తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరుగుతున్న అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాలకు విశేష స్పందన లభిస్తోంది. శివపార్వతుల ఆనంద తాండవం ఆధ్యాత్మికత భావం దివ్యత్వాన్ని పెంపొందిస్తోంది. రెండవ రోజు నృత్యోత్సవాల్లో మంగళవారం ముంబయి కళాకారులు పవిత్ర భట్, అపర్ణ శాస్త్రి కలసి ఏక ద్వయం ప్రదర్శించి మైమరపించారు. ఆదిశంకరాచార్య అర్ధనారీశ్వర స్తోత్రం, నటరాజ స్వామి కుంచిత పాదం అంశాన్ని కళ్ళకు కట్టేలా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శివుడి ఆధ్యాత్మిక ప్రయాణం, విశ్వ నృత్య వైభవాన్ని ముంబయి కళాకారులు ప్రదర్శించి మంత్రముగ్దలను చేశారు. అనంతరం బెంగళూరు భరతనాట్యం కళాకారుడు డాక్టర్ వసంత్ కిరణ్ ప్రదర్శించిన సభాపతి అలరించింది. గోపాలకృష్ణ భారతి స్వర కల్పన చేసిన పదాన్ని వసంత్ కిరణ్ స్వయంగా పాడి ఆడి తమిళ చరిత్రకారుడు నందనార్ నటరాజ స్వామిలో కలసిపోయి నయనార్ గా ఎదిగిన క్రమాన్ని అద్భుతంగా ప్రదర్శించి కరతాళ ధ్వనులు అందుకున్నారు. అగ్నిగుందంలో నడచి చిదంబరం సభాపతి నటరాజ స్వామిలో విలీనమై ఆత్మ విముక్తి చేసుకున్న ఉదంతాన్ని ప్రదర్శించిన తీరు ఆకట్టుకుంది. చివరగా హైదరాబాద్ భరతనాట్య సంచలన కళాకారిణి వైష్ణవి సాయినాధ్ తన బృందంతో చేసిన నృత్యాంశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. విశ్వ లయ, అక్ష్యాలకు సంపూర్ణ ఆది గురువు శివుడు అంటూ నృత్యం ద్వారా ఆవాహనం చేసుకున్న ప్రదర్శన ఆద్యంతం ఉర్రూతలూగించింది. సంక్లిష్ట ఫుట్ వర్క్, అత్యంత క్లిష్టమైన గణిత నమూనాలు, అత్యధిక రిథమిక్ శక్తితో ప్రదర్శించిన భరత నాట్యం అద్భుతం అనే చెప్పాలి. సమానత్వం, సార్వత్రిక సామరస్యం చాటి చెబుతూ చక్కని లయ బద్ధ సంగీతానికి చేసిన పద విన్యాసం విశేషంగా సాగింది. విశ్వం అందాన్ని వైష్ణవి సాయినాథ్ పార్వతీదేవిగా మారి సున్నితమైన లాస్యంతో ప్రదర్శించిన సోలో నృత్యాంశం, అలాగే సంధ్యా సమయ తాండవం, ఉమా మహేశ్వర ఉత్కంఠభరిత తాండవ దృశ్యాలు మనసులను మైమరపించాయి. జైళ్లు సర్వీసుల డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు డాక్టర్ ఆనంద శంకర్ జయంత్, ఉమా మహేశ్వరి, డాక్టర్ కళాకృష్ణ అతిధులుగా పాల్గొని అర్ధనారీశ్వర నృత్యోత్సవాలు అద్భుతం అబ్బురం అంటూ కొనియాడారు. కళాకారులను అభినందించి సత్కరించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన యువ నాటకోత్సవాల్లో ప్రాధమిక పాఠశాల స్థాయిలో నృత్య నాటక అభ్యాసం జరిగేలా మంత్రులతో హామీ పొందామని, ఇప్పుడు ఈ జాతీయ నృత్యోత్సవాల్లో గుర్తింపు పొందిన కళాకారులకు పర్యాటక ప్రదేశాల్లో వసతి సౌకర్యాల్లో రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడం సంతోషదాయకం అన్నారు. అర్ధనారీశ్వరం జాతీయ నృత్యోత్సవాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిభ కలిగిన ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీతలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే ముగింపు ఉత్సవాల్లో న్యూఢిల్లీకి చెందిన యామిని రెడ్డి, బెంగళూరుకు చెందిన సూర్య ఎన్. రావు, నిధగా కరుణాళ్, రచన నృత్య ప్రదర్శనలు వుంటాయని వ్యాఖ్యాత మురళీకృష్ణ ప్రకటించారు. ఆర్.వినోద్ కుమార్, అశోక్, రేఖ పర్యవేక్షించారు.

