‘బైకర్’మూవీ రివ్యూ: ఎమోషనల్ రైడ్!

'Biker' Movie Review: An Emotional Ride!
Spread the love

>టాలీవుడ్ లో విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించే శర్వానంద్.. ఈసారి ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ హీరో డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. ప్రభాస్ సన్నిహితులు ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ కృష్ణా రెడ్డి నిర్మాతలుగా ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇండియాలోనే మొట్టమొదటి మోటోక్రాస్ మూవీగా, తెలుగులో మొట్టమొదటి డాల్బీ విజన్ సినిమాగా ఈ‘బైకర్’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం…

కథలోకి.. విక్కీ అలియాస్ విక్రమ్ నారాయణ్ (శర్వానంద్), తన భార్య అనన్య (మాళవిక నాయర్), తన కొడుకుతో కలిసి ఒక సింపుల్ లైఫ్ గడుపుతూ ఉంటాడు. తాను గో-కార్టింగ్ రేస్ ట్రాక్ నిర్వహిస్తూ ఉంటే, భార్య అతనికి చేదోడు వాదోడుగా ఒక బోటిక్ నిర్వహిస్తూ ఉంటుంది. సరదాగా సాగిపోతున్న వీరి జీవితంలోకి, విక్రమ్ తండ్రి సునీల్ నారాయణ (రాజశేఖర్) మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఒక పెద్ద కుదుపు వస్తుంది. తాను తన తండ్రికి అండగా నిలబడాలంటూ విక్కీ తన భార్యకు చెప్పి, తన తండ్రి దగ్గరకు బయలుదేరుతాడు. అయితే అప్పటివరకు తన తండ్రి నుంచి విక్కీ ఎందుకు దూరంగా ఉన్నాడు? ‘బైకర్‌’గా పేరుగాంచిన విక్కీ, ఎందుకు ఆ బైక్ రేసింగ్ వదిలేసి తండ్రికి దూరంగా వచ్చేసాడు? చివరికి తన తండ్రి మీద పడ్డ అవినీతి మరకలకు విక్కీ ఎలాంటి సమాధానం ఇచ్చాడు? అసలు విక్కీ రేసింగ్ ఎందుకు వదిలేశాడు? అనన్యతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? విక్కీ జీవితంలో ఆమె పాత్ర ఏమిటి? రేసింగ్ మానేశాక విక్కీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు వచ్చినా.. మోటోక్రాస్ రేసింగ్ అనే పాయింట్‌ను ఎవరూ టచ్ చేయలేదు. ఈ కొత్త నేపథ్యమే ‘బైకర్’ సినిమాకు ప్రధాన బలం. కథలో కొన్ని అంశాలు రొటీన్‌గా అనిపించినా.. తెలుగు తెరకు కొత్తదైన ఈ స్పోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం, యాక్షన్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. మన దగ్గర పెద్దగా పరిచయం లేని ఆటను, ఎమోషన్స్‌తో ముడిపెట్టి సామాన్య ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సాధారణంగా తెలుగు వెండితెరపై స్పోర్ట్స్ డ్రామాలు అంటే క్రికెట్ లేదా కబడ్డీ వంటి కథలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, దానికి భిన్నంగా బైక్ రేసింగ్ అనే సరికొత్త బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని ఈ ‘బైకర్’ను రూపొందించారు. నిజానికి ఏ స్పోర్ట్స్ సినిమాకైనా ఒకే ఫార్ములా ఉంటుంది హీరో మొదట ఓడిపోవడం, అవమానాలు ఎదుర్కోవడం, చివరకు పట్టుదలతో విజయం సాధించడం. ‘బైకర్’ కూడా అదే బాటలో సాగుతుంది. అయితే, ఇక్కడ రేసింగ్ ట్రాక్‌పై సాగే ఉత్కంఠభరితమైన విన్యాసాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. బైక్ రేసింగ్ అనేది తెలుగు ప్రేక్షకులకు కనెక్టివిటీ విషయంలో కొంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ, స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి మాత్రం ఇది భలే నచ్చేస్తుంది. ఒక పక్క గతాన్ని, మరోపక్క ప్రస్తుతాన్ని చూపిస్తూ నాన్-లీనియర్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి, చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ విక్కీ ప్రశాంతమైన జీవితాన్ని చూపిస్తూనే, తన తండ్రికి ఎందుకు దూరమయ్యాడు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. సెకండ్ హాఫ్‌లో విక్కీ తన తండ్రి కోసం ఎలా నిలబడ్డాడు అనే విషయాన్ని చూపిస్తూనే, తండ్రికి మాట రానివ్వకుండా కొడుకులు ఎంత దూరానికైనా వెళ్తారనే విషయాన్ని ఆసక్తికరంగా చూపించాడు. తండ్రిని ప్రేమించే కొడుకులకు, కొడుకులను ప్రేమించే తండ్రులకు ఒక ట్రిబ్యూట్ లాగా ఈ సినిమాని దర్శకుడు రాసుకున్నాడు. ఒకపక్క రేసింగ్ ఎపిసోడ్స్ ఎంత రేసీగా చిత్రీకరించాడో, మరోపక్క ఎమోషనల్ ఎపిసోడ్స్ కూడా అంతే బలంగా రాసుకున్నాడు. డైలాగ్స్ కూడా గుండెల్ని పిండేలా కాకుండా, ఆలోచింపజేసేలా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కథలోని కీలక మలుపుల దగ్గర దర్శకుడు సేఫ్ గేమ్ ఆడాడు. కొత్తదనం కోసం ప్రయత్నించకుండా రొటీన్ ఫార్మాట్‌ను ఎంచుకోవడం కాస్త నిరాశపరుస్తుంది. ముఖ్యంగా రేసింగ్ సమయంలో హీరో పడే మానసిక సంఘర్షణను ఇంకాస్త బలంగా చూపించి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది. హీరోకు ఎదురయ్యే సవాళ్లు, స్పాన్సర్‌షిప్ ఎపిసోడ్స్ చాలా సింపుల్‌గా, ఎలాంటి కష్టం లేకుండా పరిష్కారం కావడం వల్ల కథలో వాస్తవికత లోపించినట్లు అనిపిస్తుంది. రేసింగ్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆ రేస్‌కు దారితీసే పరిస్థితులను ఇంకాస్త ఎఫెక్టివ్‌గా రాసుకోవాల్సింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగున్నా.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిగా సాగుతుంది, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది.

ఎవరెలా చేశారంటే… శర్వానంద్ లుక్ చాలా ఫిట్‌గా ఉంది. ఒక ప్రొఫెషనల్ రేసర్‌గా తన నటనతో పూర్తి న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా తన మార్క్ చూపించాడు. ఈ సినిమా కోసం హీరో శర్వానంద్ పడ్డ కష్టం అడుగడుగునా కనిపిస్తుంది. ఒక ప్రొఫెషనల్ బైకర్‌లా కనిపించడం కోసం ఆయన సుమారు 23 కేజీల బరువు తగ్గి, తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. నటన పరంగా కూడా శర్వా తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. ముఖ్యంగా డా. రాజశేఖర్‌తో వచ్చే సన్నివేశాలు చాలా బాగా పండాయి. ఈ చిత్రంతో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కారని చెప్పొచ్చు. హుందాగా ఉంటూనే, పాత్రకు తగ్గట్టుగా ఆయన ఒదిగిపోయిన తీరు మెప్పిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయనకు ఇది ఒక గొప్ప ఆరంభం. సెకండాఫ్ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది. ఇక హీరోయిన్ మాళవిక నాయర్ తన పరిధి మేరకు నటించినప్పటికీ, లుక్స్ పరంగా ఆమె పాత్రకు ఆమె వయసు కంటే కాస్త ఎక్కువ వయసు ఉన్నట్లుగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం: దర్శకుడు అభిలాష్ రెడ్డి రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకుని కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమాకు ఇది కొత్త పాయింట్ కావడంతో ప్రేక్షకులకు ఆసక్తి కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది టెక్నికల్‌గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే సినిమాల్లో ఒకటి. ఇలాంటి రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్ జె. యువరాజ్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. రేసింగ్ సీన్స్‌ను అత్యద్భుతంగా కెమెరాలో బంధించారు. విజువల్స్ గ్రాండ్‌గా ఉన్నాయి. థ్రిల్లింగ్ సీన్స్‌లో జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం ప్రాణం పోసింది. సౌండ్ డిజైన్ వర్క్ చాలా బాగుంది. అలానే సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళిన మ్యూజిక్ డైరెక్టర్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అభినందించి తీరాలి. సినిమా విషయంలో ఏమాత్రం వెనుకాడకుండా ఖర్చుపెట్టిన యు.వి. క్రియేషన్స్ ప్రతి రూపాయి స్క్రీన్ మీద కనిపించింది. ముఖ్యంగా అలాంటి లొకేషన్స్ కి వెళ్లి షూట్ చేసుకువచ్చిన సినిమా టీం మొత్తాన్ని అభినందించాల్సిందే. రొటీన్ కథలు ఎవరైనా చేస్తారు, కానీ ఊపిరి బిగబట్టుకుని చూసేలా రేసింగ్ ఎపిసోడ్స్ చిత్రీకరించిన టీం మొత్తం ఖచ్చితంగా ‘లయన్ హార్ట్స్’ అనే చెప్పాలి. మొత్తం మీద ‘బైకర్’ ఒక ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా. ఇప్పటివరకు టచ్ చేయని మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు, శర్వానంద్, డా. రాజశేఖర్‌ల అద్భుతమైన నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. రేసింగ్ సన్నివేశాలు కూడా థ్రిల్ చేస్తాయి (3.25/5)

Related posts