జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే జెండా..ఎజెండా : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ

HUJ Elections
Spread the love

తమకు ఎలాంటి రాజకీయాలు లేవని, పోరాటాలే తమ ఊపిరి, జర్నలిస్టుల సంక్షేమమే జెండా, ఎజెండా అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు.
సోమవారం నాడు ఆబిడ్స్ లోని మీడియా ప్లస్ హాలులో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యూ జే) ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. 65ఏండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగి ఉన్న తమ సంఘం నాటి నుండి నేటి వరకు నైతిక విలువలకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ ప్రొఫెషనల్ ట్రేడ్ యూనియన్ గా వేలాది జర్నలిస్టుల విశ్వాసాన్ని చూరగొంటుందని విరాహత్ అన్నారు. ఇవ్వాళ జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటాల ఫలితంగా సాధించినవేనన్నారు. కొన్ని శక్తులు వారి స్వప్రయోజనాల కోసం జర్నలిస్టుల ఐక్యతను విచ్చిన్నం చేస్తూ, జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని పాలకులకు తాకట్టుపెట్టడం సహించారనిదన్నారు. అలాంటి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రంలో వేలాది మంది జర్నలిస్టులు పోరాట పటిమ కలిగివున్న టీయూడబ్ల్యూజే – ఐజేయును ఆదరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
విశిష్ట అతిథిగా హాజరైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే, దేశంలో ఐజేయూ సంఘాలు జర్నలిస్టుల హక్కుల సాధన, మీడియా పరిరక్షణ కోసం ఎనలేని పోరాటాలు చేస్తున్నట్లు చెప్పారు. టీయూడబ్ల్యూజేకు గుండెకాయ లాంటి హెచ్.యూ.జేకి గొప్ప చరిత్ర వుందని, ఎందరో పాత్రికేయ దిగ్గజాలు, జాతీయ, రాష్ట్ర సంఘాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న నాయకులు హెచ్.యు.జే నుండి పుట్టుకొచ్చిన వారేనని నరేందర్ రెడ్డి అన్నారు. హెచ్.యు.జే అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఎం.ఏ.మాజీద్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, టి.కోటిరెడ్డి, కిరణ్, వెలజల చంద్రశేఖర్, వరకాల యాదగిరి, హాబీబ్ జిలానీ, అయిలు రమేష్, బి.స్వామి, రాములు, హెచ్.యు.జే ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు రాంచందర్ తదితరులు పాల్గొనగా, హెచ్.యు.జే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్ తన నివేదికను సభలో ప్రవేశపెట్టారు.
మహాసభ తీర్మానాలు
జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై హెచ్.యు.జే మహాసభ చర్చించి 5 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించింది.
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించాలని, జర్నలిస్టుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే హెల్త్ కార్డులు అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని, జర్నలిసులందరికీ ఇంటి స్థలాలు, ఇండ్లు మంజూరీ చేయాలని మహాసభ డిమాండ్ చేసింది.
హెచ్.యూ.జే అధ్యక్ష, కార్యదర్శులుగా శంకర్ గౌడ్, షౌకత్
దాదాపు 250మంది జర్నలిస్టుల సమక్షంలో జరిగిన హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(హెచ్.యు.జే) నూతన కార్యవర్గ ఎన్నికలో అధ్యక్షులుగా శిగా శంకర్ గౌడ్, కార్యదర్శిగా అబ్దుల్ హమీద్ షౌకత్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా వి.వెంకటాచారీ, నాయీమ్ వజహత్ , వి.లక్ష్మణ్ యాదవ్, అక్తర్ హుసేన్, జే.పీ.చారీ, సహాయ కార్యదర్శులుగా కె.మహేందర్ రెడ్డి, ఆదీల్ అహ్మద్, ఎన్. మల్లికార్జున్ రెడ్డి, కే. సంతోష్ కుమార్, షేక్ రఫియుద్దీన్, కోశాధికారిగా కే.శ్రవణ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఇబ్రహీం అలీ, సాంస్కృతిక కార్యదర్శిగా అమరేశ్వర్ రెడ్డిలు ఎన్నికయ్యారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా ఎన్.శ్రీనివాస్ రెడ్డి, టి.నాగరాజు గుప్త, సాజిదా బేగం, గౌస్ మోహియుద్దీన్, బి.వెంకటయ్య, హుసేని ఇక్బాల్, ప్రతిభా దేవి, కే. మల్లేష్, మహ్మద్ సుల్తాన్, ముత్యాల శ్రీనివాస్, పి.శ్రీనివాస్ రెడ్డి, సి.గిరిబాబు, వి.సాయిరాం, సి.హెచ్.పవన్, బి.భారతా చారీ, ప్రకాష్, మహ్మద్ జవేద్ అలీ ఖాన్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం.మల్లయ్య ప్రకటించారు.

Related posts

Leave a Comment