చార్ట్‌బస్టర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒరియా పిల్ల సాంగ్

'Comrade Kalyan's' 'Oriya Pilla' song becomes a chartbuster.
Spread the love

భిన్నమైన కథలు, ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మెన్స్ తో అలరిస్తున్న ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు, సరికొత్త నేపథ్యంతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. 1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో మహిమ నంబియార్ కథానాయికగా నటిస్తోంది. చిత్ర బృందం ఈ రోజు ఈ సినిమాలోని మొదటి పాట ‘ఒరియా పిల్ల’ను లాంచ్ చేశారు. ఈ పాట ‘కామ్రేడ్ కళ్యాణ్’లోని రొమాంటిక్ వరల్డ్ ని పరిచయం చేస్తూ, ఒక సున్నితమైన ప్రేమకథను ప్రజెంట్ చేసింది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన ఈ మెలోడీ, ఆకట్టుకునే ట్యూన్‌తో పాటు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలను పలికించింది. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ గీతానికి సిద్ శ్రీరామ్ తన మంత్రముగ్ధం చేసే వాయిస్ తో ప్రాణం పోశారు. ప్రేమలో మొదటిసారి కలిగే ఆనందం, అమాయకత్వం ఆయన తన స్వరంతో అద్భుతంగా పలికించారు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం ఓ ఒరియా యువతిపై ప్రేమలో పడిన యువకుడి భావాలను ఎంతో అందంగా ఆవిష్కరించింది. సహజంగా ప్రవహించే పదాలు పాటలోని మృదుత్వాన్ని మరింత పెంచి వెంటనే లిజినర్స్ కు కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. విజువల్‌గా కూడా ఈ పాట ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగిపోయిన యువకుడిగా శ్రీవిష్ణు తన సహజమైన నటనతో మెప్పించగా, మహిమా నంబియార్ తన అందంతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మధురమైన స్వరాలు, హృదయాన్ని తాకే సాహిత్యం, సిద్ శ్రీరామ్ గానం, అందమైన విజువల్స్ కలిసి ‘ఒరియా పిల్ల’ను ఒక చార్ట్‌బస్టర్‌గా నిలిపాయి. ఈ పాటతో ‘కామ్రేడ్ కళ్యాణ్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు. చోటా కె. ప్రసాద్ ఎడిటర్.
సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక పీరియడ్ సినిమా. 90 లో జరిగిన ఒక సంఘటనలు ఆధారంగా తీసుకుని, దానికి ఫిక్షన్ జోడించి కోన వెంకట్ గారు ఒక అద్భుతమైన కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ సినిమాకు అద్భుతమైన టెక్నీషియన్లు పనిచేశారు. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాం. చిత్రీకరణలో ఎక్కువ భాగం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్ చేశాం. నాతో పాటు సుదర్శన్ గారు, సత్య గారు, బ్రహ్మాజీ గారు, రఘుబాబు గారు సహా అందరూ చాలా సరదాగా పనిచేశాం. విజయ్ బుల్గానిన్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాలోని నాలుగు పాటలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందరూ సులభంగా పాడుకునేలా, గుర్తుపెట్టుకునేలా ఉన్నాయి. భాస్కరభట్ల గారి సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంటుంది.  శ్రీకాంత్ గారితో చేసిన ప్రతి సినిమా విజయవంతమైంది. షైన్ టామ్ చాకో గారు చాలా ఎనర్జీ వున్న యాక్టర్.  ఈ సినిమాకి ఆయన సహకారం చాలా పెద్ద ప్లస్ అయింది. ఆయన వల్ల ఎన్నో అద్భుతమైన లొకేషన్లు దొరికాయి. ఆయన చాలా ఎనర్జిటిక్ వ్యక్తి. సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులు ఆ పాత్రను చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ థాంక్ యూ. ఈ సినిమా కోసం ఒక కొత్త లాంగ్వేజ్ మాట్లాడాను. అది మీరు స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు.
రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. ఈ పాట చూస్తున్నంతసేపు నాకు ఒక ప్రత్యేకమైన తృప్తి కలిగింది. ఈ సినిమా విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేము రికార్డ్ చేసిన మొదటి పాట కూడా ఇదే. ‘ఒరియా పిల్ల’ అనే పదంతో పాట చేయాలనే ఆలోచన కూడా నాదే. విజయ్ ఆ ఆలోచనను అద్భుతంగా మ్యూజికల్ రూపంలో అందించాడు. భాస్కరభట్ల గారు ఈ పాటలో ‘అదృష్టం చెంచాడు’ అని రాశారు. కానీ ఈ సినిమాలో అదృష్టం చెంచాతో కాదు, బకెట్ల కొద్దీ ఉంది. ఈ చిత్రంలో చాలా పెద్ద స్టార్ కాస్ట్ నటిస్తోంది. ఇది దాదాపు ఏడాదిన్నర ప్రయాణం. జానకిరామ్ చెప్పిన ఐడియా నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఒక్కో అంశాన్ని జోడిస్తూ ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. శ్రీ విష్ణు ఈ తరం ఆల్‌రౌండర్. అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడే పాజిటివ్ ఇమేజ్ ఉన్న నటుడు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆయనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఏడాదికి కనీసం మూడు సినిమాలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీకి శ్రీ విష్ణు ఒక వరం. అలాగే దర్శకుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుంటారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఒక హిలేరియస్ ఎంటర్‌టైనర్. ఇది శ్రీ విష్ణు కెరీర్‌లోనే అతిపెద్ద ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది. మా బ్యానర్ నుంచి శివ నిర్వాణ, బాబీ, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని వంటి ఎంతోమంది దర్శకులు పరిచయమయ్యారు. ఇప్పుడు జానకిరామ్ కూడా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన భవిష్యత్తులో చాలా మంచి దర్శకుడిగా ఎదుగుతారు. ‘కామ్రేడ్ కళ్యాణ్’ నూటికి నూరు శాతం విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను.”
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ..‘ఒరియా పిల్ల’ పాటను ఒడిశాలో చిత్రీకరించాం. సినిమాలోని నాలుగు పాటలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన నా మిత్రుడు విజయ్ బుల్గానిన్‌కు ధన్యవాదాలు. అలాగే అందరం పాడుకునేలా అద్భుతమైన సాహిత్యం అందించిన భాస్కరభట్ల గారికి కృతజ్ఞతలు. మా టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేసింది. మాకు అండగా నిలిచిన కోన వెంకట్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. శ్రీ విష్ణు గారు ప్రతి విషయంలోనూ ఎంతో సహకరించారు. ఆయన కోసం నేను ఒక ప్రత్యేక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాను. త్వరలోనే దాన్ని వెల్లడిస్తాను. అందరికీ ధన్యవాదాలు.”
నిర్మాత వెంకట కృష్ణ కర్నాటి మాట్లాడుతూ… ఈ పాట మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. శ్రీ విష్ణు గారు నాకు ఒక సోదరుడిలా అండగా నిలిచారు. అలాగే మా టెక్నీషియన్లు కూడా ఎంతో సహకరించారు. ఈ సినిమాలో మంచి ఫన్, మంచి మ్యూజిక్ రెండూ ఉంటాయి. ఇందులోని నాలుగు పాటలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి. నాలుగు పాటలూ సూపర్ హిట్ అవుతాయని నమ్ముతున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి.
షైన్ టామ్ చాకో మాట్లాడుతూ..‘దసరా’ తర్వాత ‘దేవర’, ‘రాబిన్‌హుడ్’ చిత్రాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో ఒక అద్భుతమైన మిలటరీ పాత్ర చేశాను. శ్రీ విష్ణు గారితో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. కోన వెంకట్ గారికి, దర్శకుడు జానకిరామ్ గారికి ధన్యవాదాలు. ఇది చాలా కొత్తదనం ఉన్న సినిమా. ఈ పాట పెద్ద తెరపై మరింత అద్భుతంగా కనిపిస్తుంది.
సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. నాకు ఇంత మంచి సినిమా అవకాశం ఇచ్చినందుకు కోనా గారి ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను. జానకిరామ్ గారు తొలి సినిమా చేస్తున్నప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా వ్యవహరించారు. నన్ను చాలామంది నిర్మాతలకు పరిచయం చేసిన వ్యక్తి భాస్కర్ భట్లగారు. ఆయనపై నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. శ్రీ విష్ణు గారితో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాటతో పాటు మిగతా పాటలన్నీ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. నాలుగు పాటలూ మంచి హిట్స్ అవుతాయని నమ్ముతున్నాను.
లిరిక్ రైటర్ భాస్కరభట్ల మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గారు నటనలో విశ్వరూపం చూపిస్తున్నారు. ఆయనకు పాటలపై కూడా ఎంతో మక్కువ ఉంది.  కోన గారి ఈ సినిమాలోని 90 శాతం పాటలు నేనే రాశాను. విజయ్‌తో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. ఇందులోని ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ విష్ణు గారికి, కోన వెంకట్ గారికి ధన్యవాదాలు. ఈ పాట నా మనసుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఖచ్చితంగా వైరల్ అవుతుందని నమ్ముతున్నాను.
ఎడిటర్ చోటా కె. ప్రసాద్ మాట్లాడుతూ.. శ్రీ విష్ణు గారితో నా తొలి సినిమా ‘సామజవరగమన’. అది పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఆ విజయాన్ని పదింతలు మించి సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఈ పాట చాలా మంచి సందర్భంలో వస్తుంది. ఈ చిత్రం కోసం శ్రీ విష్ణు గారు ఒరియా భాష కూడా నేర్చుకున్నారు. అది ఎంత వినోదాత్మకంగా ఉంటుందో థియేటర్లలో చూసి ఆనందిస్తారు.
బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘ఒరియా పిల్ల’ పాట విన్న తర్వాత చాలా కాలం తర్వాత ఒక మంచి తెలుగు పాట విన్న అనుభూతి కలిగింది. ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంది. విజయ్ బుల్గానిన్‌కు పల్లె వాసన, మట్టి వాసన బాగా తెలుసు. అందుకే ఆయన సంగీతంలో ఒక సహజత్వం, స్వచ్ఛత కనిపిస్తాయి. శ్రీ విష్ణు గారి సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఇష్టపడతారు. ఆయన స్వయంకృషితో ఎదిగిన స్టార్. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. కోన గారు అంటే మా ఫ్యామిలీ. ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా భారీ విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

Related posts