‘ఆదిత్య 369’ కోసం చిరంజీవి ప్రచారం!

Chiranjeevi campaign for 'Aditya 369'!
Spread the love

బాలకృష్ణతో కలిసి ఓ ఫ్యాక్షన్‌ మూవీ చేయాలని ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి బాలకృష్ణ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్‌కు చిరు, వెంకటేశ్‌ సహా పలువురు నటీనటులు, దర్శకులు హాజరై బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఇంద్ర’, ’సమరసింహారెడ్డి’ పాత్రలతో కథ సిద్ధం చేయాలని చిరంజీవి దర్శకులకు పిలుపునిచ్చారు. మరి అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియదు కానీ, ఒకప్పుడు బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం చేశారు. తండ్రి నట వారసత్వం పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు. ‘ఆదిత్య 369’ రిలీజ్‌ అయిన తర్వాత మరింత ప్రచారం కల్పించడానికి, పిల్లలను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్మాత దూరదర్శన్‌లో ప్రకటనలు ప్రసారం చేయాలని ప్లాన్‌ చేశారు. చిరంజీవితో ప్రచారం చేయిస్తే మంచి ఫలితాలు వస్తాయని భావించి ఆయన్ను రిక్వెస్ట్‌ చేశారట. నిర్మాత అడగ్గానే వెంటనే ఒప్పుకొన్న చిరంజీవి ‘ఆదిత్య 369’ సినిమా యాడ్స్‌లో నటించారు. ఈ యాడ్స్‌ దూరదర్శన్‌లో ప్రసారం అయి ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి తోడ్పడ్డాయి. బాలకృష్ణ నటన, ఇళయరాజా సంగీతం, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ, చిరు ప్రచారం సినిమాకు భారీ విజయాన్ని అందించాయి.

Related posts

Leave a Comment