Bangarraju Movie Review: అలరించిన ‘బంగార్రాజు’

Bangarraju Review
Spread the love

By ABDUL.M.D

చిత్రం : బంగార్రాజు
విడుదల : జనవరి 14, 2022
టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 3/5
కథ-మాటలు-దర్శకత్వం: కల్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత : అక్కినేని నాగార్జున
స్క్రీన్ ప్లే: సత్యానంద్
నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి, జీ స్టూడియోస్

నటీనటులు :
నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి,
నాగబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, ఝాన్సీ,
సంపత్ రాజ్, గోవింద్ పద్మసూర్య , బ్రహ్మాజీ,
ప్రవీణ్, ఫరియా అబ్దుల్లా, దక్ష,
అనితా చౌదరి, రోహిణి,
రంజిత్, దువ్వాసి మోహన్ తదితరులు
సాంకేతికవర్గం:
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్
ఎడిటింగ్: విజయ్ వర్ధన్.కె
ఆర్ట్ : బ్రహ్మ కడలి

సంక్రాంతి సందర్బంగా వచ్చిన 2016లో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని ఇంకా ఎవ్వరూ మరచిపోలేదు. అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రం అయన కెరీర్ లోనే గొప్ప విజయాన్ని కైవసం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి కాసుల సునామిని సృష్టించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ సినిమాలోని ‘బంగార్రాజు’ పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా ‘బంగార్రాజు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ‘మనం’ చిత్రం తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా ఇదే కావడం విశేషం. ఈ ‘బంగార్రాజు’ చిత్రం నేడు శుక్రవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ కు చక్కటి రెస్పాన్స్ రావడం.. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ గా నిర్వహించడంతో ‘బంగార్రాజు’పై బాగా హైప్ క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? ఈ సంక్రాంతి అతడిదే అయిందా? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే…

కథేంటో చూద్దాం.. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రం ఎక్కడ ముగిసిందో..ఈ ‘బంగార్రాజు’కథ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు (నాగార్జున)..తన కుటుంబ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యతలను నాన్నమ్మ సత్య అలియాస్ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు చేరుకుంటుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుగుతూ.. అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి.. సర్పంచ్ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? అనేదే అసలు సిసలైన ముగింపు.

విశ్లేషణలోకి వెళదాం…
‘సోగ్గాడే చిన్నినాయానా’కు దీనికి పెద్దగా తేడా ఏమీ లేదు. అందులో బంగార్రాజు కొడుకు సమస్యను చక్కదిద్దితే, ఇందులో మనవడిని సమస్యల నుంచి గట్టెక్కించాడు. తొలి సినిమాలో బంగార్రాజు మాత్రమే ఆత్మగా కనిపిస్తే ఇందులో తన భార్య సత్యభామ(రమ్యకృష్ణ) కూడా ఆత్మగా కనిపించింది. ఫస్టాఫ్ అంతా చిన్న బంగార్రాజు, అతని స్నేహితులు, నాగలక్ష్మీ ప్రెసిడెంట్ కావడం, సరదా అల్లర్లతో సో. .సోగా సాగింది. సెకెండాఫ్ ప్రారంభమయ్యే సరికి ఆసక్తికరంగా సాగింది. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి ఘటన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ అనగానే ‘బంగార్రాజు’కథ ఎలా ఉండబోతుందో అని అందరూ ఊహించుకున్నారు. అనుకున్నట్లుగానే.. పల్లెటూరి వాతావరణం, కలర్ ఫుల్ పాటలు , వాటికి తగ్గ ఎమోషన్లతో ‘బంగార్రాజు’కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలాగానే ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. ఆ సినిమాలో కొడుకు, కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్లో సత్తెమ్మ ఆత్మ అదనంగా చూపెట్టాడు దర్శకుడు. ప్రధానంగా ఈ చిత్రానికి బలం నాగార్జున, నాగచైతన్యల నటననే. బంగార్రాజు నాగార్జునకి బాగా కలిసొచ్చే జానర్. మన్మథుడిగా, సోగ్గాడిగా నాగార్జునను చూడటానికి ఇష్టపడతారు జనాలు. దానికి తోడు ‘వాసి వాడి తస్సాదియ్యా’ అంటూ నాగార్జున చెప్పే డైలాగులు పేలుతాయి. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు అనడంకంటే ఎవరికివారే తమ తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి చెడుగుడు ఆడేశారు. ఈ చిత్రంలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైనత్య చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమా చివరలో వీరిద్దరూ కలిసే చేసే ఫైట్ సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఫస్టాఫ్ అంతా నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. సర్పంచ్ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. అయితే..‘వీరి వీరి గుమ్మడి పండు’గేమ్ సీన్ అలరిస్తుంది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సర్పంచ్ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. ఎక్కడా అతిగా ప్రవర్తించలేదు. అమాయకపు మాటలతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. తన హావా భావాలతో నవ్వించింది. హీరోయిన్ కృతిశెట్టికి నటనతోపాటు డాన్స్కు కూడా మంచి స్కోప్ దొరికింది. చాలా సహజంగా ఆమె నటన ఉంది. ఆమె పండించిన హాస్యం కూడా అలరించింది. బంగార్రాజు భార‍్య సత్య అలియాస్ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి విజృంభించింది. తెరపై నాగార్జున చేసిన సందడి అలరించింది. మనవడిని, నాగలక్ష్మీతో కలపడానికి తను చేసిన మేజిక్లు ఆకట్టుకున్నాయి. ఈసారి తెరపై తాను కనిపించడం కన్నా నాగచైతన్యకే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. అయితే చైతూ కూడా తండ్రితో సమానంగా ఎక్కడా తగ్గకుండా యాక్ట్ చేశాడు. నాగచైతన్య తండ్రికి పోటీగా నటించాడు. గ్రామీణ నేపథ్యంలో ఇప్పటి వరకూ చైతూ ఏ సినిమా చేయలేదు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఆయన ఈ తరహా పాత్రలకు సరిపోతాడని నిరూపించాడు. చైతూ కూడా మన్మథుడే అని ఈ సినిమా నిరూపించింది. గుడి దగ్గర రివీల్ చేసిన రావు రమేశ్ మలుపు.. స్నేహితుడు ఆది తన పాలిట శత్రువు అనే ట్విస్ట్లు అలరించాయి. మావిడి తోటలో ఎద్దు సన్నివేశం, అత్తమామలు, కోడలి మధ్య సమస్యలను సర్దుబాటు సన్నివేశంలో బంగార్రాజు చెప్పే డైలాగ్లు, తన భార్య సత్తెమ్మతో ‘ఏం చేసిన బతికుండగానే చేయాలి. చచ్చాక ఫొటోలు మాత్రమే జ్ఞాపకాలుగా ఉంటాయి’ అన్ని భావోద్వేగంగా చెప్పే మాటలు ఆకట్టుకున్నాయి. మాటలపరంగా దర్శకుడు మంచి మార్క్ చూపించాడు. ‘అచ్చొసిన చందమామ’ లాంటి సంభాషణలు అలరించాయి. నాగార్జున, రమ్యకృష్ణలది హిట్ అండ్ రొమాంటిక్ పెయిర్ అనేది అందరికీ తెలిసిందే. వారిద్దరి కెమిస్ట్రీ మరోసారి బాగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. దర్శకుడు కామెడీ మీద, ఇంకాస్త ఎమోషన్స్ మీద దృష్టి పెట్టి ఉండే ఇంకా ఆసక్తికరంగా సినిమా సాగేది. తండ్రీకొడుకులతో ఫరియా అబ్దుల్లా పాటలో చిందులేసి శహబాస్ అనిపించింది. ఫరియా అబ్దుల్లా చేసిన స్పెషల్ సాంగ్తో పాటు, పాటలన్నీ మెప్పించాయి. అన్ని కేరక్టర్స్ కీ కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. సంపత్ రాజ్, రావు రమేశ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించి తమదైన శైలిలోమెప్పించారు.
సాంకెతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్ రూబెన్స్ సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సూపర్ గా ఉంది. పాటలన్నీ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. యువరాజ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్ వర్థన్ ఎడిటింగ్ ఓకే. సినిమా స్థాయికి తగ్గట్టుగానే నిర్మాణ విలువలు ఉన్నాయి. సినిమా అంతా రిచ్ గా కనువిందు చేసింది. నిర్మాణ విలువలు, లొకేషన్లు, కెమెరా పనితనం సినిమాకు ఎసెట్. సంక్రాంతి సీజన్ లో కమర్షియల్ హంగులతో పక్కా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. సినిమా ప్రారంభంలో గుడిలో పాముతో వచ్చే ఫైట్ సీన్ ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమాలో సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ బావున్నాయి. స్వర్గం సెట్టింగ్ బావుంది. అక్కడ రంభ, ఊర్వశి, మేనకతో నాగార్జున లడ్డుండ పాట, పూవులతో అలంకరించిన కోర్టులో కబడ్డీ బావున్నాయి. పెళ్లి అంటే తంతు కాదు, ఒట్టు అని చిన బంగార్రాజుతో చెప్పించిన డైలాగులు, ప్రాణం విలువ గురించి బంగార్రాజు సత్యభామతో చెప్పిన మాటలు, తండ్రి ప్రేమ కోసం చిన బంగార్రాజు ఎంతగా అల్లాడిపోతున్నాడో చెప్పిన మాటలు, క్లైమాక్స్ లో వచ్చే డైలాగులు సినిమాకు ప్లస్ అయ్యాయి. మొత్తం మీద ఈ ‘బంగార్రాజు’ సంక్రాతి రోజున వచ్చి అందర్నీ అలరించాడు.

-ఎం.డి. అబ్దుల్

Related posts

Leave a Comment