తెలుగు ప్రేక్షకులకు ఫ్రాంఛైజీ రుచిని ’హిట్’ సినిమాలు బలంగా చూపించాయి. నాని కీలక పాత్రలో ’హిట్: ది థర్డ్ కేస్’తో మూడో చిత్రం విడుదలయ్యింది. ప్రచార చిత్రాలు, ఫ్రాంఛైజీపై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. దర్శకుడు శైలేష్ కొలను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు. క్రూరత్వం నింపుకొన్న అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని నటన ఎలా ఉందన్నదే సినిమా కథ. అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు. దాన్ని ఛేదించేందుకు బిహార్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్తాడు. ఆ కేస్ కొలిక్కి వచ్చేలోపు అర్జున్ విశాఖకి బదిలీ అవుతాడు. అక్కడికి వచ్చాక కూడా ఈ కేస్ని ఛేదించేందుకు ఏం చేశాడు? వరుసగా జరుగుతున్న ఈ హత్యల వెనుక దాగిన చీకటి కోణాలేమిటి?వాటిని చేయిస్తున్నది ఎవరు? ఆయనకీ మృదుల (శ్రీనిధి)కీ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తదితర విషయాల్ని తెరపై ఆవిష్కరించారు. ఫ్రాంఛైజీ వచ్చిన తొలి రెండు ’హిట్’ సినిమాల్లో పరిశోధనాత్మక కోణమే ఎక్కువ. మూడో కేసుగా రాసుకున్న ఈ కథలో నేర పరిశోధనతో పాటు-, ఓ చీకటి ప్రపంచాన్నీ ఆవిష్కరించాడు దర్శకుడు. భయపెట్టే ఆ ప్రపంచంలోకి హీరో వెళ్లడం, తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడం ఇందులో కీలకం. అయితే, ఆ చీకటి ప్రపంచాన్ని చూపించిన విధానంలోనే సమస్యలున్నాయి. నాని సినిమాలో అలాంటి ప్రపంచాన్ని చూడటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సమాజంలో హింసాత్మక ఆలోచనల్ని మరింతగా ప్రేరేపించినట్టుగా ఉండే ఈ చీకటి కోణం, రక్తం ఏరులై పారే సన్నివేశాలు సున్నిత మనస్తత్వమున్న ప్రేక్షకులకు మింగుడు పడవు. నిజంగా మన చుట్టూ ఉన్న మనుషులకి ఇలాంటి ఆలోచనలు వస్తే ఏమిటనే భయాన్ని పెంచుతుందీ చిత్రం. పలు హాలీవుడ్ చిత్రాల్ని గుర్తు చేసే ఈ కథ, నేపథ్యం… ఓ మంచి కైమ్ర్ థ్రిల్లర్ అనుభూతినైతే పంచుతుంది. కథ, కథనాలు చాలావరకూ ఊహకు తగ్గట్టుగా సాగినా నాని నటన, ఆయన పోషించిన అర్జున్ సర్కార్ పాత్ర సినిమాని నిలబెడతాయి. సీటీకే ప్రపంచం ఒకటి ఉందని హీరో కనిపెట్టే సన్నివేశాలు సినిమాకి కీలకం. పద్మవ్యూహంలాంటి ఆ ప్రపంచంలోకి హీరో అడుగు పెట్టడం, అక్కడ చేసే పోరాటం ద్వితీయార్ధంలో కీలకం. ఓ గేమ్ తరహాలో సాగే యాక్షన్ ఘట్టాలు సినిమాకి హైలైట్. నాని తనలోని పతాక స్థాయి నటనను ఆవిష్కరించాడు. చాలాసార్లు నాని వన్ మ్యాన్ షో చేశాడు. అర్జున్ సర్కార్ పాత్రలో ఆయన ఒదిగిన తీరు, గాఢతతో కూడిన ఆయన నటన, పోరాట ఘట్టాలు ఈ సినిమాకి హైలైట్. కథానాయిక శ్రీనిధి శెట్టి పాత్రలోనూ బలం ఉంది. ప్రతినాయకుడిగా ప్రతీక్ బబ్బర్ నటన మెప్పించినా, విలనిజం హీరోకి సవాల్ విసిరేలా ఉండదు. సముద్రఖని, కోమలి ప్రసాద్ అలవాటైన పాత్రల్లోనే కనిపిస్తారు. పతాక సన్నివేశాల్లో పలువురు నటుల మెరుపులు సినిమాకి ప్రధాన ఆకర్షణ.
‘హిట్-3’లో నాని నట విశ్వరూపం.. చీకటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం!
