F3 Movie Review : ‘ఫన్’ పేరుతో అతుకుల బొంత!

F3 Movie Review :
Spread the love

By -ఎం.డి. అబ్దుల్ – Tollywoodtimes

చిత్రం : ఎఫ్‌3
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
విడుదల తేది: 27 మే – 2022
నటీనటులు : వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌, రాజేంద్రప్రసాద్‌, అలీ, సునీల్‌, వై విజయ, అన్నపూర్ణ, ప్రదీప్ తదితరులు
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత : దిల్‌ రాజు, శిరీష్‌
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్ర‌ఫి : సాయి శ్రీరామ్‌
ఎడిటర్‌: తమ్మిరాజు

వెంకటేష్, వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3’ చిత్రం శుక్రవారం (మే 27, 2022) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డబుల్ బ్లాక్‌బస్టర్ ‘ఎఫ్2’ ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు సమర్పణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శిరీష్ నిర్మించిన ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘ఎఫ్3 ‘ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు​ సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌ గా చేయడంతో ‘ఎఫ్‌3’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘ఎఫ్‌2’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ‘ఎఫ్ 2’ పెద్ద విజయం సాధించడంతో సీక్వెల్ ‘ఎఫ్3’పై సహజంగానే అంచనాలు ఏర్పడతాయి. టాలీవుడ్‌లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్ 2′ చిత్రానికి ఫ్రాంచైజీగా’ఎఫ్3’ రూపొందింది. ఈ సారి అదనంగా ఫ్యామిలీ, ఫైనాన్స్ అనే ట్యాగ్ లైన్ జోడించి డబ్బు అనే పంచభూతం చుట్టూ కథను అల్లారని ప్రమోషన్స్‌లో బాగానే ప్రచారం చేశారు. అయితే ఆరో పంచభూతం ప్రేక్షకులను కనికరించిందా? ఫ్రాంచైజీ మేకర్స్‌కు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? అనే విషయాలను తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…
కథ: ఆనంద్ ప్రసాద్ (మురళీ శర్మ) డబ్బే సర్వస్వంగా బతికే బడా పారిశ్రామికవేత్త. ఏ మాత్రం కష్టపడకుండా ఏదో మాయ చేసి రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కనే వెంకీ (వెంకటేశ్), వరుణ్ (వరుణ్ తేజ్). మంగ టిఫిన్ సెంటర్‌ నడిపిస్తూ.. కూతుళ్ల అందచందాలతో అప్పనంగా డబ్బు సంపాదించే ప్లాన్స్‌లో కుటుంబం (తమన్నా, మెహ్రీన్, వై విజయ, అన్నపూర్ణ, ప్రదీప్). అయితే డబ్బు కొట్టేయడం కోసం ఈ బ్యాచ్ అంతా ఆనంద్ ప్రసాద్ ఇంట్లో తిష్ట వేస్తారు. మరి డబ్బు కోసం అత్యాశ పడే వెంకీ, వరుణ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మంగ టిఫిన్ సెంటర్ టీమ్ ఎలాంటి మోసాలకు పాల్పడ్డారు? వెంకీ, వరుణ్‌ను మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్‌ ఎలా ఆడుకొన్నారు? డబ్బే ప్రపంచంగా బతికే ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్య ఏమిటి? ఆనంద్ ప్రసాద్‌ డబ్బును వెంకి, వరుణ్ ఎందుకు కొట్టేయాలని అనుకొంటారు? ఆనంద్ ప్రసాద్‌కు ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు వెంకీ, వరుణ్, మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్ ఎలా ప్లాన్ చేశారు. ఆనంద్ ప్రసాద్ సమస్య తీరిందా? రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలుకొన్న వెంకీ, వరుణ్ కల నిజమైందా? వాళ్లకి ఎదురైన సంఘటనలేమిటి? ఒకరికి రేచీకటి.. మరొకరికి నత్తి.. ఆ తరహా ఫన్ వర్కవుట్ అయిందా? తదితర ప్రశ్నలకు సమాధానమే ‘ఎఫ్3’.
విశేషణ: ”ఎఫ్3 చిత్రం నవ్వుల పండగలా వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు. ఫ్యామిలీ అంతా కలసి మళ్ళీ మళ్ళీ చూస్తారు .. ‘ఎఫ్2’కి మించిన ట్రిపుల్ ఫన్ డోస్ ‘ఎఫ్3’లో వుంటుంది. సినిమా అంతా నవ్వుతూనే వుంటారు” అని సినిమా విడుదలకు ముందు దర్శకుడితో సహా హీరోలూ పదేపదే చెబుతూ వచ్చారు. అయితే. సినిమా విడుదలయ్యాక నవ్వింది మాత్రం సినిమా చూస్తున్న ప్రేక్షకులు కాదు.. అందులోని క్యారెక్టర్స్ మాత్రమే నవ్వాయి. ‘ఎఫ్‌2’లో భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించిన దర్శకుడు ‘ఎఫ్‌3’లో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్‌ను తెరకెక్కించాడు. ఈ ‍సినిమాలోని పాత్రలన్నింటికీ డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బులు త్వరగా సంపాదించేస్తే ఫన్ అనుకుంటారు .. దాని వలన వచ్చే ఫస్ట్రేషన్ ని హిలేరియస్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ సినిమాలో లవ్ వుంది. ఐతే అమ్మాయి – అబ్బాయి లవ్ కాదు. డబ్బు మీద వుండే లవ్. ఇందులో ప్రతి ఒక్కరూ డబ్బుని ప్రేమిస్తారు. తమన్నా, మెహారీన్, సునీల్, అలీ.. అన్నీ పాత్రలు డబ్బునే ఇష్టపడతాయి. కొంతమందిని చూస్తే డబ్బు ఇంత ఈజీగా వస్తుందా? అనిపిస్తుంది. ఐతే అంత ఈజీగా వచ్చిన డబ్బు అంతే ఈజీగా పోతుంది.. డబ్బు పట్ల జాగ్రత్తగా వుండాలి అని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాను పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ కి ఎలాంటి సమస్య వుందనే అంశంపై స్పెషల్ గా చేసిన ఒక డిజైన్ ట్రాక్ ఆకట్టుకుంటుంది. ఆనంద ప్రసాద్ కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఎపిసోడ్‌తో కథను సీరియస్‌గా ప్రారంభించినప్పటికీ.. వెంకీ, వరుణ్, మంగ టిఫిన్ సెంటర్ బ్యాచ్‌ ఎంట్రీతో కొంత కామెడీగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ఫన్‌గా సాగుతాయి. కథ సాగే కొద్ది చవకబారు సన్నివేశాలు, పేలవమైన సీన్లు, కథ కోసం కాకుండా అప్పటికప్పుడు సన్నివేశం కోసం రాసుకొన్న సీన్లు సహనానికి పరీక్ష పెడుతాయి. కథను సరైన దిశకు నడిపించే సరుకు సినిమాలో లేకపోవడంతో నాసిరకం ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చారు. కామెడీ అదిరింది కానీ మళ్ళీ అనుకున్నట్లే జరిగింది..ఈ చిత్రం కంటే ‘ఎఫ్2’ బెటర్ అనిపిస్తుంది. ద్వితీయార్ధం విషయానికొస్తే.. ఆనంద్ ప్రసాద్ వారసుడి శోధన అనే ఎమోషనల్ పాయింట్‌కు వినోదం జోడించడంలో అనిల్ రావిపూడి ఫెయిల్యూర్ ఇంటర్వెల్ తర్వాత మొదలవుతుంది. ఆ వైఫల్యం చివరి వరకు అలానే కొనసాగడమే కాకుండా ప్రేక్షకుల్లో ఫన్‌కు బదులు ఫ్రస్టేషన్‌ను నింపేలా చేసింది. తమన్నా, సోహాల్ చౌహాన్ ఎపిసొడ్ డిజాస్టర్ అటెంప్ట్. ఇక, హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రే కనిపించదు. క్లైమాక్స్ కోసం పరుగులు పెడుతూ సన్నివేశాలను జొప్పించినట్టు సెకండాఫ్ సాగుతుంది. ‘ఎఫ్2’ సక్సెస్ తర్వాత ఏర్పడిన పాజిటివ్ బజ్‌ను డబ్బు చేసుకోవడానికి దర్శకుడు చేసిన ప్రయత్నమే కనిపిస్తుంది. కథ, కథనాలను బలంగా రాసుకొనే ప్రయత్నం చేయలేదనే స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఎఫ్3’ విషయంలో అనిల్ రావిపూడి బ్యాడ్ రైటింగ్ ప్రతీ చోట కనిపిస్తుంది. అనిల్ కి ప్రస్తుత స్టేటస్‌కు అటెంప్ట్ చేయాల్సిన కథే కాదు. ఈ సినిమా అనిల్ రావిపూడిని నాలుగు మెట్లు దిగజారేలా చేసిందనిపిస్తుంది. తెర మీద క్యారెక్టర్లలో ఫన్ కనిపించింది కానీ.. ప్రేక్షకుల్లో నవ్వించేంతగా మాత్రం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘ఎఫ్‌2’తో భార్యల వల్లే వచ్చే ఫ్రస్టేషన్‌ చూపించి, చివరిలో వారి గొప్పదనం ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. ఇక ‘ఎఫ్‌3’లో డబ్బు వల్ల కలిగే ఫ్రస్టేషన్‌ చూపించి..చివరిలో ఓ మంచి సందేశాన్ని అందించాడు. అయితే ఈ సినిమాలో కామెడీనే ఆస్వాదించాలి తప్ప..స్టోరీ పెద్దగా ఉండదు. ఇక లాజిక్‌ లెక్కలను అసలే పట్టించుకోవద్దు. స్టోరీని పక్కకు పెట్టి కామెడీనే నమ్ముకున్నాడు. హీరోలకు లోపం ఉన్న క్యారెక్టర్లు ఇచ్చి హాస్యాన్నీ పండించాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు వెంకీ, వరుణ్‌ పడే పాట్లతో ఫస్టాఫ్‌ అంతా రొటీన్‌ కామెడీతో సాగుతుంది. రేచీకటి లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకీ పడే పాట్లు నవ్విస్తాయి. ఇక సెకండాఫ్‌లో నిజంగానే మూడురెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించారు. మేమే ఆనందప్రసాద్‌ నిజమైన వారసులం అంటూ వెంకీ, వరుణ్‌ పండించే ఫన్‌ హైలెట్‌. వీరితో హారిక (తమన్నా) కూడా పోటీ పడడం.. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టడం ఇలా ప్రతీ సీన్‌ నవ్వించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ‘ఆంబోతు’ సీన్‌ అయితే కడుపుబ్బా నవ్విస్తుంది. ‘ఎఫ్‌3’ టాయ్స్‌ అంటూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోలను తెరపై చూపించడం సినిమాకు ప్లస్‌ పాయింట్‌.
ఎవరెలా చేశారు?: నటీనటుల ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పేలవమైన, నాసిరకం స్క్రిప్టును కూడా యావరేజ్ మూవీగా చేసేందుకు వెంకటేష్, వరుణ్ తేజ్ చేసిన ప్రయత్నాలు మెచ్చుకోతగినవే.. డిఫరెంట్ వేరియేషన్స్‌తో వెంకటేష్, వరుణ్ చేసిన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్‌ ఫర్వాలేదనిపించింది. నత్తితో వరుణ్ తేజ్ చేసిన ఫెర్ఫార్మెన్స్ సినిమాలో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా వరుణ్ కు కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ‘ఎఫ్2’లో తెలంగాణ కుర్రాడిగా చేసిన అతడు ‘ఎఫ్3’కి వచ్చేసరికి స్పెషల్ గా పాత్రని డిజైన్ చేశారు. నటనకి ఆస్కారం వుండేపాత్ర. కంటెంట్ కూడా చాలా బలంగా వుంది. నత్తి పాత్రలో డిఫరెంట్ మ్యానరిజంతో నటించిన వరుణ్ తేజ్ మంచి మార్కులనే కొట్టేశాడు. ఫైట్లు, యాక్షన్ .. డైలాగులతో కామెడీని పండించి ఫన్ డోస్ పెంచాడు. దర్శకుడు అనిల్ రావిపూడి నత్తి క్యారెక్టరైజేషన్ నిచక్కగా డిజైన్ చేశారు. ఒకరికి రేచీకటి, మరొకరు సరిగ్గా మాట్లాడలేరు. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రాత్రి పూట కలిస్తే ఎలా వుంటుంది.. అతనికి కనబడదు… ఇతడు మాట్లాడలేడు ..ఇది హిలేరియస్ గా బాగాన వర్క్ అవుట్ అయ్యింది. ప్రతిసారి కొత్త మ్యానరిజం చేయడం ఒక ఛాలెంజ్ వంటిదే.అలాంటి ఛాలెంజ్ ని స్వీకరించిన వరుణ్ నూటికి నూరు పాళ్ళు పాత్రకు తగిన న్యాయం చేసాడు. రేచీకటికి సంబంధించిన సీన్లలో వెంకటేశ్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. మిగితా ఆర్టిస్టుల విషయానికి వస్తే.. తమన్నా భాటియా, మెహ్రీన్ ఫిర్జాదా, సోనాల్ చౌహాన్ తెరపైన కనిపించినా కథలో ఎంత వెతికినా కనిపించరు. బలహీనమైన క్యారెక్టరైజేషన్ కారణంగా వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ఫస్టాఫ్‌లో మెహ్రీన్ కొంత ఫర్వాలేదనిపిస్తుంది. మగ గెటప్‌లో తమన్నా మరీ అన్యాయంగా కనిపిస్తుంది. సోనాల్ చౌహాన్‌ ఆటలో అరటిపండుగా కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ల్యాండ్ కబ్జా, కొన్ని సీన్లలో సునీల్ తన హాస్యంతో పూర్వవైభవాన్ని చూపే ప్రయత్నం బాగుంది. మురళీ శర్మ భావోద్వేగమైన నటన సినిమాకు ఎక్కడ పాజిటివ్‌గా మారలేకపోయింది. సీరియస్ క్యారెక్టర్‌లో సంపత్ రాజ్ జోకర్‌గా మారింది. పూజా హెగ్డే చేసిన స్పెషల్ పార్టీ సాంగ్ ప్రేక్షకుల్నిబాగా అలరించింది. వెంకటేశ్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడిపించాలన్నా.. నవ్వించాలన్నా వెంకటేశ్‌ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఆయన కామెడీ చేస్తే ప్రేక్షకులు పడిపడి నవ్వాల్సిందే. రేచీకటి సమస్యతో బాధపడుతున్న వెంకీ పాత్రలో వెంకటేశ్‌ అద్భుతంగా నటించాడు. తన ఇమేజ్‌ని పూర్తిగా పక్కకు పెట్టి.. తనదైన కామెడీతో నవ్వించాడు. మంగ టిఫిన్‌ సెంటర్‌ నడిపే యువతి హారికగా తమన్నా, ఆమె చెల్లిగా హనీగా మెహ్రీన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. సెకండాఫ్‌లో తమన్నా సరికొత్త గెటప్‌లో కనిపిస్తుంది. సీఐ నాగరాజుగా రాజేంద్రప్రసాద్‌ తనదైన కామెడీతో నవ్వించాడు. వరుణ్‌ స్న్నేహితుడు కత్తి శీనుగా సునీల్‌ మెప్పించాడు. చాలా కాలం తర్వాత ఒకప్పటి కామెడీ సునీల్‌ని తెరపై చూడొచ్చు. ఇక వడ్డీ వ్యాపారీ పాల బాజ్జీగా అలీ, వ్యాపారవేత్త ఆనందప్రసాద్‌గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు : దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం చాలా బాగుంది. పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. తాతయ్యా.. తాతయ్యా హో మ్యూజిక్ ప్రయోగం బాగుంది. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. కథలో విషయం లేకపోవడం వల్ల సినిమాటోగ్రాఫర్‌కు పెద్దగా పనిలేకపోయింది. ఎడిటర్‌ తమ్మిరాజు ఎడిటింగ్ ఒకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగానే రిచ్ గా ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ పనితీరు మరీ నాసిరకంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
మొత్తం మీద కథ, కథనాలు, బలమైన సన్నివేశాలు లేకుండా ‘ఎఫ్ 2’ సినిమా క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి చేసిన నాసిరకమైన ప్రయత్నం ‘ఎఫ్ 3’. కథాపరంగా విలువలు లేకుండా.. ఫన్ పేరుతో చేసిన అతుకుల బొంత అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పొచ్చు. వెంకటేష్, వరుణ్ తేజ్ డిఫరెంట్ ఫెర్ఫార్మెన్స్ కోసం వీలుంటే ఓ సారి లుక్కేయొచ్చు..

Related posts

Leave a Comment