తెలంగాణ కుటుంబ సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుంది: తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్

Telangana Family Survey is a role model for the country: Telangana Advocate JAC President, Eminent Advocate Nagula Srinivasa Yadav
Spread the love

మగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రెసిడెంట్, ప్రముఖ న్యాయవాది నాగుల శ్రీనివాస యాదవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల యొక్క స్థితిగతులు తెలుసుకునేందుకు, భవిష్య ప్రభుత్వ ప్రణాళిక ద్వారా మంచి మార్పు తీసుకు వచ్చే దిశగా, ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే తో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజంలో గొప్ప మార్పు రావడానికి ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 6 నుండి ఇండ్ల గుర్తింపు కార్యక్రమం, 9 నుండి ఇంటింటి సర్వే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో 87 వేల మందికి పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే పూర్తయిందని, జిహెచ్ఎంసి పరిధిలో 4.44 లక్షలకు పైగా ఇళ్ల సర్వే పూర్తయిందని ఆయన తెలిపారు. సర్వే పై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దని, సమాచారం గోప్యంగా ఉంటుందని, సర్వేతో ఎవరికీ కూడా ప్రభుత్వ పథకాలు కట్ కావని స్పష్టం చేసారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం మార్గదర్శకంగా తీసుకుంటుందన్నారు. గతంలో సర్వే చేయాలని దీక్షలు, ధర్నాలకు దిగిన వారందరూ సైలెంట్ గా ఉన్నారని, అన్ని కుల సంఘాలు, సర్వేను అందరూ స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో బీహార్, మహారాష్ట్ర లో సర్వే చేసినప్పటికీ తెలంగాణ లో జరిగే సర్వే దేశానికి దిక్సూచిగా ఉంటుందని అన్నారు. సర్వేతో జరిగే మార్పు స్పష్టంగా కనబడుతుందని అన్నారు. సమాచారం వచ్చాక ప్రాపర్ గా అనాలసిస్ చేసుకుని ఒక దిశా నిర్దేశం చేసుకునే విధంగా సర్వే జరుగుతుందన్నారు. ఏ వర్గాలకు న్యాయం జరగలేదో ఆయా వర్గాలకు న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళిక రూపొందించనున్నట్లు నాగుల శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో జరగని సర్వే తెలంగాణ లో జరుగుతున్నదని, అన్ని కుల సంఘాల ప్రతినిధులు తమ కులస్తులను చైతన్య పరిచి సరైన సమాచారం ఇచ్చేలా ప్రోత్సహించాలని కుల సంఘాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, బ్యాంక్ ఖాతా కి ఆప్షన్ అడుగుతున్నారని, బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగడం లేదని, అకౌంట్ ఉన్నదా లేదా అన్న సమాచారం మాత్రమే అడుగుతున్నట్లు చెప్పారు. ఎవరికేని ఎలాంటి అనుమానాలు, ఇబ్బందులు ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్లు, స్పెషల్ నోడల్ పర్యవేక్షణ అధికారులు నివృత్తి చేస్తారని తెలిపారు. సర్వే చేసే వారెవరు ప్రైవేటు వ్యక్తులు కాదని, ప్రభుత్వం నియమించిన ఉద్యోగులని, ఐడెంటి కార్డు కూడా ఉందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. అనవసర రాద్ధాంతం చేయకుండా, ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కల్పించకుండా సర్వే నిరాటంకంగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

Leave a Comment