Deewana telugu movie Review : రొమాంటిక్ డ్రామా!

Deewana telugu movie Review
Spread the love

టాలీవుడ్ లో ప్రేమకథలకు కొదువేలేదు. ఇప్పటివరకూ వచ్చిన ప్రేమకథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. నాటి దేవదాసు, గీతాంజలి మొదలుకొని.. మొన్నటి అర్జున్ రెడ్డి వరకు టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన లవ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో సీతారామం, బేబీ, హాయ్ నాన్న లాంటి ప్రేమకథా చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించాయి. తాజాగా క‌ల్కి, శుభం త‌దిత‌ర సినిమాల్లో న‌టించిన హ‌ర్షిత్‌రెడ్డి, నూతన నటి స్మేహ మణిమేఘలై జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘దీవానా’ నేడు (జూన్ 20, 2026) థియేటర్లలో విడుదలయింది. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్హ మీడియా బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవీ కార్యంపూడి నిర్మించారు. సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకొని, గత రెండు నెలలు క్రితమే ప్రమోషన్స్‌ మొదలుపెట్టారు. ఈ సినిమా టైటిల్‌, వివరాలు, ప్రచార చిత్రాలు.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక గీతా డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ చిత్రాన్ని పంపిణీ చేయడంతో సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగాయి. బ‌ల‌మైన ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో ప్రేక్ష‌కుల దృష్టిని బాగానే ఆక‌ర్షించింది. అందరూ కొత్త వారితో చేసిన ఈ చిరు ప్రయత్నం విజయవంతమైందా? లేదా? స్నేహం, ప్రేమ ఇతివృత్తంగా రూపొందిన ఈ చిత్రం ఎలాంటి వినోదాన్ని పంచింది? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…
కథ : మధ్యతరగతి కుటుంబానికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) డిగ్రీ పూర్తి చేసి గాలి తిరుగుడు తిరుగుతూ ఇంట్లో ఖాళీగా ఉంటాడు. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయడం తప్పా.. తల్లి దండ్రులు (వీకే న‌రేశ్‌, ఝాన్సీ) ఇంటి బాధ్యత అన్నదే పట్టదు. తండ్రి పడే కష్టం గురించి ఏ మాత్రం ఆలోచించడు. అలాంటి మున్నా మీ సేవా కేంద్రంలో పనిచేసే ఓ అమ్మాయి పేరు అమూల్య (స్మేహా మణిమేఘలై)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ప్రతీ రోజూ మీ సేవాలో ఏదో ఒక పని అడ్డం పెట్టుకుని కావాలనే మున్నా ఆమె వెనక పడుతూ తన ప్రేమను వ్యక్త పరిచినప్పటికీ, అమూల్య మాత్రం అతనిని అసలు పట్టించుకోదు. ఒకానొక దశలో అతడి చేష్టలకు విసిగిపోయిన అమూల్య.. ముందు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుని కనపడు.. ఆ తరువాత చూద్దాం అని మున్నాతో చెబుతుంది. దీంతో మున్నా ఓ గాడిన పడతాడు. అమూల్య చెప్పినట్టుగా జాబ్ సంపాదించుకునే క్రమంలో ప్రయత్నాలు మొదలు పెడతాడు. అసలు అమూల్య అలాంటి కండీషన్ ఎందుకు పెట్టింది? మున్నా చివరకు తన ప్రయత్నంలో సఫలం అవుతాడా? వీరి ప్రేమ కథకు అడ్డుగా నిలిచే కారణాలు ఏంటి? మున్నా ప్రేమ గెలుస్తుందా? లేదా? ఆ తర్వాత వీరి జీవితాల్లో ఏం జరిగింది..? మున్నా తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు..? అనే ఆసక్తికరమైన విషయాలను వెండితెరపైనే చూడాలి.
విశ్లేషణ : ఏ లక్ష్యం లేకుండా బస్తీలో అల్లరి చిల్లరిగా తిరిగే ఓ కుర్రాడు ప్రేమలో పడితే ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే కథతో సినిమా ఆద్యంతం సాగుతుంది. ఓ చక్కటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని అందించడంలో దర్శకుడు శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. నేటి ట్రెండ్‌కి అద్దం ప‌ట్టే సన్నివేశాల‌తో సినిమా మ‌రోస్థాయికి వెళ్లింది. ప్రేమ కథల్ని ఎలా అయినా తీయొచ్చు.. ప్రేమలో ఎన్ని సంఘర్షణలైనా పెట్టొచ్చు.. కుల మతాలు, డబ్బు, హోదా, అధికారం ఇలాంటి ఎన్నో కారణాలు చెప్పి ప్రేమ కథల్ని అందంగా తెరపై ఆవిష్కరించొచ్చు. అయితే ఈ ‘దీవాన’ కోసం దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తీసుకున్న పాయింట్, చూపించిన ఎమోషన్స్, కాన్ ఫ్లిక్ట్ చాలా కొత్తగా, హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుంది. ఫస్టాఫ్‌ అంతా హీరో ఎంట్రీ, స్నేహితులు, గల్లీ గొడవలు, అందమైన అమ్మాయి తారసపడటం, ప్రేమలో పడటం, ఆమె కోసం ఆఫీసు చుట్టూ తిరగడం, అప్పుడప్పుడు తల్లిదండ్రులతో ప్రేమతో కూడిన తిట్లతో సరదాగా సాగిపోతుంది. క‌థ‌గా చూస్తే ఇందులో ఏముంది? చిన్న లైన్, అది కూడా చాలా సినిమాల్లో చూసిందే క‌దా అనే అభిప్రాయం క‌ల‌గొచ్చు. కానీ నేటిత‌రం ద‌ర్శ‌కులు తెలిసిన క‌థ‌ల్నే స‌రికొత్త‌గా, ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా తెర‌పై ఆవిష్క‌రించడంపై దృష్టిపెడుతున్నారు. ఆ ప్ర‌య‌త్నంలో అనుకున్నట్టుగా  భావోద్వేగాలు, సంఘ‌ర్ష‌ణ పండాయంటే చాలు… ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేస్తుంటాయి. ఇది కూడా ఆ జాబితాలోకి చేరగ‌లిగే  సినిమానే. ప్రథమార్ధంలో అపోజిట్‌ బ్యాచ్‌తో గొడవలు, హీరోయిన్‌ చుట్టూ తిరిగే సీన్లు సాగతీతగా అక్కడక్కడే నడిచినట్లు అనిపిస్తాయి. లవ్‌ సీన్స్‌ కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఇంటర్వేల్ కి హీరోయిన్‌ ఇచ్చే ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. కథను మలుపు తిప్పుతుంది. ఆ ట్విస్ట్‌ ఏంటనేది రివీల్‌ చేస్తే సస్పెన్స్‌ మిస్‌ అవుతుంది. ఎమోషనల్‌గా సాగే ఈ సన్నివేశాన్ని తెరపైన చూస్తేనే కిక్కు. ఇక సెకండ్‌ హాఫ్‌ అంతా హీరో లక్ష్యం వైపు పరుగులు తీయడం, ప్రేమను గెలిపించుకోవడానికి కష్టపడడంతో సాగుతుంది. సినిమా ప్రారంభంలో ఇది రొటీన్ లవ్‌స్టోరీనే అనిపిస్తుంది. కానీ సెకెండాఫ్‌కు వెళ్లగానే ఇందులో ఇంటి పెద్దల ఎమోషన్స్‌, అండగా నిలబడే స్నేహితులు, చుట్టుపక్కలవారి సాయం, చక్కని ప్రేమకథను మిళితం చేసి దర్శకుడు ఓ ఎమోషనల్‌ రైడ్‌లా తీర్చిదిద్దారు. ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేశాడు ద‌ర్శ‌కుడు. యువ‌త‌రం మెచ్చే అంశాల‌తోపాటు, హీరో కుటుంబ నేప‌థ్యంలో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ‌ని ఆవిష్క‌రిస్తూ స‌న్నివేశాల్ని మ‌లిచారు. స్నేహితుడికి స‌మ‌స్య ఎదురైంద‌ని తెలిసిన‌ప్పుడు త‌మ మ‌ధ్య ఎన్ని స‌మ‌స్య‌లున్నా మ‌ళ్లీ క‌లిసిపోయి ఒక‌రికొక‌రు  నిల‌బ‌డ‌టం, ప్ర‌భుత్వ ఉద్యోగం  కోసం చేసే ప్ర‌య‌త్నాలు, పోలీస్ స్టేష‌న్ నుంచి తండ్రీ, కొడుకు బ‌య‌టప‌డ‌టం, ఆ త‌ర్వాత చోటుచేసుకునే ప‌రిణామాలు ద్వితీయార్ధానికి కీల‌కం. మధ్యలో కొన్ని ఇల్లాజికల్ సీన్లు కూడా వస్తాయి. ఒక్క పాటలో హీరో కోచింగ్ తీసుకోవడం, ఎస్సై పరీక్షలో చివరి దశకు చేరుకోవడం ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీస్ అనుకోవాల్సిందే. తండ్రి గొప్పదనాన్ని వివరించే సీన్, హీరోయిన్ తన ప్రేమను బయట పెట్టే సీన్ ఇలా చాలా వరకు కంటతడి పెట్టించేలా ఉంటాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు గుండెను మెలిపెట్టేలా సాగుతుంది. వ‌న్‌సైడ్ ప్రేమ‌క‌థ‌కు నేటి ట్రెండ్‌లో భాగ‌మైన షాకింగ్ ఫ్యాక్ట‌ర్‌ని మేళ‌వించిన విధాన‌మే ఈ సినిమాని ప్ర‌త్యేకంగా నిల‌బెడుతుంది. ప్రేమ‌తోపాటు, స్నేహం, కుటుంబం చుట్టూ మ‌లిచిన స‌న్నివేశాలూ మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా భావోద్వేగాల్ని పండించ‌డంతో ఈ సినిమాకి అన్నీ పక్కాగా క‌లిసొచ్చిన‌ట్టైంది. మంచికి మంచే సాయపడుతుందనే సందేశాన్ని లాయర్‌గా నటించిన వేణు యెల్దండి, తండ్రి తన బిడ్డల కోసం ఎంతగా కష్టపడతాడో రఘు కారుమంచి పాత్రతో చెప్పడం ఆకట్టుకుంటుంది. దీవానా మూవీ స్లోగా స్టార్ట్ అయినా ముందుకు వెళ్లే కొద్ది తరువాత ఏం జరుగుతుంది.. అనే క్యూరియాసిటీ పెరుగుతుంది. ఓవైపు లవ్ స్టోరీ.. మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ ను దర్శకుడు అద్భుతంగా చూపించాడు. సినిమాలోని ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తయ్యే సరికి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో దీవానా మూవీ సక్సెస్ అయింది. స్నేహితులు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవసరానికి మేమే అండ అని స్నేహితుల పాత్రతో చెప్పించడం ఆకట్టుకుంటుంది. చాలాకాలం తర్వాత వచ్చిన కొత్త కథ ఇది. ఈ విషయంలో దర్శకుడ్ని నిజంగా అభినందించాల్సిందే. అతను ఎంచుకున్న పాయింట్‌ నిజంగా అద్భుతం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో అందర్నీ షాక్‌కి గురి చేసిన దర్శకుడు, క్లైమాక్స్‌లో మళ్లీ ఊహించని షాక్‌ ఇచ్చాడు. ఈ కథను దర్శకుడు నడిపించిన తీరును బట్టే అతనెంత సమర్థుడో అవగతం అవుతుంది. కథనంలో ఏది దాచిపెట్టాలో, ఎక్కడ ఏది రివీల్‌ చేయాలో బాగా తెలిసిన దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి. అందుకే.. ఈ సినిమా విజయం క్రెడిట్‌లో సింహభాగం అతనికే దక్కుతుంది. క్యారెక్టరైజేషన్లను కూడా ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నాడు తను. ఈ కథ ద్వారా స్నేహం గొప్పతనం చెప్పాడు. అమ్మానాన్నల ప్రేమ ఎంత విలువైంతో చెప్పాడు. ప్రేమకు ఎంతటి శక్తి ఉందో చెప్పాడు. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలీయజేశాడు. ఇన్ని విషయాలనూ కూడా వినోదాత్మకంగా, ఎక్కడా విసుగన్నది లేకుండా చెప్పిన దర్శకుడు ప్రతిభను తప్పకుండా అభినందించాల్సిందే. టాలీవుడ్‌కి ఓ మంచి దర్శకుడు దొరికాడని చెప్పొచ్చు. ఈ సినిమాలోని ఇంటర్వెల్‌, ైక్లెమాక్స్‌లో వచ్చే మలుపులు సినిమా విజయానికి ప్రధాన పాత్రలు పోషిస్తాయి. ప్రతి మలుపు ఆయా పాత్రల గొప్ప తనాన్ని ఆవిష్కరిస్తాయి. ఆ పాత్రలు అప్పటివరకూ అనుభించిన మానసిక వేదన, కష్టం గొప్పతాన్ని తెలియజేస్తాయి. ఇక క్లైమాక్స్‌లో హీరోహీరోయిన్‌ల మధ్య భావోద్వేగ సన్నివేశాలతో గుండె బరువెక్కించాడు దర్శకుడు. చివరకు ఓ చక్కటి ప్రేమ కథా చిత్రాన్ని చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. ఇది కదా అసలు సిసలు ప్రేమ.. ఇది కదా ప్రేమకు నిర్వచనం అని అనిపించేలా సినిమాని ఎండ్ చేస్తాడు.
ఎవరెలా చేశారంటే : హర్షిత్ రెడ్డి ఓల్డ్ సిటీ కుర్రాడిగా కరెక్ట్ గా సెట్ అయ్యాడు. మున్నా పాత్రలో అతను అన్ని రకాల ఎమోషన్స్ పలికించాడు. క్లైమాక్స్ లో కన్నీళ్ళు పెట్టించాడు అనే చెప్పాలి. తెలంగాణ యువకుడిగా, మున్నాగా హర్షిత్‌ మంచి ఈజ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభంలో అతడి నటన ఓవర్‌ రియాక్ట్‌ అయిన భావన కలుగుతుంది. కథలోకి వెళ్లిన కొద్దీ అతని నటన మెప్పించింది. హైదరాబాద్ గల్లీ కుర్రాడిగా మున్నా పాత్ర ఈతరం యువతను మెప్పించే అవకాశం ఉంది. ఆవారాలా గాలికి తిరిగే కుర్రాడిలా హర్షిత్ రెడ్డి మెప్పిస్తాడు. ఫస్టాఫ్‌లోని హర్షిత్‌కి సెకండాఫ్‌లో బాధ్యతాయుతంగా ప్రవర్తించే హర్షిత్‌కి తేడా కనిపిస్తుంది. ఎమోషనల్‌ సీన్లతో అందరినీ ఏడ్పించేస్తాడు. హీరోయిన్‌కి మంచి స్కోప్ ఉన్న గొప్ప పాత్ర లభించింది. హీరోయిన్‌గా పరిచయమైన స్మేహ మణిమేఘలై అమ్ము పాత్రకు పూర్తి న్యాయం చేసింది. చక్కటి నటన కనబర్చి క్లైమాక్స్‌లో కంట తడి పెట్టించింది. హీరోయిన్ స్మేహ మణిమేఘలై పాత్ర చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కేవలం గ్లామర్ కే పరిమితమవుతున్నారు. కానీ ఈ సినిమాలో స్మేహ కళ్ళతోనే పలికించిన హావభావాలకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఆమెకు లాంగ్ కెరీర్ ఉండొచ్చు. ఆమె స్నేహితురాలిగా నటించిన సింధు కూడా ఆకట్టుకుంది. నరేష్ మరోసారి తన నటనతో అందరినీ కంటతడి పెట్టించేస్తాడు. ఝాన్సీ పాత్ర రెగ్యులర్ మదర్‌లానే అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలు ప్రేక్షకులకు ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. వేణు, రఘు పాత్రలు బాగుంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. హీరోకి స్నేహితులుగా కనిపించిన కుర్రాళ్లు ఇద్దరు కూడా ఆకట్టుకుంటారు.
సాంకేతిక విభాగం : సాంకేతికంగా ఈ సినిమాకు మంచి మార్కులు పడతాయి. కథే ఈ సినిమాకు ప్రధాన బలం. అద్భుతమైన కథ రాసుకొని, దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడ్ని అభినందించకుండా ఉండలేం. కథకు తగ్గట్టు వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్‌ కుదిరింది. విజువల్స్ చాలా సహజంగా అనిపిస్తాయి. ఈశ్వర్ చంద్ పాటలు బాగున్నాయి.. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతోనే ప్రేక్షకులకు ఓ మంచి ఫీల్ ఇచ్చేలా సినిమాను తీయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. టెక్నికల్ టీం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. దర్శకుడు శ్రీకాంత్ కూడా హానెస్ట్ అటెంప్ట్ చేశాడు. దర్శకుడి కథ, కథనం ఆకట్టుకున్నాయి. థియేటర్‌లో కూర్చునప్పుడు ఈ కథ సాధారణ లవ్‌స్టోరీనే అనిపిస్తుంది. కానీ ఈ కథకు స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్‌, తండ్రి బాధ్యత వంటి అంశాలను జోడించి ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. ఈ వారం వచ్చిన సినిమాలన్నిటిలో ‘దీవానా’ ఓ సర్ప్రైజింగ్ ఫీల్ ఇస్తుంది. ఇదొక హానెస్ట్ అటెంప్ట్. అలా అని కేవలం ప్రేమకథ మాత్రమే అనడానికి లేదు. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ బాగా కుదిరాయి. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కోసం కచ్చితంగా ఈ సినిమాని థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.
చిత్రం : దీవానా
నటీనటులు : హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఘాలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, రఘు కారుమంచి, జీవన్, నర్సింగ్, టోనీ, తదితరులు;
దర్శకత్వం : శ్రీకాంత్ సంగిశెట్టి
నిర్మాతలు: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
సంస్థ‌లు: అర్హ మీడియా- వి.స్టూడియోస్‌
సంగీతం : ఈశ్వర్ చంద్
నిర్మాత : అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు
ఎడిటింగ్: హృషికేశ్ పస్పల్
విడుదల తేది: జూన్‌ 20, 2026
రేటింగ్ : 3/5

Related posts