ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు

Megastar Chiranjeevi pays tribute to the mortal remains of prominent actor and producer G.V. Narayana Rao
Megastar Chiranjeevi pays tribute to the mortal remains of prominent actor and producer G.V. Narayana Rao
Spread the love

ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు గారి పార్థివ దేహానికి మెగాస్టార్ చిరంజీవి గారు నివాళులు అర్పించారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరైన చిరంజీవి గారు, నారాయణరావు గారితో తనకున్న అనుబంధాన్ని, ఆత్మీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఫిలిం ఇన్‌స్టిట్యూట్ రోజుల నుంచి మా ఇద్దరి పరిచయం. తను అప్పటికే ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్. మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు తను వచ్చి తన అనుభవాలను పంచుకునేవారు. అలా మాకు దగ్గరయ్యారు. ఇండస్ట్రీలో ఎవరికి వాళ్లం ఎదిగినప్పుడు, నాకు ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు ‘‘నేను నిర్మాతగా నిలబడాలనుకుంటున్నాను. నువ్వు సినిమాలు చేయాలని’’ అడిగారు. అలా ఆయన నిర్మాణంలో రెండు చిత్రాలు చేయడం జరిగింది. నా సినిమాల్లో తనకు నటుడిగా కూడా అవకాశాలు వచ్చేలా చేయడం జరిగింది. అలా మా అనుబంధం కొనసాగుతూ వచ్చింది.
యాదృచ్ఛికంగా ఒక పది రోజుల క్రితం ”నేను ఒక సినిమా చేశాను. మంచు పల్లకి ఇన్‌స్పిరేషన్‌తో ఐదుగురు కుర్రవాళ్లు.. పెద్దవాళ్లు అయితే ఎలా ఉంటారో అనే కథతో ఒక సినిమా చేశాను. ట్రైలర్ లాంచ్ చేయాలి. మీ సహకారం ఉంటే అందరికీ బాగుంటుంది’’ అని అన్నారు. కచ్చితంగా చేస్తానని చెప్పాను. ఆ క్షణంలో ఇద్దరం కలిసి ఒక ఫోటో దిగుదాం రమ్మని అడిగారు. బహుశా తన ఆఖరి చిత్రం అదేనేమో. ఆ సమయంలో చాలా సేపు మాట్లాడుకున్నాము. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. ఆ క్షణంలో తనకి ఆల్ ది బెస్ట్ చెప్పాను. కానీ అదే మాట శాశ్వతంగా గుడ్‌బై అవుతుందని అనుకోలేదు. ఎక్కడున్నా సరే నారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు కూడా నా కుటుంబ సభ్యులే.. వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.