చిత్రం: భీమ్లానాయక్
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5
విడుదల : ఫిబ్రవరి 25, 2022
నటీనటులు :
పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి
నిత్యామీనన్, సంయుక్త మీనన్
సునీల్, రావు రమేష్, మురళీశర్మ,
సముద్ర ఖని, రఘుబాబు, బ్రహ్మానందం
నర్రా శ్రీను, కాదంబరికిరణ్, చిట్టి,
రామకృష్ణ, పమ్మి సాయి తదితరులు
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి.
నిర్మాణం : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
దర్శకత్వం: సాగర్ కె.చంద్ర
‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలతో పాటు స్క్రీన్ ప్లేను అందించారు. పవర్ స్టార్ పవన్ ళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా, రానా సరసన సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం మలయాళంలో విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషీయం’ సినిమాకు రీమేక్. ఈ సినిమా విడుదలకు ముందే వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్లు సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి. 25 ఫిబ్రవరి 2022న విడుదలైన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకుందా.. లేదా? తెలుసుకోవాలంటే మూవీ రివ్యూలోకి వెళదాం..
కథ : డ్యానీ (రానా) మిలిటరీ నుంచి రిటైర్ అయి తనకు తిరుగులేని విధంగా ఇష్టం వచ్చినట్టుగా ప్రవరిస్తూ ఉంటాడు. అదే గ్రామానికి ఎస్.ఐగా వచ్చిన బీమ్లా నాయక్ (పవన్ కళ్యాన్) తో డ్యానీకి చిక్కులు మొదలవుతాయి. ఓ కేసు విషయంలో డ్యానీని భీమ్లా నాయక్ జైలుకు కూడా పంపుతాడు. తాను బెయిల్ పై వచ్చాక నీ అంతు చూస్తా.. అంటూ డ్యానీ, బీమ్లా నాయక్ కు వార్నింగ్ ఇస్తాడు. వారిద్దరి మధ్య తీవ్ర వైరం నెలకొంటుంది. డ్యానీ తండ్రి అతని ద్వేషానికి ఆజ్యం పోస్తూ ఉంటాడు. అలాగే భీమ్లా భార్య సుగుణ (నిత్యామీనన్) కూడా భర్తను ఏ మాత్రం తగ్గొద్దంటూ కోపాన్ని నూరి పోస్తుంది. తరువాత భీమ్లా ఇంటిని డ్యానీ కూల్చి వేయడం, డ్యానీ కారును భీమ్లా పేల్చి వేయడం ఇలా సినిమాలో చాలా సంఘటనలు జరుగుతాయి. చివరకు భీమ్లా, డ్యానీ ఇద్దరూ ఒకరికిపై ఒకరు దాడికి కూడా దిగుతారు. ఒకరినొకరు చితకొట్టేసుకుంటారు. భీమ్లా చేతిలో డ్యానీ చావడం ఖాయమని తేలుతుంది. అదే సమయంలో.. డ్యానీ భార్య (సంయుక్త మీనన్చ్చి)వచ్చి భీమ్లాను వేడుకుంటుంది. ఒకప్పుడు ఆమె చిన్న తనంలో భీమ్లా కాపాడి ఉంటాడు. అందువల్ల ఈ సారి కూడా ఆమె కోసం భీమ్లా, డ్యానీని వదిలేస్తాడు. ఆ పై భీమ్లా వేరే ఊరికి బదిలీ అవుతాడు. ఓ ఏడాది గడిచాక భీమ్లా, డ్యానీ ఇద్దరూ కలుసుకోవడంతో కథ ముగుస్తుంది.
ఎలా ఉందంటే… ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాతో ఆకట్టుకున్న సాగర్ కే చంద్ర ‘భీమ్లా నాయక్’ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించారు. భీమ్లా నాయక్ ప్రధాన పాత్రల మధ్య వివాదం దర్శకుడు చాలా చక్కగా చూపించేశారు. పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. అటు రానా- ఇటు పవన్ కళ్యాణ్ మధ్య సీన్స్ చిత్రానికి ఎంతో హైలెట్ గా నిలిచాయి. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రం. ’భీమ్లా నాయక్’ కథ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే మలయాళంలో ప్రూవ్ అయిన కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు త్రివిక్రమ్ మూలకథలో పలు మార్పులు చేర్పులు చేసారు. మలయాళంలో ఇద్దరు పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంది. అందుకే అక్కడ ఈ చిత్రానికి ఇద్దరు పేర్లు వచ్చేలా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే టైటిల్ పెట్టారు. తెలుగుకు వచ్చే సరికి పవన్ కళ్యాణ్ హీరో కావడంతో ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ వేసారు. తెలుగుకు వచ్చేసరికి రానా పాత్రకు ప్రాధాన్యం తగ్గించి , పవన్ కళ్యాణ్ చేసిన పాత్రకు ప్రాధాన్యత పెరిగింది. అయినప్పటికీ సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్‌ను ఢీ కొట్టే పాత్రలో రానా ఆద్యంతం ఆకట్టకున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్, రానా మధ్య వచ్చే సన్నివేశాలు.. రానా పై పవన్ కళ్యాణ్ ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం.. ‘ప్రతి శుక్రవారం వచ్చి సంతకం పెట్టాలి నా కొడకా..’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. ఇద్దరి మధ్య పోరాట సన్నివేశాలు, ఎత్తుకు పై ఎత్తులు వేసే సీన్స్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తాయి. డానియల్ పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఇక పవర్ స్టార్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భీమ్లా నాయక్ లో నటి నిత్యామీనన్ చాలా బాగా నటించగా.. పవన్ అలాగే నిత్యల మధ్య కెమిస్ట్రీ సూపర్ గా ఉంది. డేనియల్ శేఖర్ పాత్రలో రానా స్క్రీన్ స్పేస్ మొత్తాన్ని ఆక్రమించేశాడు. పవన్ కొద్దిపాటి నటన డేనియల్‌ని మరింత ఎలివేట్ చేయడానికి సహాయపడుతుంది. కేజీఎఫ్ విలన్, అఖండ విలన్ . సునీల్, సప్తగిరి, హైపర్ ఆది & టన్నుల కొద్దీ పాత్రలను తెరపై ప్రదర్శించిన భీమ్లా నాయక్ పాటలో అకస్మాత్తుగా కనిపించడం విశేషం.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రూపురేఖలు, హెయిర్ స్టైల్ బాగుంది. ఆయన గత చిత్రాలను గుర్తుచేసింది. ఫస్టాఫ్ సాగదీత, కాస్త బోరింగ్ అనిపించినా పవన్ కళ్యాణ్ , రానా యాక్టింగ్, నిత్యామీనన్ నటన, సెకండాఫ్ లోని పోరాట సన్నివేశాలు, ఆకట్టుకొనే పతాక సన్నివేశాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ‘భీమ్లా నాయక్’ చిత్రానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఎస్సెట్. ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించే మేనియా ఉన్న హీరో. ‘భీమ్లా నాయక్’ అనే ఎస్.ఐ పాత్రలో మరోసారి తనదైన మార్క్ నటన చూపించారు. రానా దగ్గుబాటి హీరోగా కంటే నటుడిగా తన స్టామినా ఏమిటో మరోసారి ‘భీమ్లా నాయక్’ సినిమాలో హీరోను ఢీ కొట్టే డేనియల్ శేఖర్ పాత్రలో అదరగొట్టారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌కు ధీటుగా తన నటనతో ఉనికి చాటుకున్నారు. ఇక కథానాయికలుగా నటించిన నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తమ పరిధి మేరకు నటించారు. సి.ఐ పాత్రలో నటించిన మురళీశర్మ, డేనియల్ శేఖర్ తండ్రి పాత్రలో సముద్ర ఖని.. డేనియల్ శేఖర్ ను వ్యతిరేకించే నాగరాజు పాత్రలో రావు రమేష్ వంటి నటులు కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. భీమ్లా నాయక్ సినిమాకు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఒకే. మొత్తం మీద ‘భీమ్లా నాయక్’ అహానికి..ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం!!
-ఎం.డి. అబ్దుల్