‘టాక్సిస్’ విషయంలో పరిశ్రమను, డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను కాపాడండి : నట్టి కుమార్ విజ్ఞప్తి

Protect the industry, distributors, and exhibitors regarding 'Taxis': Natti Kumar's appeal.
Protect the industry, distributors, and exhibitors regarding 'Taxis': Natti Kumar's appeal.
Spread the love

* ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు
* తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు రీఫండ్ చేయాలి
* పాన్ ఇండియా పేరుతో ఖిచిడీ చేయకూడదు
* ప్రేక్షకుల అభిరుచిని, వారి సమయాన్ని, వారి డబ్బును గౌరవించాలి

‘టాక్సిస్’ సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. పాన్ ఇండియా హీరో, నేషనల్ హీరో, ఇంటర్నేషనల్ హీరో అయిన యాష్ గారిని నమ్మి, ఆయన ఇమేజ్‌ను నమ్మి ప్రేక్షకులు నాలుగు రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ సినిమా ఇంత దారుణంగా ఉంటుందని, ఇంటర్వెల్‌కే ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వెళ్లిపోతారని ఎవరూ ఊహించలేదు. బుక్ చేసుకున్న టికెట్లకు కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి రావడం అంటే మనం సినిమా ఎలా తీశాము, ఏం తీశాము అనేది ఆలోచించుకోవాలి. ఇది కేవలం ఒక సినిమా ఫెయిల్యూర్ కాదు. దీని ప్రభావం మొత్తం డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ వ్యవస్థపై పడుతోంది. యాష్ గారిని, ప్రొడ్యూసర్ కెవిన్ గారిని నమ్మి తెలుగు డిస్ట్రిబ్యూటర్లు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమా రైట్స్ తీసుకున్నారు. ఆ డబ్బును చాలామంది డిస్ట్రిబ్యూటర్లు బయట నుంచి తెచ్చి, అప్పులు చేసి, వడ్డీలకు తీసుకుని పెట్టుబడి పెడతారు. ఆ తర్వాత సబ్-డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా అదే నమ్మకంతో డబ్బులు పెడతారు. కానీ ఇప్పుడు పరిస్థితి 10% కాదు, 5% కూడా రికవరీ కాని విధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని నేను ఇప్పటివరకు చూడలేదు. డిస్ట్రిబ్యూటర్లు బయట నుంచి తెచ్చిన డబ్బుపై వడ్డీలు చెల్లించాలి. సినిమా కలెక్షన్లు రాకపోతే ఆ వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతుంది. అదే విధంగా ఎగ్జిబిటర్లు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నష్టం ఎగ్జిబిటర్ల దగ్గరే ఆగిపోకూడదు. దీని ప్రభావం రాబోయే సినిమాలపై కూడా పడుతుంది. నిర్మాతలపై, డిస్ట్రిబ్యూటర్లపై నమ్మకం దెబ్బతింటుంది. తర్వాత సినిమాలకు డబ్బులు పెట్టడానికి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనుకడుగు వేసే పరిస్థితి వస్తుంది. అందుకే యష్ గారు, ప్రొడ్యూసర్ కెవిన్ గారు వెంటనే తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు రీఫండ్ చేయాలని నా విజ్ఞప్తి. మీరు వెంటనే డిస్ట్రిబ్యూటర్లకు రీఫండ్ చేస్తే, డిస్ట్రిబ్యూటర్లు కూడా వెంటనే ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించగలుగుతారు. ఎవరి దగ్గరా డబ్బు ఆగిపోకుండా ఉంటుంది. వడ్డీల భారం మరింత పెరగకుండా ఉంటుంది. మీరు వెంటనే రీఫండ్ చేస్తే మనం పరిశ్రమను కాపాడినవాళ్లం అవుతాం. డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను కాపాడినవాళ్లం అవుతాం. సినిమా తీసేటప్పుడు ‘పాన్ ఇండియా ’ అనే పేరు మాత్రమే సరిపోదు. పాన్ ఇండియా సినిమా అంటే ఆచితూచి ఆలోచించి, అన్ని ప్రాంతాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని, మంచి కథ మరియు మంచి కంటెంట్‌తో సినిమా తీయాలి. హీరోకు ఇమేజ్ ఉంది, ఫాలోయింగ్ ఉంది, నిర్మాత దగ్గర భారీ డబ్బు ఉంది కాబట్టి సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు చూస్తారని అనుకోవడం తప్పు. పాన్ ఇండియా పేరుతో ఖిచిడీ చేయకూడదు. ప్రేక్షకుల అభిరుచిని, వారి సమయాన్ని, వారి డబ్బును గౌరవించాలి. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. అలాంటి సమయంలో టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులపై భారం వేయడం వల్ల సినిమా పరిశ్రమపై ఉన్న నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రేక్షకుల మూడు గంటల సమయం, వారు కష్టపడి సంపాదించిన డబ్బు చాలా విలువైనవి. కాబట్టి ప్రేక్షకులకు కూడా బాధ్యతగా సమాధానం చెప్పాలి. యష్ గారు, ప్రొడ్యూసర్ కెవిన్ గారు, దర్శకుడు.. ప్రేక్షకులకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి ఈ మాటలు చెప్పడం లేదు. కానీ వందల మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. కాబట్టి నా విజ్ఞప్తి ఒక్కటే..’టాక్సిస్’ విషయంలో పరిశ్రమను, డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను కాపాడండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు రీఫండ్ చేయాలి.. పాన్ ఇండియా పేరుతో ఖిచిడీ చేయకూడదు. ప్రేక్షకుల అభిరుచిని, వారి సమయాన్ని, వారి డబ్బును గౌరవించాలి అని కోరుతున్నాను. అని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు.