వేతన వ్యవస్థను అమలు చేయడంలో కేంద్రం విఫలం
త్వరలో జర్నలిస్టులకు మెరుగైన హెల్త్ కార్డుల జారీ
సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలు వెలుగులోకి..
రోజురోజుకు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతున్న మీడియా సంస్థలు
దేశంలో జర్నలిస్టులను, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఒకే తాటిపైకి తెచ్చి ఇండ్ల స్థలాలు విషయంలో ఇచ్చిన తీర్పు చాలా నిరాశపరిచిందని, ఈవిషయంలో వాస్తవాలను గ్రహించకుండానే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి అధికారులతో స్వచ్ఛందంగా ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టులను కలిపి తీర్పు ఇవ్వడం చాలా దురదృష్టకరమన్నారు. సోమవారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టులందరికీ ఒకే రకమైన వేతనాలు అంటూ ఏమీ లేవని అన్నారు. దేశంలో జర్నలిస్టుల విషయంలో వేతన వ్యవస్థ చాలా దారుణంగా ఉందని పాకిస్థాన్ కంటే హీనంగా ఉందని అవేదన వ్యక్తం చేశారు. దీన్ని అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జర్నలిస్టులకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో త్వరలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. జర్నలిస్టుతో పాటు వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులకు సైతం పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించేలా కృషి చేస్తున్నామని చెప్పారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను కూడా ఆదుకోవడం తో పాటు కొంతమందికి పెన్షన్లు కూడా అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన తరువాత వచ్చే ఎక్స్ గ్రేసియా కన్నా దవాఖానాల్లో ఉండి ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న జర్నలిస్టులను కూడా ఆదుకునేందుకు తెలరీగాణ ప్రభుత్వం ముందుకు వొచ్చిందని, ఇప్పటికే హాస్పిటల్స్‌లో ఉంటూ చికిత్స పొందుతున్న కొందరికి లక్షరుపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా వైద్యం చేసిన దవాఖానలకు సుమారు ఏడు ఎనమిది వందల కోట్ల వరకు ప్రభుత్వం బాకీ ఉన్నందున కొన్ని హాస్పిటల్స్ వైద్యం అందించేందుకు ముందుకు రావడంలేని వారికి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటికే రూ.200 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. రోజురోజుకు మీడియాపై దాడులు పెరుగుతున్నాయంటే మనలో అనైక్యతనే అందుకు కారణమన్నారు. మీడియా సంస్థలు తమ స్వభావాన్ని కోల్పోయి పార్టీలకు అనుసంధానంగా పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. దీని వల్ల జర్నలిస్టులు తమ పాలసీని మరిచి సంస్థ పాలసీలు అంటూ అన్యాయాలను ప్రశ్నించే తత్యాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా విషయాలు సోషల్ మీడియా ద్వారనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా మంచి సంస్థలు ఉన్నాయని వాటికి కూడా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఒక పాలసీని తీసుకరానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ రెడ్ల చంద్రశేఖర్రెడ్డి, వంగాల శ్రీనివాస్ రెడ్డి. కోశాధికారి గుండాల యాదగిరి, ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, సలహాదారులు పుప్పాల ముట్టయ్య తదితరుల ఉన్నారు.