పవన్ కళ్యాణ్ : జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో చారిత్రాత్మక ప్రపంచ గుర్తింపు

Pawan Kalyan: Historic world recognition in Japanese martial arts
Spread the love

పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.  సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే మరియు సంబంధిత యుద్ధకళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి, సాంకేతికంగా మరియు తాత్వికంగా బలమైన పునాది ఏర్పరుచుకున్నారు. కాలక్రమేణా, శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు మరియు ప్రజాదరణ తీసుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం.
అంతేకాకుండా, గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు “టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా జరిగింది. అధునాతన శిక్షణలో భాగంగా, భారతదేశంలో జపాన్ యుద్ధకళలలో అగ్రగణ్యులలో ఒకరైన ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ వద్ద పవన్ కళ్యాణ్ శిక్షణ పొందారు.
ఆయన మార్గదర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘కెండో’లో సమగ్ర శిక్షణ పొంది, ఉన్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం మరియు లోతైన తాత్విక అవగాహనను సంపాదించారు. ఈ మైలురాయి ద్వారా సినిమా, శాస్త్రీయ యుద్ధకళలు, యుద్ధ తత్వశాస్త్రం.. ఈ మూడింటినీ అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగిన అతి కొద్దిమంది భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. యుద్ధకళ సాధకులు, అభిమానుల దృష్టిలో కెంజుట్సులో పవన్ కళ్యాణ్ ప్రవేశం అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు.. క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబం. ఈ విలువలు మార్షల్ ఆర్ట్స్‌కు మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిద్ధాంతాలకు కూడా లోతుగా అనుసంధానమై ఉన్నాయి.

Related posts