* ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు
* అశ్రునయనాలతో అభిమానుల వీడ్కోలు
భారతీయ సంగీత ప్రపంచంలో ఓ మహత్తర యుగానికి ముగింపు పలికింది. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూయడం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరపురాని మధురగాయని ఆశా భోస్లేకు అశ్రునయనాలతో అభిమానులు వీడ్కోలు పలికారు. ఆశా మధురగానాన్ని మననం చేసుకుంటూ ఆమె అంత్యక్రియల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఆమె గళ విన్యాసాలకు అభిమానులు కాని వారుండరు. ఒక్కసారి ఆమె గాత్రంతో స్నేహం చేస్తే చాలు ఆ మధురం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె లెజండరీ గాయని ఆశా భోస్లే. ఆశా గళం నుండి జాలువారిన సినిమా గీతాలు, గజల్స్, భజన్స్, పాప్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, శాస్త్రీయ సంగీతం- అన్నీ భారతీయ సంగీతాభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘‘సంగీతమే నా ఊపిరి. అదే ఆలోచనతో నా జీవితాన్ని గడుపుతున్నాను. పాటలు పాడటం అంత సులభం కాదు. మీనా కుమారి నుంచి కాజోల్ వరకు ఎందరో నటీమణుల భావోద్వేగాలను నా పాటలతో ప్రేక్షకులకు అందించాను. కష్ట సమయాల నుంచి నేను బయటికి రావడానికి సంగీతమే కారణం’’అంటారు. 12000 పాటలు పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు ఆశా. మేరునగ సమానురాలయిన అక్క లతా మంగేష్కర్ గానవైభవం సాగుతూ ఉండగానే ఆశా తనదైన బాణీ పలికించడం విశేషం. అక్క ఛాయ నుండి బయటపడి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు ఆశా. రెండు సార్లు ఉత్తమగాయనిగా నేషనల్ అవార్డు అందుకున్న ఆశా భోస్లే కీర్తి కిరీటంలో ‘పద్మవిభూషణ్’తో పాటు పలు అవార్డులు రత్నాల్లా వెలుగుతూనే ఉన్నాయి. ఆ వెలుగును మనకు వదిలేసి మరలిరాని లోకాలకు తరలిపోయారు ఆశా. ఆమె పంచిన మధురాన్ని మననం చేసుకుంటూ అభిమానులు బాధను దిగమింగారు. భారతీయ సినిమా ప్రపంచంలో గానకోకిలగా రాజ్యమేలిన లతా మంగేష్కర్ చెల్లెలిగా ఆశా గానం ఆరంభమైంది. అయితే అక్క ప్రభావం తనపై పడకుండా జాగ్రత్త పడుతూనే ఆశా గళవిన్యాసాలు సాగాయి. అందుకు ఆమె భర్త గణపత్ రావ్ భోస్లే సహాయ సహకారాలు మరువలేనివి. ఇక ఓ.పి.నయ్యర్ స్వరకల్పనలో ఆశా గాత్రంలో జాలువారిన గీతాలు అభిమానులను కట్టిపడేశాయి. భోస్లే మరణానంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ను వివాహమాడిన తరువాత కూడా ఆశా భోస్లే గాన విన్యాసాలు సంగీతాభిమానులను పులకింప చేశాయి. కొన్ని పాటలు లతా మంగేష్కర్ కంటే ఆశా నే బాగా పాడగలదు అనే పేరూ సంపాదించారు. ఆశా భోస్లే వ్యక్తిగత జీవితం కూడా ఎన్నో మలుపులతో ఆసక్తికరంగా మారింది. కేవలం 16 ఏళ్ల వయసులోనే గణపత్రావ్ భోస్లేను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం కలిగారు. అయితే ఈ వివాహం విఫలమవడంతో, తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ ను రెండో వివాహం చేసుకున్నారు. ఆమె కుటుంబ జీవితం సుఖదుఃఖాలతో నిండి ఉంది. పెద్ద కొడుకు హేమంత్ భోస్లే మొదట పైలట్‌గా పనిచేసి, తర్వాత సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. కానీ 2015లో క్యాన్సర్‌తో ఆయన మరణించారు. ఆమె కూతురు వర్ష భోస్లే 2012లో ఆత్మహత్య చేసుకోవడం కుటుంబానికి పెద్ద దెబ్బగా మారింది. ఈ సంఘటనలు ఆశా భోస్లే వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఆమె చిన్న కొడుకు ఆనంద్ భోస్లే బిజినెస్ మేనేజ్మెంట్, ఫిల్మ్ డైరెక్షన్లో విద్యాభ్యాసం చేశారు. కుటుంబంలో సంగీత వారసత్వం కొనసాగుతోంది. మనవడు చైతన్య భోస్లే సంగీత రంగంలో కొనసాగుతుండగా, మనవరాలు జానై భోస్లే గాయని, కథక్ నర్తకిగా గుర్తింపు పొందుతున్నారు. ఆశా అంత్యక్రియల్లో పాల్గొన్న సినీ ప్రముఖులు ఆమెతో తమ అనుబంధాన్ని తలచుకొని కన్నీరు మున్నీరయ్యారు. ఆశా భోస్లే – ఆర్డీ బర్మన్ కాంబోలో రూపొందిన అనేక గీతాలు ఈ నాటికీ అభిమానులను పులకింప చేస్తూనే ఉన్నాయి. దాసరి నారాయణరావు ‘పాలు-నీళ్ళు’లో తొలిసారి తెలుగు పాట పాడిన ఆశా భోస్లే, తరువాత మరికొన్ని తెలుగు చిత్రాల్లోనూ తన గానంతో ఆకట్టుకున్నారు. వెంకటేశ్ ‘పవిత్రబంధం’ మూవీలో తెరపైనా కనిపించారు ఆశా. తన భర్త ఆర్డీ బర్మన్ బాణీల్లో రూపొందిన ‘చిన్నికృష్ణుడు’లో బాలుతో కలసి పాడిన యుగళగీతం తనకెంతో ఇష్టమని చెప్పేవారామె. ‘‘గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను. మనం మార్చలేని దాని గురించి ఆలోచించడం దండగ, వ్యక్తిగానూ, గాయనిగానూ నాకు సవాళ్లు ఇష్టం. అందుకే ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే పోటీలో వెనకబడిపోతాం’’ అంటారు ఆశా భోస్లే. చురాలియా హై తుమ్ నే…యే మేరా దిల్ యార్ కా దీవానా.. దమ్ మారో దమ్.. 7 దశాబ్దాలకు పైగా కొనసాగిన కెరియర్లో.. 20కి పైగా భాషల్లో.. 12,000లకు పైగా పాటలు పాడారు ఆశా! అందులో ఇలాంటి అజరామర గీతాలెన్నో..!యావద్భారతంలోని సంగీతాభిమానులను దుఃఖసాగరంలో ముంచుతూ ఆశా దివికేగారు. ఆమె పాట మాత్రం మనతోనే ఉంది. ఆ మధురం మనకు ఆనందం పంచుతూనే ఉంటుంది.
