సారా అలీఖాన్ : విలక్షణమైన వ్యక్తిత్వం

Sara Ali Khan: A unique personality
Spread the love

వారసత్వంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం కత్తి మీద సామే. తల్లి అమృతాసింగ్‌ గంభీరం.. తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ వాక్చాతుర్యం పుణికిపుచ్చుకున్న సారా అలీఖాన్‌.. నేటి తరం కథానాయికలలో అత్యంత విలక్షణమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇటీవల ఆమె చుట్టూ ముసురుతున్న వివాదాలు, ఆమె ఇంటర్వ్యూలను గమనిస్తే సారా ఒక గ్లామర్‌ డాల్‌ మాత్రమే కాదని, గట్టి పట్టుదల ఉన్న నటి అని అర్థమవుతుంది. గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో సారా అలీఖాన్‌ పేరు మార్మోగుతోంది. దానికి కారణం ఆమె సినిమా మాత్రం కాదు, ఆమె ఆధ్యాత్మిక విశ్వాసాలు. కేదార్‌నాథ్‌ ఆలయానికి ఆమె తరచుగా వెళ్లడం అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఉత్తరాఖండ్‌లోని ఆలయ కమిటీలు హిందూయేతరుల దర్శనంపై కొన్ని నిబంధనలు విధుస్తున్నట్టు వస్తున్న వార్తలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. సనాతన ధర్మంపై నమ్మకం ఉందని అఫిడవిట్‌ ఇస్తేనే దర్శనానికి అనుమతిస్తారనే ప్రతిపాదనపై నెటిజన్లు సారాను ఉద్దేశించి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. వివాదాలు ఎన్ని వచ్చినా తన నమ్మకాన్ని హుందాగా చాటుకోవడం ఆమె పరిణితికి నిదర్శనం. సారా అలీఖాన్‌ కెరీర్‌ గ్రాఫ్‌ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది.’మెట్రో ఇన్‌ దినో’ వంటి విభిన్న చిత్రాల తర్వాత ఆమె కమర్షియల్‌ చిత్రాల్లోనూ సత్తా చాటుతోంది. అక్షయ్‌ కుమార్‌తో కలిసి నటించిన ‘స్కైఫోర్స్‌’ చిత్రం సారాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ డ్రామాలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం సారా చేతిలో ధర్మా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఒక భారీ చిత్రం, మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తన సినిమా ఎంపికల గురించి మాట్లాడుతూ .. ”నేను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. కేవలం స్క్రీన్ ప్రెజెన్స్‌ కోసం కాకుండా, కథను మలుపుతిప్పే పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నాను” అని చెప్పుకొచ్చారు. వేల కోట్ల ఆస్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చినా సారా ఆలోచనలు మాత్రం చాలా సాధారణంగా ఉంటాయి.

Related posts