అంజనాద్రి అనే వూరిలో హనుమంతు (తేజ సజ్జ) అతని అక్క అంజమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) వుంటారు. హనుమంతు ఆ వూర్లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ చిన్నచిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉంటాడు. ఆ వూరికి హనుమంతు చిన్నప్పటి స్నేహితురాలు విూనాక్షి (అమృత అయ్యర్) డాక్టర్ గా చదువు పూర్తి చేసుకొని వస్తుంది. అదే వూరిలో వున్న ఒక బలమైన వస్తాదు ఆ వూరిలో దోపిడీ దొంగతనాలు చేయించి ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ఉంటాడు. ఒకసారి మీనాక్షి వెళుతున్న బస్సు మీదకి దోపీడీ దొంగలు వస్తే, అందరూ బస్సు దిగి ప్రాణాలు కాపాడుకోవటానికి అడివిలోకి పారిపోతారు. ఆ సమయంలో హనుమంతు వచ్చి మీనాక్షిని కాపాడతాడు, అదే సమయంలో దొంగలు హనుమంతుని పొడిచి అక్కడ నదిలో పడేస్తారు. హనుమంతు నీటి అడుగుకి కొట్టుకుపోతున్నప్పుడు అతనికి ఒక మణి దొరుకుతుంది, తరువాత దెబ్బలతో నది ఒడ్డుకు కొట్టుకొచ్చిన అతన్ని ఆ ఊరి ప్రజలు ఇంటికి చేరుస్తారు, కట్లు కడతారు, కానీ అతను కోలుకోవటం కష్టం అంటారు. మణి ప్రభావంతో హనుమంతుకి దెబ్బలు మాయం అయిపోతాయి, ఒక్కసారిగా సూపర్ మాన్ లా తయారవుతాడు. అదే సమయంలో మైకేల్ (వినయ్ రాయ్) అనే అతను అతని అసిస్టెంట్ (వెన్నెల కిషోర్) తో ఆ మణి గురించి తెలిసి అది కాజేయాలని, ఆ వూరికి వస్తారు. ఇంతకీ మైకేల్ ఎవరు? అతను ఎందుకు ఈ మణిని చేజిక్కుంచుకోవాలని అనుకున్నాడు? ఆ మణి నేపధ్యం ఏంటి? సూపర్ మేన్ గా మారిన హనుమంతు ఆ వూరికి ఏమి చేసాడు? అంజమ్మ పాత్ర ఏంటి? ఇవన్నీ ’హనుమాన్’ సినిమాలో రంగరించారు. హాలీవుడ్ లో ’సూపర్ మేన్’, ’స్పైడర్ మేన్’, ’బాట్ మేన్’ ఇంకా చాలా సూపర్ మాన్ కథలతో సినిమాలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ భారతీయ పురాణం అయిన రామాయణంలోని హనుమాన్ పాత్రని తీసుకొని ఒక కథను తయారు చేసి ఈ ’హనుమాన్’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా మొదలవడం కూడా హనుమంతుడు పుట్టడం, సూర్యుడుని పండు అనుకొని తినటానికి వెళ్లడం, ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టడం అది హనుమంతునికి తగలడం వరకు బాగానే వుంది. ఇక్కడే ప్రశాంత్ వర్మ ఒక చిన్న కథని పెట్టాడు. వజ్రాయుధం హనుమంతునికి తగిలినప్పుడు అతని రక్తపు బిందువు ఒకటి అంజనాద్రి ఊరి దగ్గరలో వున్న నదిలో పడిపోయి నిక్షిప్తం అవుతుంది. ఇదంతా ఆసక్తికరంగా గ్రాఫిక్స్ ద్వారానే చెప్పేసాడు ప్రశాంత్ వర్మ. అంజనాద్రి అనే వూరిలో వుండే పరిస్థితులు, హనుమంతు, అతని అక్క, ఆ ఊరి ప్రజలు ఇలా ఆ ఊరి గురించి కొంచెంసేపు సాగదీసినట్టుగానే చెప్పినా ప్రశాంత్ వర్మ వెంటనే కథలోకి వచ్చేస్తాడు. ఆ ఊర్లో వుండే దోపిడీ దొంగలను అడ్డుకోవటానికి హనుమంతు ఎటువంటి బలం లేకపోయినా ధైర్యంగా ముందుకు రావటం, తరువాత అతనికి సూపర్ పవర్స్ రావటం ఇవన్నీ చాలా ఆసక్తికరంగా చూపించాడు. మొదటి సగం అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే రెండో సగం వచ్చేసరికి కొంత సాగదీత సన్నివేశాలు ఉంటాయి. విలన్ అయిన మైకేల్ అంజనాద్రి వూరికి వస్తాడు, హనుమంతు ఎలా సూపర్ మేన్ అయ్యాడు అన్న రహస్యం తెలుసుకొని, దాన్ని ఎలా చేజిక్కుంచుకోవాలనే విషయాలు సరిగ్గా చూపించలేకపోయారు. సంగీత నేపథ్యంతో మొదటసారి పర్వతంలా వున్న హనుమంతుని చూపించినప్పుడు ఆ సన్నివేశం హైలైట్ అనే చెప్పాలి. అలాగే పోరాట సన్నివేశాలు బాగా కోరియోగ్రఫీ చేసి ఆసక్తికరంగా తీశారు. ఈ సినిమాకి నేపధ్య సంగీతం ఒక ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు నేపధ్య సంగీతంతో చాలా ఎలివేట్ చేసి చూపించాడు దర్శకుడు. ఇక భావోద్వేగ సన్నివేశాల్లో అక్క, తమ్ముడు సెంటిమెంట్, లీడ్ పెయిర్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. హనుమంతుని మీద శ్లోకాలతో ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడు. రెండో సగంలో కొంచెం సాగదీత కనిపించినా, తనకున్న పరిధిలో బాగా తీసాడు అనే చెప్పాలి. హాలీవుడ్ సూపర్ మేన్ లతో పోలిస్తే ఇది మన పురాణం నుండి తీసుకున్న మన సూపర్ మేన్ కథ.
Related posts
-
W/O అనిర్వేష్ చిత్ర బృందాన్ని అభినందించిన హీరో అల్లరి నరేష్.
Spread the love గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్లు మెరుగు, శ్రీ శ్యామ్ గజేంద్ర... -
Hero Allari Naresh Congratulates the Team of W/O Anirvesh
Spread the love Under the banner of Gajendra Productions by Venkateswarlu Merugu, Sri Shyam Gajendra, presented by... -
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ...