ఆస్కార్ రేసులో భారతీయ చిత్రం ‘హోమ్‌బౌండ్’

Indian film 'Homebound' in Oscar race
Spread the love

భారతీయ చలనచిత్ర పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే చిత్ర నిర్మాత కరణ్ జొహార్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. “హోమ్‌బౌండ్ ప్రయాణం పట్ల నేను ఎంత గర్వంగా, సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. మా ఫిల్మోగ్రఫీలో ఇంతటి ముఖ్యమైన సినిమా ఉండటం ఒక గౌరవం” అంటూ ఆయన భావోద్వేగభరితమైన నోట్ రాశారు. కేన్స్ నుంచి ఆస్కార్ షార్ట్‌లిస్ట్ వరకు ఈ ప్రయాణం అద్భుతమని, తమ కలలను నిజం చేసిన దర్శకుడు నీరజ్ ఘైవాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.  98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘హోమ్‌బౌండ్’ చిత్రంతో పాటు అర్జెంటీనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, స్పెయిన్ వంటి దేశాల చిత్రాలు కూడా పోటీలో ఉన్నాయి. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా, మార్చి 15న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.

Related posts