సినిమా నైపుణ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణల గొప్ప వేడుక ‘సినిమాటికా ఎక్స్‌పో’ నవంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లోని నోవాటెల్ లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ ITE&C మరియు పరిశ్రమలు & వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
‘సినిమాటికా ఎక్స్‌పో’లో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రతిభకు పట్టం కడుతూ పురస్కారాలు అందించడంతో పాటు, యువ ప్రతిభకు సూచనలు ఇస్తూ చర్చలు జరిగాయి. అలాగే ఒక గొప్ప పుస్తకావిష్కరణకు కూడా ‘సినిమాటికా ఎక్స్‌పో’ వేదికైంది.
సినీ దిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా, కె.కె. సెంథిల్ కుమార్ సహా పలువురు ప్రముఖల చేత ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి ప్రముఖ వక్తలు.. స్టోరీ టెల్లింగ్, సినిమాటోగ్రఫీ మరియు సినిమాల్లో సాంకేతిక పురోగతి వంటి అంశాలపై చర్చించారు.
సినీ పరిశ్రమలోని దిగ్గజాలు మరియు వర్ధమాన ప్రతిభావంతుల సేవలను గుర్తించి, సుధీర్ బాబు మరియు పి.జి. విందా చేతుల మీదుగా వివిధ విభాగాలలో అర్హులైన వారికి అవార్డులను ప్రధానం చేశారు.
తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ మద్దతుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్లకు నివాళులు అర్పిస్తూ ‘విజువల్ స్టోరీటెల్లర్స్’ అనే పుస్తకాన్ని పి.జి. విందా ఆవిష్కరించారు.
అలాగే, ఈ సందర్భంగా సుంటెక్ ద్వారా ట్రూజోన్ సోలార్ అందించిన ‘తెలుగు DMF క్రియేటర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ 2024’ అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ టాలెంట్ వేడుకలా నిలిచింది. రెండు మిలియన్లకు పైగా ఆన్‌లైన్ ఓట్లతో.. ఫ్యాషన్, టెక్, ఫుడ్ సహా వివిధ రంగాలలో అసాధారణమైన కంటెంట్ సృష్టికర్తలను గుర్తించి 15 విభాగాలలో అవార్డులు అందించబడ్డాయి.
అద్భుతమైన ప్రదర్శనలు, ఆలోచింపజేసే ప్రసంగాలు, ప్రోత్సాహం కలిగించే పురస్కారాలతో ‘సినిమాటికా ఎక్స్‌పో’ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలంగాణను సినిమాతో పాటు, డిజిటల్ క్రియేటివిటీకి కేంద్రంగా మలచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు ‘సినిమాటికా ఎక్స్‌పో’ నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.