్ అయింది. ఇప్పటికి ఆయన హీరోగా 51 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 65 ఏళ్ల వయసులో హ్యాట్రిక్ కొట్టి.. సెకండ్ హ్యాట్రిక్ హిట్‌కి రెడీ అయ్యారు. ఇలాంటి రికార్డ్ ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. ఆయన గుప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. హీరోగానే కెరీర్ స్టార్ట్ చేసి.. ఇంకా హీరోగానే కొనసాగుతుండటం..హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రాజకీయాల్లోనూ విజయం సాధించడం.. సేవా కార్యక్రమాలు చేయడం.. ఇలా ప్రపంచపటంలో చెప్పుకునే ఒకే ఒక్క పేరు నందమూరి బాలకృష్ణ’ అని అన్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ముంబై ప్రెసిడెంట్ ఉస్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. ‘ఈ రోజు నన్ను ఇక్కడకు ఆహ్వానించిన సంతోష్ గారికి ధన్యవాదాలు. బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తూ ఉంటుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆయన పేరు ఉండటం మన అందరికీ గర్వ కారణం’ అని అన్నారు.
ఈ కార్యక్రమానికి మైత్రి నవీన్ గారు, నాగవంశీ గారు, ఏసియన్ సునీల్ గారు, 14 రీల్స్ నుంచి రామ్ ఆచంట, గోపీ ఆచంట గారు, భరత్ భూషణ్ గారు హాజరయ్యారు.