మృదుల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కహర్వా 2026 సంగీత నివాళి విశేషంగా ఆకట్టుకుంది. ముంబయి నుంచి వచ్చిన ప్రముఖ గాయకుడు మహమ్మద్ వకీల్, హైదరాబాద్ గాయకుడు రవి నిశేష్ కలసి మరపురాని సంగీత ప్రదర్శనతో మైమరపించారు. మృదుల శ్రీవాస్తవ జన్మ దినోత్సవం సందర్బంగా శనివారం సాయంత్రం బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో కహర్వా 2026 సంగీత వేడుక కనుల పండువగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన తొలి ద్వంద్వ పౌరసత్వం పొందిన పారిశ్రామికవేత్త కళాపోషకులు ఇఫ్తేకార్ షరీఫ్ జ్యోతి ప్రకాశనం చేసి, మృదుల చిత్రపటానికి పూలదండ సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర్ జారా బాలీవుడ్ సినిమా ఫేమ్ గాయకుడు, జీటివి మెగా ఫైనల్ విన్నర్ మహమ్మద్ వకీల్ తనకు గుర్తింపు ఇచ్చిన తొలి ఆల్బమ్ లోని “యే కసక్ దిల్ కీ దిల్ మే” పాటతో విభావరి ప్రారంభమై ఉర్రూతలూగించారు. “ఆయా తేరే దర్ పే దీవానా, కేసరియా లాంటి పాటలు ఆలపించారు. జగ్జీత్ సింగ్ పాడిన గజల్స్ వినిపించి అలరించారు. అనంతరం మధుర సంగీత గాయకుడు రవి నిశేష్ హిందూస్తాని సంగీత కచేరి మనోహరంగా సాగింది. ఆరు ఉస్తాదులు ఆలపించిన ఆరు కృతులు, ఆరు సమర్పణలతో ఆద్యంతం సంగీత ప్రియులను కట్టిపడేసారు. ప్రముఖ గాయకులు చందన్ దాస్, జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, నతీందర్ నర్తజ్, జస్వంత్ సింగ్, ఉస్తాద్ నుస్రత్ ఫతే అలీఖాన్ ఆలపించిన కృతులను రవి నిశేష్ తన మధుర స్వరంతో ఓలలాడించారు. తబలాతో ఠాకూర్ హర్జీత్ సింగ్, సితార్ తో నందకుమార్, ఆక్టా ప్యాడ్ తో నీరజ్, కీబోర్డుతో ఉమర్ ఖాన్ వాద్య సహకారం అందించి రక్తికట్టించారు. మృదుల మెమోరియల్ ఫౌండేషన్ డైరెక్టర్లు రవికాంత్ శ్రీవాస్తవ, శిల్పి శ్రీవాస్తవ, మనవరాలు మృదు నిశేష్ సమన్వయం చేశారు. ప్రముఖ లైఫ్ కోచ్ రష్మి శెట్టి వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.


