చిత్రం : ఆచార్య
దర్శకత్వం : కొరటాల శివ
విడుదల : 29, ఏప్రిల్ 2022
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2/5
నటీనటులు :
చిరంజీవి, రామ్ చరణ్,
పూజా హెగ్డే, సోనూసూద్,
తనికెళ్ళ భరణి, అజయ్,
జిషు సేన్ గుప్తా, సివీయల్ నరసింహారావు,
సంగీత, రెజీనా,
వెన్నెల కిషోర్, సత్యదేవ్ తదితరులు
నిర్మాణం :
కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ,
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు :
నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : తిరు
ఎడిటర్ : నవీన్ నూలి
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాని మెగాఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారు. అభిమానులు కూడా అలాగే ఫీలయ్యారు. తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిదే కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకోవడం సహజమే! అందుకే ఈ ‘ఆచార్య’ కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. వివిధ కారణాల వల్ల ఎన్నో సార్లు విడుదలలో జాప్యం జరిగిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ( ఏప్రిల్ 29,2022)న థియేటర్లలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై మంచి పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా అంతే గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్ బాగా క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు? తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటించిన చిత్రాన్ని అభిమానులేకాదు.. సినీ ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..
కథేంటో చూద్దాం..
స్వయంగా అమ్మవారు వెలిసిన పుణ్యస్థలం ధర్మస్థలి. ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ధర్మస్థలి దేవాలయం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే తండా. ఆ ప్రాంత ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో విడదీయరాని బంధం ఉంటుంది. పాదఘట్టం తండా వాసులు ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ ధర్మంగా ఉంటారు. అయితే.. అక్కడే ఉంటున్న ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న(సోనూసూద్) ఎంతో క్రూరుడు. ఆ పవిత్ర ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. ఆధిపత్యం చెలాయిస్తుంటాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ (జిషు సేన్ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు. ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య (చిరంజీవి). బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ధర్మస్థలిలో అడుగుపెట్టిన ఈ ఆచార్య ఎవరు? ధర్మస్థలికి అతడికి ఎలాంటి సంబంధం ఉంది? ధర్మస్థలినే వెతుక్కుంటూ ఆచార్య ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ (రామ్ చరణ్)కి ఉన్న అనుబంధం ఏంటి? అసలు ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేదే మిగతాకథ.
విశ్లేషణలోకి వెళదాం..
టాలీవుడ్ దర్శకుల్లో కొరటాల శివకు మంచి పేరుంది. తను అనుకున్న కమర్షియల్ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్ కొట్టడంలో బహు నేర్పరి అని అందరూ చెబుతుంటారు. ప్రభాస్ ‘మిర్చి’ మొదలు.. మహేష్ బాబు‘భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ మంచి విజయాల్ని చవిచూసినవే కావడం గమనార్హం! అయితే.. అలాంటి సూపర్ హిట్ దర్శకుడు కొరటాల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమా తీస్తే..ఇలాగేనా? ఉండేది? అనిపించకమానదు. ధర్మస్థలి అనే ఆధ్యాత్మిక ప్రాంతం.. దాన్ని నమ్ముకొని తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్న జనం.. అక్కడ ధర్మం నిలవాలని తపించే ఒక యువకుడు. ఇలాంటి కాన్సెప్ట్ ను రెగ్యులర్ యాక్షన్ చిత్రాల మాదిరిగా మరీ అంత భారీ బిల్డప్పులు, ఎలివేషన్ప్ లేకుండా క్లీన్ అండ్ నీట్ గా ప్రెజెంట్ చేయాలని దర్శకుడు భావించాడు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి యాక్షన్ హీరోలు నటించడం వల్ల అభిమానులు ఆ ఇద్దరి ఇమేజ్ కు తగ్గ అంశాల్ని ఆశిస్తారు. సినిమాలో వారు కోరుకున్నవి తక్కువ స్థాయిలో కనిపిస్తాయి. స్టార్ హీరోలతో సినిమా.. అదీ తొలిసారి రామ్ చరణ్ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్నసినిమా వస్తుందంటేనే ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.. కొత్త కథని ఆశిస్తారన్నది దర్శకుడు మరచిపోయారా? అనిపించింది. పాచిపోయిన పాత కథనే కొత్తగా చెప్పాలనుకున్న దర్శకుడు కొరటాల శివ పూర్తిగా తడబడ్డాడు. సాఫీగా సాగని కథనం.. ఆసక్తికరంగా లేని సన్నివేశాలు.. ఇలా ఒకటేమిటి? కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ దర్శకుడు తీవ్ర నిరాశకు గురి చేశాడు. సినిమా ప్రారంభంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించిన్నప్పుడు ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి కలుగుతుంది. అయితే.. ఆ ఆసక్తి ఎంతో సమయం నిలవలేదు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ… కథపై ప్రేక్షకుడికి అంతగా ఆసక్తి కలగదు. విశ్రాంతికి ముందు సిద్ధ పాత్ర ఎంటర్ అవడంతో సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి పెరుగుతుంది. అయితే.. అక్కడకూడా దర్శకుడు కొరటాల శివ ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేక చతికిలబడ్డాడు. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సన్నివేశాలు మినహా మిగతాదంతాసో..సోగానే సాగుతుంది. కథను పక్కకు పెట్టి.. స్టార్ క్యాస్ట్ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు దర్శకుడు. కథలో చెప్పుకోవడానికి ఎలాంటి ట్విస్టులు కనిపించవు. ఏమైనా తప్పనిసరిగా చెప్పుకోవాలంటే.. నక్సలైట్స్‌గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాల గురించి మాత్రమే చెప్పుకోవాలి. వీరిద్దరిమధ్య వచ్చే సీన్స్ అభిమానులనే కాదు.. ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటాయి. ఇక నీలాంబరి (పూజా హెగ్డే), సిద్ధల మధ్య వచ్చే సన్నివేశాలు అయితే కథకు అతికినట్టుగా ఉంటాయి తప్ప..ఎక్కడా ఆసక్తి కలిగించవు. ‘లాహే లాహే..’, ‘భలే భలే బంజారా..’ పాటలకి రామ్ చరణ్‌తో చిరంజివి వేసే స్టెప్పులు విశేషంగా అలరించాయి. చూసిన ప్రతీ ఒక్కరినీ వాహ్.. అనిపించేలా చేశాయి. క్లైమాక్స్ కూడా ఏ మాత్రం ఆసక్తికరంగా అనిపించదు. రొటీన్ గానే పేలవంగా ఉండి అభిమానులనే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులను ‘అయ్యో.. ఆచార్య!!’ అనిపించేలా నిరాశకు గురిచేశాయి.
నటీనటుల గురించి చెప్పుకుందాం..
‘ఆచార్య’ గా చిరంజీవి నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కథాకథనాలకు తగ్గట్టుగా.. తన రెగ్యులర్ మాస్ చిత్రాలకు భిన్నంగా ఇందులో ఆయన అభినయం కనిపిస్తుంది. ‘ఆచార్య’గా తనదైన నటనతో మెగాస్టార్ ఇరగదీశాడు. ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టిన పిండే! ‘ఆచార్య’గా ఫైట్స్ సీన్స్‌తో పాటు డ్యాన్స్ కూడా అదరగొట్టేశాడు. ముఖ్యంగా ‘లాహే లాహే..’ పాటతో పాటు, రెజీనా స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి అదిరిపోయే స్టెప్పులేసి భలే ఆకట్టుకున్నాడు. ఇక ‘భలే భలే బంజారా’ సాంగ్‌కి రామ్ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తండ్రి చిరుతో కూడా చెర్రీ డ్యాన్స్ అద్భుతంగా కుదిరింది. అరవై ప్లస్ ఏజ్ లో కూడా కొడుకుతో కలసి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది. అడవుల్లో నక్సల్స్ గా తండ్రీ కొడుకుల అభినయం, యాక్షన్ ఆకట్టుకుంటాయి. సిద్ధగా నటించిన రామ్ చరణ్ ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ప్రతి సీన్‌లోనూ చిరంజీవితో పోటీపడీ నటించి..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇక రామ్ చరణ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజధోరణిలో రెచ్చిపోయాడు. ఫస్టాఫ్ అంతా కథని మెగాస్టార్ తన భూజాన వేసుకొని నడిపిస్తే.. సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సినిమాలో పూజాహెగ్డే పాత్రకు ప్రాధాన్యత లేదు. సిద్ధని ప్రేమించే యువతిగా, సంగీతం టీచర్ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింద ఆమె. విలన్‌గా సోనూసూద్.. మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్‌గా జిషు సేన్ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్ చక్కటి నటనను కనబరిచారు. తమ పాత్రల నిడివి చాలా తక్కువే అయినా..కామ్రేడ్ శంకర్ అన్నగా సత్యదేవ్, అతడి భార్యగా నవీనారెడ్డి కనిపించారు. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించి మెప్పించారు.
సాంకేతిక విషయాలకొద్దాం…
ముందుగా చెప్పుకోవాలంటే.. తిరు సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతీ సన్నివేశాన్ని తన కెమెరాలో ఎంతో అద్భుతంగా బంధించి మంచి మార్కుల్ని కొట్టేశాడు. ముఖ్యంగా ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ని తెరపై కళ్లు మిరుమిట్లు గొలిపేలా చక్కగా చూపించాడు. హ్యాట్సాఫ్ తిరు. మణిశర్మ సంగీతంలో మెరుపులే కనిపించలేదు. చప్పగా సాగి అంతంత మాత్రమేననిపించింది. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక రామ్ లక్ష్మణ్ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ గా నిలిచిపోతుంది. పాటలు.. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే. సినిమా స్థాయికి తగినట్లుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి. మొత్తం మీద ‘ఆచార్య’గా చిరంజీవి, సిద్ధగా రామ్ చరణ్ తొలిసారి తెరపై కనిపించి అభిమానులకు కనువిందు చేసినప్పటికీ.. వారిద్దరి అభినయాన్ని దర్శకుడు కొరటాల శివ ఏ మాత్రం ఉపయోగించుకోలేక చిత్రం చతికిలపడేలా చేశాడు. ఈ ‘ఆచార్య’ పరాజయం పూర్తిగా దర్శకుడు కొరటాల శివ ఘోర వైఫల్యమే!!
-ఎం.డి. అబ్దుల్