చిత్రం: ‘పుష్ప- ది రైజ్’
విడుదల : డిసెంబర్ 17, 2021
Tollywoodtimes రేటింగ్ : 2./5
నటీనటులు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న
సమంత (స్పెషల్ సాంగ్),
ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్,
సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్,
శత్రు, అనసూయ భరద్వాజ్ తదితరులు
రచన, దర్శకత్వం: సుకుమార్
నిర్మాణం : మైత్రీ మూవీస్ -ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు : నవీన్ ఏర్నేని- వై రవిశంకర్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : మిరోస్లా క్యూబా బ్రోజెక్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, రూబెన్
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘పుష్ప’ మూవీని రెండు భాగాలుగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందులో మొదటిభాగాన్ని ‘పుష్ప- ది రైజ్’ పేరిట నేడు (డిసెంబర్ 17)న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. మైత్రీ మూవీస్ నిర్మించిన పాన్ ఇండియా మూవీ ఇది. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా. విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కెరీర్ పరంగా టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న నేపథ్యంలో వచ్చిన చిత్రమిది కావడంతో సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘పుష్ప’పై ఆసక్తి పెరిగింది. మోషన్ పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. మరి ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే…
కథ: గంధం చెక్కల అక్రమ వ్యాపారంలో కూలీగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు పుష్ప రాజ్ ( అల్లు అర్జున్). తిరుపతి శేషాచలం అడవుల్లో అతడి జీవితం సాగుతుంటుంది. చెప్పుకోవడానికి ఇంటి పేరు లేకపోవడం, కూలీగా తన జీవితాన్ని చూసి ప్రపంచాన్ని జయించాలనే కసి పెరుగుతుంది. వ్యాపారంలో ఎదురు పడిన కొండారెడ్డి (అజయ్ ఘోష్), మంగళం శ్రీను (సునీల్) దాక్షయిని (అనసూయ)తో చేతులు కలుపుతాడు.ఈ నేపథ్యంలో ఒకసారి తనకు అన్యాయం చేసిన మంగళం శ్రీనును ఎదురించి సవాల్ విసురుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పోలీస్ ఉన్నతాధికారిగా వచ్చిన భన్వర్ సింగ్ షెకావత్ (ఫాజిల్ ఫహద్) అమీతుమీ సిద్దమవుతాడు. తాను మనుసు పడిన తన గ్రామానికి చెందిన శ్రీవల్లి (రష్మిక మందన్న)తో పెళ్లిని అడ్డుకొనేందుకు కుట్రలు పన్నుతారు. అయితే తన జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలనే లక్ష్యానికి పుష్ప ఎలా చేరుకొన్నాడు? తనకు ఎదురుపడిన మంగళం శ్రీనుతో చాణక్య నీతిని ఎలా ప్రదర్శించాడు.. తన కోసం కాపు కాసే పోలీస్ అధికారులను ఎలా బోల్తా కొట్టించాడు… తాను మనసుపడిన శ్రీవల్లిని పెళ్లికి ఎలా ఒప్పించాడు.. ఈ కథలో ఎంపీ భూమిరెడ్డి సిద్దప్ప నాయుడు (రావు రమేష్) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘పుష్ప’ కథ.
విశ్లేషణ : కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, బన్నీ పాత్రలోని షేడ్స్ ను, రష్మిక మందన్నాతో సాగే లవ్ ట్రాక్ ను, అలాగే అడవి నేపథ్యాన్ని.. ఆ నేపథ్యంలోని ఎర్రచందనం మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా సుకుమార్ ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బన్నీ పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. బన్నీ – రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. శ్రీవల్లీగా రష్మిక మందన్న డీ గ్లామర్ లుక్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. నటన పరంగానూ రష్మిక ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కింది. హీరోయిన్ సమంత చేసిన స్పెషల్ సాంగ్ థియేటర్స్ లో విజిల్స్ వేయించింది. జపాన్‌లో మొదలుపెట్టిన కథ తిరుపతికి చేరుకొన్న విధానంతో కథనం ఎలా ఉండబోతుందోననే ఆసక్తిని రేపింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించి వివరిస్తూ సాగే ఈ కథ పుష్ప ఎంట్రీతో చాలా వేగంగా పరుగులు పెడుతుంది. స్మగ్లింగ్‌లో అతడు అనుసరించే తెలివితేటలు, కూలీ నుంచి భాగస్వామిగా ఎదిగే పరిణామ క్రమం దర్శకుడు సుకుమార్ ప్రతిభకు మరోసారి అద్దంపట్టింది. రష్మిక ప్రేమయాణం, తన కుటుంబ నేపథ్యం, తన జీవితానికి, తన తల్లికి జరిగిన అన్యాయం అంశాలు చాలా ఎమోషనల్‌గా కనిపిస్తాయి. తన ఇంటి పేరు అనే ఎమోషనల్ పాయింట్‌తో కథను డ్రైవ్ చేసిన విధానం సినిమాకు మరింత సెంటిమెంట్ చేర్చింది. ఇప్పటి వరకు సాఫ్ట్ హీరోయిజం ఆకట్టుకొన్న అల్లు అర్జున్ పుష్పగా చెలరేగిపోయారు. ఫస్టాఫ్‌లో టన్నుల కొద్ది గంధపు దుంగలను ఏటి వాగు ద్వారా పంపించే సీన్ ప్రేక్షకులకు మంచి జోష్ నింపుతుంది. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే మంగళం సీన్‌ను ఎదురించే ఎపిసోడ్‌తో కథ మరో లెవెల్‌కు చేరిపోతుంది. మంగళం శ్రీను ఇంటిలో యాక్షన్ ఎపిసోడ్స్, ఫారెస్ట్‌లో పుష్పను చంపడానికి కొండారెడ్డి చేసిన మర్డర్ ప్లాన్, దానిని నుంచి తప్పించుకొన్ని మంగళం శ్రీను బామ్మర్ధిని చంపిన ఎపిసోడ్స్ కథను పీక్స్ తీసుకెళ్తాయి. ఎంపీ నాయుడు, మంగళం శ్రీను, పుష్ప మధ్య జరిగిన మీటింగ్ కథను మరింత పవర్‌ఫుల్‌గా మార్చుతుంది. చివర్లో భన్వర్ సింగ్ షెకావత్‌తో పుష్ప పోలీస్ స్టేషన్ సీన్, అలాగే ఫారెస్ట్‌లో ఇద్దరి మధ్య ఉండే సన్నివేశాలు, డైలాగ్స్ రచ్చగా మారాయి. చివర్లో పెళ్లి పీటల మీదకు వచ్చిన పుష్ప బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా, క్రేజీగా ఉంది. దర్శకుడు సుకుమార్ తన మదిలో మెదిలిన పాయింట్‌ను తెరపై అల్లుకున్న తీరు సూపర్. పాత్రలను డిజైన్ చేసిన విధానం.. పాత్రల హావభావాలు, ఎమోషనల్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు మేళవించి తెర మీద చూపించిన పద్ధతి చాలా బాగుంది. సినిమాలో సెకండాఫ్ అయితే మరీ స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. నేపథ్యం కొత్తగా తీసుకున్నా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నట్లు స్మగ్లింగ్ సీన్స్ నే ఎక్కువ పెట్టారు. పోలీసుల నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలు, అటాక్ లు కూడా పూర్తి సినిమాటిక్ గానే సాగాయి. శేషాచలం అడవుల్లో నుంచి వేల కోట్ల విలువ చేసే ఎర్రచెందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేస్తారనే దాని గురించి ఇంతకు ముందే విన్నా పూర్తి వివరాలు మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి. అయితే ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్మగ్లింగ్ గురించిన వివరాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన ఈ చిత్రం సీక్రెట్ స్మగ్లింగ్ అంశాలను ప్రపంచానికి తెలియజేసేలా అద్భతంగా తెరకెక్కించారు. హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాలో మాస్ అంశాలను చూపిస్తూనే.. ఇటు మదర్ సెంటిమెంట్, అటు లవ్ సెంటిమెంట్ క్యారీ చేశారు సుకుమార్. భారీ పోరాట సన్నివేశాల నడుమ.. మధ్య మధ్యలో తెర మీదకు వచ్చే ఈ ఉద్వేగభరిత సంఘటనలు ప్రేక్షకులను ఏమోషనల్ అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా పుష్ప రాజ్ తన మనసులో ఆవేదనను తల్లితో పంచుకునే సన్నివేశంలో ఎలా గుండెల్ని పిండేశాడో, ప్రియురాలికి ప్రేమను తెలిపే సీన్ లో అంత వినోదాన్ని పండించాడు. ఇక క్లయిమాక్స్ లో ఒకటి ఎక్కువుంది అంటూ గుండెలోని కసిని వ్యక్తం చేసిన తీరూ అమోఘమనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే...ఈ సినిమాలో బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదు. ఈ సినిమాకు అల్లు అర్జున్ నటనే హైలెట్. అతడి యాక్షన్, డైలాగ్ డెలివరీ చాలా బావుంది. చిత్తూరు యాసలో చితక్కొట్టాడు. ఒక రకంగా వన్‌మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. పుష్పగా పాత్రలో ఇరగదీశాడు. చక్కటి ఫెర్ఫార్మెన్స్‌తో తనలోని నటుడిని బయటపెట్టాడు. కొండారెడ్డి, మురుగన్, మంగళం శ్రీను, పోలీస్ ఉన్నతాధికారులు గోవింద్ (శత్రు), షెకావత్ (ఫాహద్ ఫాజిల్) పోటాపోటీగా నడిచే సీన్లలో విశ్వరూపం చూపించాడు. రొమాంటిక్ సీన్లలో రష్మికతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించాడు. అయితే.. ఈ సినిమాలో రష్మిక, అనసూయ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అయినప్పటికీ.. కొన్ని సన్నివేశాల్లో వాళ్లు చెలరేగి పోయారు. బన్నీతో కొన్ని సీన్లలో రష్మిక బాడీ లాంగ్వేజ్, కళ్లతో హావభావాలు పలికించిన తీరు ఆకట్టుకొన్నాయి. మంగళం శ్రీను భార్యగా దాక్షయిని పాత్రలో అనసూయ కనిపించింది. ఇక కొండారెడ్డిగా అజయ్ ఘోష్ ఆకట్టుకొన్నాడు. పోలీస్ ఆఫీసర్‌గా శత్రు ఒక ఢిఫరెంట్ రోల్‌తో మంచి మార్కులు కొట్టేశాడు. ఇక పుష్పకు స్నేహితుడిగా నటించిన కేశవ్ (జగదీష్) బాడీ లాంగ్వేజ్, టైమింగ్‌తో కూడిన డైలాగ్స్ తో భేష్..అనిపించాడు. ఈ చిత్రంలో హైలెట్‌గా మారిన రెండు పాత్రలు మంగళం శ్రీనుగా సునీల్, భన్వర్ సింగ్ షెకావత్‌గా ఫాహద్ ఫాజిల్. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని పాత్రలో సునీల్ కనిపించడమే కాకుండా కొత్తరకమైన బాడీ లాంగ్వేజ్‌తో సూపర్ గా ఆకట్టుకున్నాడు. విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ చివరిలో ఎంట్రీ ఇచ్చినా.. హై వోల్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌తో తన మార్కును చూపించాడు.
సాంకేతిక అంశాల గురించి : దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంది. ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్ బిడ్డా’ ఇలా సాంగ్స్ అన్ని బాగున్నాయి. అయితే, అన్ని సాంగ్స్ లో కల్లా ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ పాట మాత్రం ప్రేక్షకులను ఇంకా బాగా అలరిస్తోంది. దేవి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. పాటలు ఆడియోలో ఎంత క్రేజ్‌ను కల్పించాయో.. తెర మీద అంతే మొత్తంలో ఆకట్టుకొన్నాయి. బన్నీ, రష్మిక పాటలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిరోస్లావ్ కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఎంతో రియలిస్టిక్ గా, గ్రాండ్ విజువల్స్ తో ప్రతి సీన్ ను కుబ చాలా బ్యూటిఫుల్ గా చూపించాడు. తన కెమెరా పనితనంతో తెరపై చక్కని ప్రతిభను చాటాడు. ఫారెస్ట్ సీన్లు, ఛేజింగ్ సీన్లు, యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లే కాకుండా ప్రతీ సన్నివేశాన్ని, ప్రతీ ఆర్టిస్టు మూడ్‌ను అద్బుతంగా కెమెరాలో బంధించాడు. శ్రీకాంత్ అందించిన డైలాగ్స్ పేలాయి. విభిన్నమైన కథను ప్రోత్సాహించి ప్యాన్ ఇండియా లెవల్‌లో తెలుగు సినిమా ప్రైడ్‌ను చెప్పడానికి మరోసారి కారణం అయిన నిర్మాతలు నవీన్ యెర్నేని-వై రవి ప్రకాశ్ లను అభినందించాల్సిందే. దర్శకుడు సుకుమార్ కథ, హీరో అల్లు అర్జున్ ఫెర్ఫార్మెన్‌ను నమ్మిన తీరుకు, వారు చేసిన ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేం. మొత్తం మీద ఈ సినిమా చూసిన తర్వాత ‘పుష్ప’ పాత్రలో అల్లు అర్జున్ తప్ప మరొకరిని ఊహించుకోలేం. లవ్, యాక్షన్, రొమాంటిక్, ఎమోషన్స్, కామెడీ లాంటి అంశాలన్నీబాగా కుదిరాయి. ప్రతీ ఆర్టిస్టు ఫెర్ఫార్మెన్స్, పాత్రల డిజైన్ అందర్నీ ఆకట్టుకొంటుంది. తెర మీద వచ్చిన ఊరమాస్ సినిమా ఇది. క్లాస్ అండ్ మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ అనే తేడా లేకుండా అందరూ చూసి ఆనందపడే చిత్రమిది. సమంత ఐటెమ్ సాంగ్ ప్రేక్షకులకు మరో బోనస్ అనే చెప్పొచ్చు. ఓవరాల్ గా ఆడియన్స్ కి ఈ సినిమా ఎవరేజ్ గా అనిపిస్తుంది. కానీ బన్నీ ఫ్యాన్స్ కి మాత్రం మంచి అనుభూతిని ఇస్తోంది.
-ఎం.డి అబ్దుల్