కోట శ్రీనివాసరావు ఇక లేరు అన్న వార్త తెలుగువారిని విషాదంతో ముంచెత్తింది. కోట శ్రీనివాసరావు విలక్షణమైన అభినయాన్ని తలచుకొని కొందరు ఆయనను మరో నాగభూషణంగా అభివర్ణించారు. కొందరు రావు గోపాలరావుతోనూ, మరికొందరు నూతన్ ప్రసాద్ తోనూ పోల్చారు. నిస్సందేహంగా కోటతో పోల్చిన వారందరూ ప్రతిభావంతులే. బహుశా, కోట కొన్ని చిత్రాలలో అంతకు ముందు వారు ధరించిన తరహా పాత్రలు పోషించి ఉండవచ్చు. అందువల్ల జనం ఆ మహానటులతో కోటనూ పోల్చారేమో అనిపిస్తుంది. పలువురిని అనుసరించినా, కోట తనకంటూ ఓ ప్రత్యేకమైన బాణీని ఏర్పరచుకున్నారు. వందలాది విలక్షణమైన పాత్రలకు తన సలక్షణమైన అభినయంతో ప్రాణం పోశారు. అందువల్ల కోట తీరే వేరుగా నిలచింది. అలా ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించారు కోట. నాగభూషణం లాగా కామెడీని మిళితం చేసి పలు చిత్రాలలో కోట విలన్ గా మెప్పించారు.…
