ఘనంగా నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ కు ‘కత్తి’ కాంతరావు స్మారక జాతీయ పురస్కారం

Dr. Rajendra Prasad receives the 'Kaththi' Kantha Rao Memorial National Award
Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలకు సత్కారం
భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో నటప్రపూర్ణ కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ కు అందజేశారు. ఘనంగా జరిగిన ఈ ప్రధానోత్సవ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, తెలంగాణా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్థసారథి IAS, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, సీనియర్ నటి కవిత, తెలంగాణ ఎఫ్ డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీమతి ప్రియాంక, దర్శకులు ప్రేమ్ రాజ్, విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్, నాగబాల డి.సురేష్ కుమార్, గీత రచయిత వెనిగళ్ల రాంబాబు, శ్రీ చిత్తరంజన్, శ్రీ శ్రీనివాసరాజు, శ్రీ అక్కినేని శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి, రచయిత మామిడి హరికృష్ణ, సినీ పాత్రికేయుడు ప్రభు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపి నటి జ్యోతి, సీనియర్ నటి డబ్బింగ్ జానకి, కాంతరావు కుమార్తె సుశీలతో పాటు వివిధ రంగాల్లోని మహిళల్ని సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో..

విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్ మాట్లాడుతూ – ఈరోజు రాజేంద్రప్రసాద్ గారికి కత్తి కాంతరావు స్మారక జాతీయ పురస్కారం అందించడంతో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. అతి తక్కువ టైమ్ లో నాగబాల సురేష్ గారు ఏర్పాట్లన్నీ చేశారు. ఆయనకు మా విజన్ వీవీకే తరుపున ఎప్పుడూ సహకారం అందిస్తాం. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ అంతా సుభిక్షంగా ఉంటుంది. అన్నారు.

సీనియర్ నటి డబ్బింగ్ జానకి మాట్లాడుతూ – మాలాంటి వాళ్లను గుర్తుపెట్టుకుని మరీ సత్కారం చేస్తున్న భారత కల్చరల్ అకాడెమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం వారికి కృతజ్ఞతలు. నాగబాల సురేష్ గారు ఇలాగే ఏటా మాలాంటి కళాకారులను సత్కరించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ – మనం ఉన్నా లేకున్నా మనం చేసే మంచి పనులు ఎప్పటికీ గుర్తుండిపోవాలి, స్ఫూర్తినివ్వాలి. నా కెరీర్ 32 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. మహిళలు సర్వదా పూజనీయులు. నా కెరీర్ ప్రారంభమైందే ఆది పరాశక్తి సీరియల్ తో. ఆ తర్వాత స్వాతి చినుకులు, నాగబాల వంటి సీరియల్స్ సంచనలం సృష్టించాయి. నాగబాల సీరియల్ 18 దేశాల్లో ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే 16 భారతీయ భాషల్లో అనువాదమైంది. నా కెరీర్ లో 27 సీరియల్స్, 12 నంది పురస్కారాలు, లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ లు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్నాను. తెలుగు టీవీ సభ్యుల కోసం 24 క్రాఫ్టులను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి అసోసియేషన్ పెట్టుకున్నాం. సొంత భవనం సమకూర్చుకున్నాం. స్థానికంగా ఉండే ప్రతిభావంతులకు వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతో సాంకేతిక అందుబాటులోకి వస్తోంది. ఎన్ని వచ్చినా మారనిది మన రాజేంద్రప్రసాద్ గారి హాస్యం, దానికి పోటీ లేదు. ఎన్నేళ్లయినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. రాష్ట్ర ప్రధాని పీవీ గారు రాజేంద్రప్రసాద్ గారిని ప్రశంసించారు. దిగ్గజ సినీ గేయ రచయిత సినారే రాజేంద్రప్రసాద్ ని మెచ్చుకున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్ గారికి కాంతరావు గారి స్మారక జాతీయ పురస్కారం అందించడం ఎంతైనా సముచితం అన్నారు.
రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ – మన భారతీయులు సినిమాను ఎంతగానో గౌరవిస్తారు. సినిమా ఇచ్చే వినోదం మన జీవితంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. వినోదంతో పాటు సందేశాన్నిచ్చే సినిమాలు మంచిని నేర్పిస్తాయి. ఇప్పుడు బాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వస్తున్నాయి. కాంతరావు గారిది మా పొరుగు ఊరే. ఆయన సినిమాలను ఎన్నో చూసేవాళ్లం. అలాంటి గొప్ప నటుడి స్మారక పురస్కారం రాజేంద్రప్రసాద్ లాంటి మరో గొప్ప నటుడికి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఎప్పుడో రావాల్సింది. ఈ మధ్య ఆ గౌరవం దక్కింది. రాజేంద్రప్రసాద్ గారు ఇలాగే మనల్ని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
రచయిత మామిడి హరికృష్ణ మాట్లాడుతూ – తన సినిమాల్లోని హాస్యంతో మనలోని ఒత్తిడిని మంత్రం వేసినట్లు మాయం చేసే గొప్ప నటుడు రాజేంద్రప్రసాద్ గారు. ఆయనకు టీఎల్ కాంతరావు గారి స్మారక పురస్కారం అందిస్తున్న భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం వారికి నా అభినందనలు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగు సినిమాకు రెండు కళ్లు అయితే ఆ రెండు కళ్ల మధ్య దిద్దిన తిలకం కాంతరావు గారు. తెలుగు సినిమాకు కొత్త సొబగులు అద్దిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. అన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి మాట్లాడుతూ – రాజేంద్రప్రసాద్ గారు అసమాన ప్రతిభ కలిగిన నటుడు. ఆయనకు కాంతరావు గారి స్మారక జాతీయ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇప్పుడు క్రైమ్, సెక్స్, యాక్షన్ వంటి ఇబ్బందికర కంటెంట్ ఓటీటీల్లో వస్తోంది. కానీ రాజేంద్రప్రసాద్ గారి సినిమాలను కుటుంబంతో సహా హాయిగా చూసి ఆనందించవచ్చు అన్నారు.
ఎఫ్ డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ శ్రీమతి ప్రియాంక మాట్లాడుతూ – నేను ఇక్కడికి రాజేంద్రప్రసాద్ గారి అభిమానిగా వచ్చాను. ఆయన సినిమాలెన్నో చూస్తూ పెరిగాం. సినిమా అనేది పవర్ ఫుల్ మాధ్యమం. సినిమా ద్వారా సమాజంలో మార్పు తీసుకురావొచ్చు. అన్ని జానర్స్ లో కామెడీ జానర్ అనేది చేసి మెప్పించడం కష్టం. అలాంటి జానర్ లో ఎన్నో ఏళ్లుగా మనల్ని రాజేంద్రప్రసాద్ గారు ఎంటర్ టైన్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇటీవలే గద్దర్ అవార్డ్స్ ప్రకటించాం. ఉగాది రోజున పురస్కారాలు ఇవ్వబోతున్నాం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ లో భాగంగా సినీ పరిశ్రమను గొప్పగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అన్నారు.
దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ – ఎంతమంది నటులు ఉన్నా రాజేంద్రప్రసాద్ గారి శైలి ప్రత్యేకం. ఆయనతో రాజేంద్రుడు గజేంద్రుడు చేసినా, మాయలోడు చేసినా అవన్నీ నాకు ఎంతో స్పెషల్. ఈ పాత్రలు ఆయన మాత్రమే చేయగలడు అనిపించేలా నటిస్తారు. ఇలాంటి మహానుభావుడు కాంతరావు గారి అవార్డ్ తీసుకోవడం అది మనమంతా చూడటం అదృష్టం. తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం రాజేంద్రప్రసాద్ గారు ఉంటారు. ఈరోజు ఎంతోమంది మహిళలకు సత్కారం చేశారు నాగబాల సురేష్ గారు. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నా అన్నారు.
సీనియర్ నటి కవిత మాట్లాడుతూ – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతోమంది మహిళలకు ఈ వేదిక మీద సన్మానం చేయడం సంతోషంగా ఉంది. డబ్బింగ్ జానకి గారితో నేను ఎన్నో మూవీస్ చేశాను. నట కిరీటి అని పిలిపించుకోవడం రాజేంద్రప్రసాద్ గారికే చెల్లింది. ప్రతి సినిమానూ ఇది నా మూవీ అని పట్టుదలగా నటిస్తారు కాబట్టే ఆయన ప్రేక్షకుల్ని ఇప్పటికీ మెప్పించగలుగుతున్నారు అన్నారు.
నటి జ్యోతి మాట్లాడుతూ – వివిధ రంగాల్లో ఎంతో ధైర్యంగా నిలబడి గొప్ప పేరు తెచ్చుకున్న మహిళల్ని ఈ వేదిక మీద సత్కరించిన నాగబాల సురేష్ గారికి థ్యాంక్స్. నా కెరీర్ ఎస్వీ కృష్ణారెడ్డి గారి పెళ్లాం ఊరెళితే సినిమాతో ఊపందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. ఈరోజు కాంతరావు గారి పురస్కారం అందుకుంటున్న రాజేంద్రప్రసాద్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా అన్నారు.
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ – నటుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. ఐదు జనరేషన్స్ హీరోలతో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎంతోమంది గొప్ప గొప్ప అతిథుల సమక్షంలో నాకు కాంతరావు గారి స్మారక జాతీయ పురస్కారం అందించారు. ఇందాక మామిడి హరికృష్ణ గొప్పగా చెప్పాడు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇండస్ట్రీకి రెండు కళ్లు అయితే , కాంతరావు గారు తిలకం లాంటివారు. లవకుశ చిత్రంలో లక్ష్మణుడి పాత్రలో ఆయన చిరస్మరణీయ నటన చూపించారు. అలాగే మనకు నారదుడు అంటే కాంతరావు గారే. ఆయనను ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు దక్కింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారు. జానపద చిత్రాల్లో కాంతరావు గారికి సాటి ఎవరూ లేరు. అలాంటి గొప్ప నటుడి అవార్డ్ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. మా పార్థసారథి, ఎస్వీ కృష్ణారెడ్డి, కవిత, రామచందర్ రావు గారు ..ఇలా ఆత్మీయ అతిథులు ఎందరో నా పురస్కార కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. నేను తయారు చేసుకున్న దర్శకుడు ఎస్వీ. ఆయన నాతో చేసిన రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు చిత్రాలను ఇప్పటికీ పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. కవిత నాతో నటించిన హీరోయిన్, డబ్బింగ్ జానకి గారు నాకు అమ్మగా ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించే అవకాశం నాకు దక్కింది. నాకన్నా నాకు దక్కిన అవకాశమే గొప్పదని భావిస్తుంటా. గత నలభై ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాళ్లు నా సినిమాలు చూసి వాళ్ల జీవితంలోని కష్టాలు మర్చిపోతున్నారు అంటే నటుడిగా నాకు సార్థకత చేకూరినట్లే, ఇలాంటి అవార్డులు తీసుకునే అర్హత నాకు ఉన్నట్లే. అన్నారు.

Related posts