జ్ఞానంతో పాటు సంస్కారం అవసరం : టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ

Culture is necessary along with knowledge: TWJ state president K. Wirahat Ali
Spread the love

విద్య అనేది మనిషికి కేవలం జ్ఞానాన్ని మాత్రమే అందిస్తుందని, అయితే జ్ఞానంతో పాటు సంస్కారాన్ని అందిస్తేనె ఆ విద్యకు సార్థకత ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు. మంగళవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ఎస్.యం.ఆర్ ఫంక్షన్ హలులో జరిగిన త్రివేణి హైస్కూల్ 17వ, వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చదువుల్లో డిగ్రీలు పొందడం ద్వారా సమాజంలో విద్యావంతులుగా మాత్రమే గుర్తింపు పొందగలుగుతారని , అదే సంస్కారంతో కూడిన విద్యను అభ్యసిస్తే సమాజంలో ఉత్తములుగా పేరు ప్రతిష్టలు గడించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నేడు రాకెట్ వేగంతో సాంకేతిక రంగం దూసుకెళ్తుండడంతో సమాజం ఎంతో మురిసిపోతుందని, కానీ దాని నుండి సంభవిస్తున్న దుష్పరిణామాలను మాత్రం పసిగట్టక పోవడం విచారకరమన్నారు. సాంకేతిక రంగ అభివృద్ధిని స్వాగతిస్తూనే, అందులో దాగివున్న మంచి, చెడులను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు సమయం విలువను మరచిపోకుండా పొదుపుగా దానిని వినియోగిస్తూ గమ్యానికి చేరుకోవాలన్నారు. చదువుతో డబ్బులు సంపాదించాలనో, ఇతరులను అనుకరించాలనో అనే ఆలోచనలతో కాకుండా, జీవితంలో విజయం సాధించాలనే ఆలోచనతో ముందుకెళ్తేనే లక్ష్యం నెరవేరుతుందని విరాహత్ అలీ సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ శ్రీనివాస్, మండల విద్యాధికారి గురువా రావు, పాఠశాల చైర్మన్ గుత్త గోపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment