చిత్రం: ఓజీ
విడుదల తేది : సెప్టెంబర్ 25, 2025
రేటింగ్ : 3.5/5
నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్,
ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయారెడ్డి,
అర్జున్ దాస్, వెంకట్, రాహుల్ రవీంద్రన్,
శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్,
అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు.
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : రవి.కె.చంద్రన్ – మనోజ్ పరమహంస
సంగీతం: ఎస్.ఎస్. తమన్
బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు : డీవివి దానయ్య, కళ్యాణ్ దాసరి
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుజీత్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ మాఫియా యాక్షన్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ చివరగా ‘హరి హర వీరమల్లు’ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. దీంతో ఇప్పుడు వచ్చిన `ఓజీ`పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా కంటెంట్ కూడా అలానే ఉండటంతో ఆ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముంబయి గ్యాంగ్ స్టర్ కథతో రూపొందిన ఈ సినిమాలో పవన్‌కి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించాడు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్ వంటి భారీ కాస్టింగ్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమిది. ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చింది. ఆకాశమంత అంచనాల మధ్య ఈ సినిమా నేడు (25 సెప్టెంబర్-2025) విడుదలయింది. మరి ఆ హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా మరి నిజంగానే ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా.. మొత్తం మీద సినిమా ఎలా ఉంది? అందర్నీ ఆకట్టుకునేలా ఉందా? అభిమానులను ఈమేరకు సంతృప్తి పరచింది? అనేది తెలుసుకుందాం….
కథ : 1970లలో జపాన్ నుంచి కొంతమంది భారతీయులు అక్కడి దేశస్తుల నుంచి తప్పించుకొని ముంబైకి వస్తారు. అలా వచ్చిన వాడే సత్యనారాయణ అలియాస్ సత్య దాదా (ప్రకాశ్ రాజ్). జపాన్ నుంచి భారీగా బంగారం తీసుకొచ్చిన అతడు తన ఇద్దరు కొడుకులు (వెంకట్, శ్యామ్)తోపాటు తన పెంపుడు కొడుకు ఓజీ అలియాస్ ఓజాస్ గంభీర (పవన్ కల్యాణ్)ను తీసుకొని ముంబైలో పోర్టును ఏర్పాటు చేసి భారీగా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అయితే సత్యదాదా పెద్ద కొడుకు (శ్యామ్)ను హత్య చేసి అక్కడ నుంచి వెళ్లిపోయి భార్య కణ్మని (ప్రియా అరుల్ మోహన్) కూతురు తారతో నాసిక్‌లో స్థిరపడుతాడు. విదేశాల నుంచి ఓమీ (ఇమ్రాన్ హష్మీ) పంపిన కంటైనర్‌ను సత్య దాదా టీమ్ కబ్దా చేస్తుంది. ఆ వివాదంలో ముంబైలో సత్యదాదా చిన్న కొడుకు పార్థూ (వెంకట్)ను ప్రత్యర్థి వర్గం ఓమీ (ఇమ్రాన్ హష్మీ) వర్గం చంపేస్తుంది. అంతేకాకుండా సత్యదాదాను చంపేయడానికి ప్లాన్ వేస్తాడు. నాసిక్‌లో ఉన్న ఓజీ వద్దకు సత్యదాదా వెళ్లిన సమయంలో ఓమీ వర్గం దాడి చేస్తుంది. సత్య దాదా పెద్ద కొడుకును ఓజీ ఎందుకు చంపాడు? ముంబైని వదలిసే 15 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడు? నాసిక్‌లో కణ్మనితో పెళ్లి ఎలా జరిగింది? నాసిక్‌లో కణ్మనితో ఓజీ ఎలాంటి జీవితం గడిపాడు? కొడుకు మరణం తర్వాత ఓజీ వద్దకు సత్యదాదా ఎందుకు వెళ్లాడు? ఓమీ వర్గం సత్యదాదా పోర్టును ఎందుకు కబ్దా పెట్టింది? సత్యదాదా కుటుంబానికి, వ్యాపారానికి ఓమీ నుంచి ముప్పు వాటిల్లిన నేపథ్యంలో తిరిగి వచ్చిన ఓజీ ముంబైలో ఏం చేశాడు? ఓజీ కూతురును ఓమీ ఎందుకు కిడ్నాప్ చేశాడు? ఓజీని చంపడానికి సత్య దాదా మనవడు అర్జున్ (అర్జున్ దాస్) ప్రయత్నించాడు? ముంబైలో ఓమీ ఎలాంటి మారణ హోమం సృష్టించాలని అనుకొన్నాడు? ఓమీ మారణ హోమాన్ని ఓజీ ఎలా అడ్గుకొన్నాడు? 15 ఏళ్ల పాటు ముంబైకి దూరమైన ఓజీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఓజీకి జపాన్ సమురాయ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే సినిమా కథ.
విశ్లేషణ : పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఆయన రేంజ్‌ని ఎలివేట్ చేసే సినిమా కోసం చాలా కాలంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కోసం, వారి ఆకలి తీర్చేందుకు వచ్చిన చిత్రమే ఈ ‘ఓజీ’. ఈ సినిమా పూర్తిగా గ్యాంగ్ స్టర్ కథతో నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ‘పంజా’లో కొంత వరకు ఈ మాఫియా, గ్యాంగ్ స్టర్ జోనర్‌ని టచ్ చేశారు. కానీ ఇందులో పూర్తిగా గ్యాంగ్ స్టర్ కథగానే తెరకెక్కించారు. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అలానే ఉంటుంది. సినిమా మొత్తం యాక్షన్ ప్రధానంగానే సాగుతుంది. పవన్ కళ్యాణ్‌ని ఇలాంటి గ్యాంగ్ స్టర్ చిత్రాల్లో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ మార్క్ ఎలివేషన్లు, యాక్షన్‌తోనే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అదే ఉంటుంది. మధ్య మధ్యలో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ తాలుకూ డ్రామాని జోడించారు. సినిమా ప్రారంభం.. ఓజీ పాత్ర జర్నీని 1940లో ఏం జరిగింది. 1970లో చోటు చేసుకున్న సంఘటనలు, ఆ సమయంలో ఓజీ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది. 1993లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనేది ప్రధానంగా చేసుకుని ఓజీని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభమైన దాదాపు ఇరవై నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుంది. కానీ ప్రారంభం నుంచి ఆయన గురించే చర్చ, ఆయన ఎలివేషన్లతోనే నడుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పవన్ ని చూపించారు. ఆయా ఫైట్ సీన్లు వాహ్ అనేలా ఉంటాయి. రెగ్యూలర్‌కి భిన్నంగా చాలా బాగున్నాయి. ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఓజీ చాలా సింపుల్ కథ. చూడడానికి చాలా రొటీన్ కథలాగా అనిపిస్తుంది కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు.. ఆయన ఆరా ఈ సినిమా కథను నడిపించింది. గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు. ప్రియాంక మోహన్‌తో ఎమోషనల్ బ్యాక్‌స్టోరీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలిచాయి. రొటీన్ గ్యాంగ్ స్టర్ డ్రామాను ఎమోషనల్ గా తెరకెక్కించాడు దర్శకుడు. క్రమం తప్పకుండా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు.. అది కూడా మాములు హై కాదు.. సుజిత్ రాసుకున్న సీన్లకు.. అదేదో డ్రగ్ తీసుకున్నట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టాడు తమన్. ఫస్టాఫ్ అయితే ప్యూర్ మెంటల్ మాస్.. పూనకాలు వచ్చేసాయి.. ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్.. సెకండ్ హాఫ్ లో పోలీస్ స్టేషన్ సీన్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కు నిదర్శనం. అక్కడక్కడ కాస్త స్లో అయింది కానీ.. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్లీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. సుజీత్ రాసుకున్న ప్రతి సీన్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న ప్రేమ కనిపించింది.. తన అభిమాన హీరోని ఎలా చూపించాలి అనుకున్నాడో.. అంతకంటే 100 రెట్లు బాగా చూపించాడు. ఒక రొటీన్ రెగ్యులర్ కథను పవన్ కళ్యాణ్ ని అనే పేరు చుట్టూ తిప్పేసాడు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్‌లో సమురాయ్‌లకు కలిగిన ముప్పుతో కథకు మూల బీజం వేసి ఆసక్తిగా కథను ముంబైలో ల్యాండ్ చేయడం బాగుంది. కథలో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు సుజిత్ కొంత సమయం ఎక్కువగా తీసుకోవడం ఫస్టాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ ల్యాగ్ అనిపిస్తాయి. కానీ పవన్ కల్యాణ్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్‌తో సుజిత్ కేక పెట్టించాడు. దాంతో ఫస్టాఫ్‌ను ఎక్ట్రార్డినరీగా క్లోజ్ చేసి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచాడు. కణ్మని, ఓజీ మధ్య ఇంకా కొన్ని సీన్ల ఉంటే మరింత ఫీల్ గుడ్‌గా ఉండేది. సింగిల్ ఎజెండాతో గ్యాంగ్‌స్టర్ డ్రామాను నడిపించడం రొటీన్, రెగ్యులర్‌గా కథ సాగినట్టు అనిపిస్తుంది. భారీ అంచనాలతో సెకండాఫ్ మొదలైన తర్వాత డాటర్ సెంటిమెంట్‌తో కథను మరింత బలంగా మార్చాడు. ముంబైకి తిరిగి వచ్చి ఓజాస్ గంభీర.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఇన్స్‌పెక్టర్ అభిమన్యు సింగ్నను బెదిరించే ఎపిసోడ్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. ఇక ఓమీ, ఓజీ మధ్య జరిగే ఫేస్ టూ ఫేస్ సీన్లు, అలాగే.. అర్జున్, ఓజీల మధ్య ఛేజింగ్ సీన్లు సినిమాలో హైలెట్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో వాషి ఓ వాషితో ఫినిషింగ్ టచ్ బాగుంది. ఇక పార్ట్ కోసం ఇచ్చిన ట్విస్ట్ అంచనాలు పెంచింది. అయితే సెకండాఫ్‌లో అంతా ఊహించినట్టే సాగడం వల్ల కొంత మేరకు థ్రిల్లింగ్ మూమెంట్స్ తగ్గినట్టు అనిపిస్తాయి. కథ పాతదే అయినప్పటికీ.. జపాన్‌లోని సమురాయ్ పాయింట్ సినిమాకు కొత్తదనం తీసుకొచ్చిందనిపిస్తుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్వాగ్, స్టయిల్, ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇలాంటి సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ ఫుల్ మీల్స్ అందించాడు లవ్, ఎమోషన్స్ సీన్లలో పవన్ కొత్తగా కనిపించాడు. ఫస్ట్ టైమ్ పవన్ మీనింగ్ ఫుల్ యాక్షన్ డ్రామాలో క్రేజీగా కనిపించాడు. మొదటి భాగంలో మెయిన్‌గా మూడు యాక్షన్ సీన్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్షన్ సన్నివేశాలుంటాయి. అయితే ప్రతి పది నిమిషాలకు, పదిహేను నిమిషాలకు పవన్ ఎలివేషన్లతో సినిమా సాగుతుంది. ముంబయి పోర్ట్ చుట్టూ, దాన్ని విలన్లు దక్కించుకునేందుకు కుట్ర చేయడం ఓవైపు, పవన్‌కళ్యాణ్ గాంభీర పాత్ర ఎలివేషన్లు మరోవైపు ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ మాత్రం వాహ్ అనేలా ఉంది. పూనకాలు తెప్పించింది.
నటీనటుల విషయానికొస్తే… ఓజాస్ గాంభీరగా పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. ఆయన తెరపై కనిపిస్తే పూనకమే అనేలా ఆయన పాత్రని తీర్చిదిద్దాడు సుజీత్. తెరపై కూడా ఆ పాత్ర అంతే బాగా పండింది. ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా పవన్ పాత్ర ఉండటం విశేషం. అయితే పవన్ యాక్టింగ్ గురించి ఎవరూపట్టించుకోరు, ఆయన ఎలా కనిపించాడు, ఎలా యాక్షన్‌తో అదరగొట్టాడనేదే ముఖ్యం. ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మీ రోల్ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది. స్టయిలీష్ లుక్‌లో, యాక్షన్‌లో ఇమ్రాన్ అదరగొట్టాడు. సత్యదాదా పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. అంతేబాగా చేసి మెప్పించాడు. అర్జున్ పాత్రలో అర్జున్ దాస్ పాత్ర ఫర్వా లేదు. ఆయన పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. శ్రీయా రెడ్డి కూడా బలమైన పాత్రలో సత్యదాదా పెద్ద కోడలిగా అదరగొట్టింది. ఆమె పాత్ర ఎలివేషన్లు బాగున్నాయి. ఇక శుభలేఖ సుధాకర్ రోల్ అలరిస్తుంది. పార్థుగా వెంకట్ కాసేపే మెరిశాడు. జిమ్మిగా సుదేవ్ నాయర్ బాగా చేశాడు. ప్రియాంక అరుళ్ మోహన్ లవ్ ట్రాక్ చిన్నగానే ఉంది. పవన్, ఆమె మధ్య సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మిరాజ్‌కర్ గా తేజ్ సప్రూ ఉన్నంతలో మెప్పించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపిస్తాయి. అయితే సినిమాలో పవన్ ముందు ఏ పాత్ర నిలవలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. దర్శకుడు సుజిత్ రెగ్యులర్ రివేంజ్ గ్యాంగ్‌స్టర్ కథను ఎంతో ఆసక్తికరంగా తెర మీద ఆవిష్కరించిన తీరు సూపర్ గా ఉంది. ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా తీర్చిదిద్దాడు. ఎంచుకొన్న కలర్ ప్యాటర్ సినిమాను క్లాస్‌గా, రిచ్‌గా మార్చింది. ఈ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంగా మారింది. టోటల్‌గా ఆయన తన మ్యూజిక్ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. పలు సన్నివేశాలను ఓ రేంజ్‌లో ఆడించేశాడు. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. డీవీవీ దానయ్య అనుసరించిన నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మొదటి నుంచీ మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమాకి ఖర్చు చేసినట్టు టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతీ ఫ్రేమ్ ని ఎంతో రిచ్ గా తీర్చిదిద్దారని చెప్పాలి. ఓజీ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సుజిత్, థమన్, పవన్ కల్యాణ్ ముగ్గురు హీరోలుగా కనిపిస్తారు. ఈ ముగ్గురు సినిమాకు మూలస్థంభాలుగా నిలిచి టీమ్ వర్క్ చేశారనిపిస్తుంది. రెగ్యులర్ గ్యాంగ్ వార్ డ్రామా అయినప్పటికీ.. రెండో ప్రపంచయుద్దం, జపాన్‌లో జరిగిన సంఘటనలు ఈ స్టోరిని డ్రైవ్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఇప్పటి వరకు తెలుగు తెర మీద రానుటువంటి స్టయిలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా అభిమానులకు పండుగ లాంటి సినిమా. ఆకలితో ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులకు ఫుల్స్ మీల్స్ లాంటింది. ఫ్యామిలీ ఎలిమెంట్స్, డాటర్ సెంటిమెంట్ ఉన్న గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. ఇక రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉంది. సాలిడ్ విజువల్స్ ని తాము ప్రెజెంట్ చేశారు. థమన్.. ఈ మ్యాన్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తను గట్టి డ్యూటీనే చేసాడు సినిమాకి ముఖ్యంగా సెకండాఫ్ లో థమన్ మ్యాజిక్ బాగా ప్లస్ అయ్యింది. నవీన్ నూలి ఎడిటింగ్ లో కథనాన్ని కొంచెం గ్రిప్పింగ్ గా మార్చింది. మొత్తంగా ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురు చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ సినిమా పండగ వాతావరణాన్ని అందించిందని చెప్పొచ్చు.
OG Movie Review in Telugu : మెప్పించే యాక్షన్ డ్రామా!
