– ఘనంగా ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
– ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం : దుల్కర్ సల్మాన్
– సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది : నిర్మాత నాగవంశీ
వైవిద్యభరితమైన సినిమాలు, పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సినిమాలను ఖచ్చితంగా థియేటర్లలో చూసి అనుభూతి చెందాలనే ప్రేక్షకుల నమ్మకాన్ని ఆయన పొందగలిగారు. తెలుగులోనూ “మహానటి”, “సీతా రామం” వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న దుల్కర్, తన తదుపరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి మరియు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపారు.
“సాధారణ మనిషి యొక్క అసాధారణ ప్రయాణం”గా ‘లక్కీ భాస్కర్’ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇక ఇప్పుడు చిత్ర బృందం, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను అక్టోబర్ 21, 2024న ఆవిష్కరించింది. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ట్రైలర్ వేడుక ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో కథానాయకుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. “14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. హాస్యం ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి, సంగీతం బాగుంటుంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను.” అన్నారు.
కథానాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. “ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో సుమతి పాత్ర నాకు బాగా ఇష్టమైన పాత్ర. ఈ ‘లక్కీ భాస్కర్’ అనేది నా మనసుకి బాగా దగ్గరైన చిత్రం. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలు వెంకీ గారు, వంశీ గారికి ధన్యవాదాలు. దుల్కర్ గారితో కలిసి నటించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అక్టోబర్ 31న థియేటర్లలో కలుద్దాం.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబం భావోద్వేగాలతో నడిచే ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.” అన్నారు.
‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. డబ్బు కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. అతను మంచివాడు లేదా చెడ్డవాడిగా ఉండాలనుకోవడంలేదు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలిగే అంత ధనవంతుడు కావాలని అనుకుంటాడు. బాగా డబ్బు సంపాదిస్తే, శ్వాస కూడా గౌరవించబడుతుంది అనేది అతని సిద్ధాంతం.
భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా ఒదిగిపోయారు. ముఖ కవళికలు, హావభావాలతో దురాశ, ప్రేమ, బెంగ, అహంకారం, విశ్వాసం ఇలా ప్రతి భావోద్వేగాన్ని చక్కగా పలికించారు. ఇది కథానాయకుడి పాత్ర ప్రధానంగా సాగే చిత్రం కాబట్టి, ‘లక్కీ భాస్కర్’ అత్యుత్తమంగా ఉండాలంటే కథానాయకుడు అద్భుతంగా నటించాలి. ఆ విషయంలో దుల్కర్ నూటికి నూరు శాతం న్యాయం చేశారని ట్రైలర్ తోనే అర్థమవుతోంది.
రచయిత-దర్శకుడు వెంకీ అట్లూరి కలం నుంచి జాలువారిన భాస్కర్ అనే అద్భుతమైన పాత్రను దుల్కర్ సల్మాన్ తన భుజాలపై మోసి మరో స్థాయికి తీసుకెళ్లారు. అలాగే ట్రైలర్ లో “Sumathi, I’m not bad, I’m just rich”, “సిగరెట్, అల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్ ఎక్కువ” వంటి పదునైన సంభాషణలు ఆకట్టుకున్నాయి.
సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి తనదైన ముద్ర వేశారు. దుల్కర్ సల్మాన్‌తో ఆమె సన్నివేశాలు కట్టి పడేశాయి. భారతీయ సినిమాకి అద్భుతమైన ప్రదర్శనలతో కూడిన వైవిద్యభరితమైన డ్రామాని అందిస్తున్నట్లు ట్రైలర్ తో స్పష్టమవుతోంది.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి తన అద్భుతమైన కెమెరా పనితనంతో 80-90ల నాటి బొంబాయి నగరంలోకి మనల్ని తీసుకెళ్లారు. బొంబాయిని పునర్నిర్మించే విస్తృతమైన సెట్‌లను రూపొందించడంలో, అప్పటి వాతావరణాన్ని సహజంగా కనుల ముందు నిలిచేలా చేయడంలో కళా దర్శకుడు బంగ్లాన్ ప్రతిభ అడుగడుగునా కనిపిస్తోంది.
ప్రముఖ స్వరకర్త జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్ కు అదనపు బలంగా నిలిచింది. ఇప్పటికే పాటలతో విశేషంగా ఆకట్టుకున్న ఆయన, నేపథ్య సంగీతంతో అద్భుతాలు సృష్టించబోతున్నారని ట్రైలర్ తో చెప్పేశారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి కూర్పు ఈ చిత్రాన్ని మరింత అందంగా మలచనుంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ‘లక్కీ భాస్కర్’ చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.