భారతీయ సంగీత ప్రపంచంలో మరో ధృవతార అస్తమించింది. తన మధుర గాత్రంతో దశాబ్దాల పాటు కోట్లాది సంగీతాభిమానులను అలరించిన లెజెండరీ గాయని ఆశా భోస్లే ఏప్రిల్ 12, 2026న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోంస్లేది గాయనిగా సుదీర్ఘ ప్రయాణం. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించారు. చిత్ర పరిశ్రమకు చేసిన ఎనలేని కృషికిగానూ పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్, బంగా బిభూషన్ అవార్డులు ఆమెను వరించాయి.1943లో మరాఠీ చిత్రం ‘మజాబ్’తో ప్రారంభమైంది. అందులో ‘చలా చలా నవ్ చలా’ పాట పాడారు. 1948లో బాలీవుడ్ దర్శకుడు హంసరాజ్ బహల్ పిలుపుతో ముంబయి వెళ్లారు. 1954లో వచ్చిన ‘బూట్ పాలిష్’లోని పాటలతో ఆశాకు మంచి గుర్తింపు దక్కింది. ‘దమ్ మారో దమ్’, ‘చురా లియా హై తుమ్నే జో దిల్ కో’ తదితర పాటలు సంచలనం సృష్టించాయి.తెలుగు సినిమాల్లో ఆశా భోంస్లే పాడింది తక్కువ పాటలే అయినా దేనికదే ప్రత్యేకం. 80ల నుంచి 2007 వరకూ తెలుగులో పాడారు. ‘ఇది మౌనగీతం’ (పాలు నీళ్లు), ‘సీతాకాలం ప్రేమకు’ (అశ్వమేథం), ‘ఐసాలకిడీ’ (పవిత్ర బంధం), నాలో ఊహలకు (చందమామ) తదితర పాటలతో ఆమె అలరించారు. తన సోదరి, ప్రముఖ గాయని లతా మంగేష్కర్ వ్యక్తిగత కార్యదర్శి గణపతిరావును పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. 1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్‌ను వివాహమాడారు.1994లో ఆయన మరణించడంతో.. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలు, మనవడు, మనవరాలే లోకంగా జీవితం గడిపారు. తెలుగులో చందమామ సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ .. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ’ అంటూ సాగే పాట తెలుగు నాట చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. పలు భాషల్లో 12 వేలకుపైగా పాటలు పాడి రికార్డు సృష్టించిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే . ఒకానొక సమయంలో ఆమెకు ఓ పాట సవాలు విసిరింది. అనుకున్న విధంగా పాడతారా? లేదా? అంటూ నిర్మాత, సంగీత దర్శకుడు పందెం కూడా వేసుకున్నారు. ఆశా టాలెంట్ తెలిసిందే కదా.. మ్యూజిక్ డైరెక్టర్‌కు కావాల్సిన విధంగా పాడి, సత్తా చాటారు. ఇదంతా ‘తీస్రీ మంజిల్’ (1966)లోని హిట్ సాంగ్ ‘అహహ ఆజా’ విషయంలో జరిగింది. ఈ పాటను మహ్మద్ రఫీతో కలిసి పాడారామె. ఈ సాంగ్ పల్లవి చివరిలో వచ్చే ‘అహహ ఆజా అఅ ఆజా’ను విభిన్నంగా పాడాల్సి రావడంతో ఆశా కాస్త సందేహించారు. పాటంతా ఒకెత్తు అయితే ఇదొక ఎత్తు. అనుకున్నట్లు రాకపోవడంతో సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ వేరే పద్ధతిలో చేద్దామా అని అడగ్గా.. ఆశా దానికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే ఆమె పాడుతుందా, లేదా అంటూ నిర్మాత నాసిర్ హుస్సేన్, ఆర్.డి. బర్మన్ రికార్డింగ్ స్టూడియోలోనే రూ.500 పందెం వేసుకున్నారు. ‘అహహ ఆజా’ను రఫీ బాగా పాడగలడని నాసిర్, ఆయన కన్నా ఆశా బాగా పాడగలదంటూ బర్మన్ సరదాగా ఇలా చిన్న బెట్ వేసుకున్నారు. ఈ పాటే ఆశ- బర్మన్ పెళ్లికి నాంది పలికింది. ఈ సాంగ్‌తో ఏర్పడిన వీరిద్దరి మధ్య పరిచయం, స్నేహంగా మారి తర్వాత ప్రేమగా మారింది. 1980లో వీరి వివాహం జరిగింది. ఇది ఆశాకు రెండో పెళ్లి. 1994లో బర్మన్ మరణించారు. ‘‘గతం గురించి నేనెప్పుడూ ఆలోచించను. మనం మార్చలేని దాని గురించి ఆలోచించడం దండగ. వ్యక్తిగా, గాయనిగా.. నాకు సవాళ్లు ఇష్టం. అందుకే ప్రయోగలు చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా చేయకపోతే పోటీలో వెనకబడిపోతాం’’ అన్నది ఆశా ఫిలాసఫీ. ఆమె జీవితాన్ని కష్టాలు వెన్నంటాయి.. టీనేజ్‌లోనే ప్రేమ వివాహం.. గర్భిణిగా ఉన్న సమయంలో భర్త దూరం కావడంతో.. ఒక దశలో ఆత్మహత్యకు యత్నించినా.. ఆమె గానామృతాన్ని ఆస్వాదించే అదృష్టం ప్రపంచానికి ఉండటంతో మృత్యువును తప్పించుకొన్నారు. ‘దమ్ మారో దమ్’ అంటూ పాడి సంగీతాభిమానులను ఓలలాడించారు. 14 భాషల్లో వేలాది పాటలతో భారత చిత్రపరిశ్రమను అలరించారు. ఆశా మహారాష్ట్రలోని సాంగ్లీలో కళాకారుల కుటుంబంలో 1933 సెప్టెంబర్ 8న జన్మించారు. ఆమె తండ్రి దీననాథ్ మంగేష్కర్ థియేటర్ ఆర్టిస్ట్. అక్క లతా మంగేష్కర్. ఉమా, మీనా అక్కాచెల్లెళ్లు, హృదయనాథ్ సోదరుడు. ఆశా 9 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయింది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొనేందుకు అక్క లతా మంగేష్కర్‌తో కలిసి పాటలు పాడింది. క్లాసికల్, గజల్స్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల పాటలను అలవోకగా పాడగలగడం ఆమెకు దేవుడిచ్చిన వరం. 16 ఏళ్ల వయసులో ఆమె తన అక్క లతా మంగేష్కర్ పీఏ 31 ఏళ్ల గణపత్‌రావ్ భోంస్లేను ప్రేమ వివాహం చేసుకొన్నారు. దీనిని లతా తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కా చెల్లెళ్ల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కానీ, ఆశాకు తొలి బిడ్డ పుట్టాక పుట్టింటి వారు ఆమె వివాహాన్ని ఆమోదించారు. కానీ, గణపత్‌కు మాత్రం ఆశా పుట్టింటి వారితో.. ముఖ్యంగా లతా మంగేష్కర్‌తో సంబంధాలు నెరపడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఆశాను డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టారు. మరోవైపు గణపత్‌రావ్ కుటుంబం గాయనిని ఇంటి కోడలుగా ఆమోదించలేదు. తన చిన్నకుమారుడు ఆనంద్‌ను కనబోయే ముందు అత్తగారి కుటుంబీకులు ఆశాను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. మరోవైపు భర్త హింసాత్మక ప్రవృత్తితో ఆశా చాలా ఇబ్బందులు పడ్డారు. మూడో బిడ్డకు జన్మనివ్వడానికి ముందు.. ఆశాను ఆమె అత్తగారు ఇంటి నుంచి గెంటివేశారు. అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. దీంతో ఇక తన జీవితం ముగిసిపోయిందన్న ఆవేదనతో ఒక బాటిల్ నిద్రమాత్రలను మింగేశారు. ‘కడుపులో పెరుగుతున్న బిడ్డపై బలమైన మమకారమే నన్ను మృత్యు ముఖం నుంచి వెనక్కి తెచ్చింది’ అని ఆమే స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించారు. 1960లో ఆమె భర్త నుంచి విడిపోయారు. 1980లో మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.డి.బర్మన్‌ను ద్వితీయ వివాహం చేసుకొన్నారు. వీరిద్దరి మధ్య తొలిసారి 1966లో తీస్రీ మంజిల్ చిత్రానికి ఓ పాట రికార్డింగ్ సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నుంచి ఆర్.డి.బర్మన్ స్వరపర్చిన పలు పాటలు పాడింది. వారి స్నేహం ప్రేమగా మారింది. ఒక రోజు పెళ్లి చేసుకొందామని ఆమెకు బర్మన్ ప్రపోజ్ చేశారు. ఆశా కూడా అంగీకరించింది. కానీ, బర్మన్ తల్లికి మాత్రం ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేదు. దీంతో ఆయన కొన్నాళ్లు తల్లి మాటను మన్నించారు. కానీ, తండ్రి ఎస్.డి.బర్మన్ మరణం, తల్లి మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో.. 1980లో ఆశాను వివాహం చేసుకొన్నారు. 1994లో ఆయన చనిపోవడంతో.. అప్పట్నుంచి తన పిల్లలు, మనవడు-మనవరాలే లోకంగా గడుపుతున్నారామె. లతా మంగేష్కర్ సోదరిగా ఆమెకు గుర్తింపు ఉన్నా.. గాయనిగా ఆమె ప్రస్థానం కూడా అంత తేలికకాదు. 1947లో ఓ ప్రముఖ స్టూడియోలో ‘జాన్ పెహచాన్’ చిత్రం కోసం పాట పాడేందుకు వెళ్లారు. ఆమెతోపాటు కిశోర్‌కుమార్ కూడా ఉన్నారు. వీరిని అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి.. అవకాశం ఇవ్వకుండా తిరస్కరించి పంపించారు. ఈ విషయాన్ని ఆశానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కానీ, నేడు ఆమె 12,000కుపై పాటలతో భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారు. ఆశా భోంస్లే స్వరంలోనే కాదు.. చేతిలోనూ మ్యాజిక్ ఉంది. ఆమె చేతి వంట అద్భుతంగా ఉంటుందని బాలీవుడ్‌లో టాక్. ఆశా చేత్తో చేసిన షమి కబాబ్, కడాయ్ ఘోస్ట్, కాలీ దాల్ వంటివి రిషి కపూర్‌కు చాలా ఇష్టం. ఒక వేళ తాను గాయని కాకపోతే.. కుక్ అయ్యే దానినని ఆమె ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఆమె రెస్టారంట్ వ్యాపారం కూడా నిర్వహించారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే దుబాయ్‌లో అనే రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కువైట్, అబుదాబీ, దోహా, బహ్రెయిన్‌ల్లో విస్తరించారు. వీటిని వాఫీ గ్రూప్ నిర్వహిస్తుండగా.. వీటిల్లో ఆమెకు కొంత వాటా ఉంది. ఇక్కడి చెఫ్‌లకు ఆమె స్వయంగా ఆరు నెలలు శిక్షణ కూడా ఇచ్చారు. 90 ఏళ్లు నిండినా.. తన పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్లకు వండిపెట్టేవారు. ఆశ.. తెలుగులోనూ కొన్ని పాటలు పాడారు. ఇది మౌనగీతం (పాలు నీళ్లు), జీవితం సప్త సాగర (చిన్ని కృష్ణుడు), ఓ ప్రేమ (అశ్వమేథం), శీతాకాలం ప్రేమకు (అశ్వమేథం), జల్లంది మది (ప్రేమకు ప్రేమంటే తెలుసా), ఇసాలకిడీ (పవిత్ర బంధం), వెన్నెల (ఇద్దరు). నాలో ఊహలకు (చందమామ).. ‘పాలు నీళ్లు’లోని ‘ఇది మౌన గీతం..’తో మొదలైన ఆమె తెలుగు పాటల ప్రవాహం ‘చందమామ’లోని ‘నాలో ఊహాలకు..’ వరకు సాగింది. ఆశా ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కూడా సంగీత విద్వాంసుడే. ఆయన చిన్న వయసులోనే చనిపోవడంతో, కుటుంబం పుణె, కొల్హాపూర్ మీదుగా ముంబైకి వలస వెళ్లింది. తన సోదరి లతా మంగేష్కర్‌తో కలిసి, కుటుంబాన్ని పోషించడానికి ఆశా చిన్న వయసులోనే పాడటం మొదలుపెట్టారు. 1943లో తన మొదటి మరాఠీ పాటను రికార్డ్ చేశారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఆశా భోస్లే ప్లేబ్యాక్ సింగింగ్‌కు కొత్త అర్థం చెప్పారు. ఆమె క్యాబరే పాటలైనా, రొమాంటిక్ డ్యూయెట్లైనా, గజల్స్ అయినా.. అన్నింటినీ అవలీలగా పాడారు. ఓ.పి. నయ్యర్, రాహుల్ దేవ్ బర్మన్‌లతో ఆమె పాడిన పాటలు బాలీవుడ్‌లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత ఏ.ఆర్. రెహమాన్‌తో పనిచేసి నేటి తరం ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్, గ్లోబల్ షోలు కూడా చేశారు. ఆమె ఆస్తి విలువ సుమారు రూ. 80-100 కోట్లు ఉంటుందని అంచనా.
సంగీత రూపురేఖలు మార్చేసిన ఆశా బర్మన్ ప్రేమకథ
ఆశా భోస్లే, ఆర్.డి. బర్మన్‌ల కథ గ్రాండ్‌గా మొదలవలేదు. రికార్డింగ్ స్టూడియోల్లో, రిహార్సల్స్ మధ్య వాళ్ళ బంధం మొదలైంది. అప్పటి హిందీ సినిమా సంగీతానికి ఓ పద్ధతి ఉండేది. కానీ బర్మన్ ఆ పద్ధతిని దాటి ఆలోచించారు. ఆశా గొంతులో ఉన్న ధైర్యాన్ని, కొత్తదనాన్ని ఆయన గుర్తించారు. ‘పియా తూ అబ్ తో ఆజా’, ‘దమ్ మారో దమ్’ లాంటి పాటలు కేవలం హిట్స్ అవ్వడమే కాదు, ఓ కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి. ఈ పాటల పుట్టుకలోనే.. సంగీతం దాటిన ఓ బంధం వాళ్ళ మధ్య మొదలైంది. బర్మన్ జాజ్, రాక్, క్యాబరే లాంటి కొత్త సౌండ్స్‌తో ప్రయోగాలు చేసేవారు. ఆశా ఆ మార్పులను స్వీకరించారు. ప్రతి కొత్త ట్యూన్‌కు తగ్గట్టు తన గొంతును మార్చుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకంతోనే ఇది సాధ్యమైంది. వాళ్ళిద్దరూ కలిసి హిందీ సినిమా సంగీతం వినిపించే తీరునే మార్చేశారు. చివరికి 1980లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ ప్రేమ ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు. చాలా వ్యక్తిగతంగా ఉండిపోయింది. బర్మన్‌కు పాట ముఖ్యం కానీ విలాసాలు కాదని ఆశా తర్వాత గుర్తుచేసుకున్నారు. ఆయన కెరీర్‌లో కష్టకాలంలోనూ ఆమె తోడుగా నిలిచారు. ఆయన మరణం తర్వాత, ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆమె ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఇద్దరు ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని వదిలి పెళ్లినా.. పాటల రూపంలో వాళ్ళ సంగీతం మాత్రం ఇప్పటికీ బతికే ఉంది. ఆశా భోస్లే కేవలం 16 ఏళ్ల వయసులో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన గణపత్‌రావ్ భోస్లేను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ నిర్ణయం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. ముఖ్యంగా, తన సోదరి లతా మంగేష్కర్‌తో ఈ పెళ్లి తీవ్ర అగాధాన్ని సృష్టించింది. ఆమెది సంప్రదాయ కుటుంబం కావడంతో, ఈ బంధాన్ని వాళ్లు అంగీకరించలేకపోయారు. తన జీవితంలోని కీలక దశలో ఈ నిర్ణయం తన వాళ్ల నుంచి దూరం చేసిందని, అది తనను మానసికంగా ఎంతో కుంగదీసిందని ఆశా కొన్ని ఇంటర్వ్యూలలో గుర్తుచేసుకున్నారు. ప్రేమ వివాహంగా మొదలైన వీరి బంధం, కొద్దికాలానికే కష్టాలమయంగా మారింది. గణపత్‌రావ్ భోస్లేతో తన బంధంలో ఎన్నో అవమానాలు, హింసను ఎదుర్కొన్నానని ఆశా భోస్లే స్వయంగా వెల్లడించారు. కాలం గడిచేకొద్దీ పరిస్థితి మరింత దారుణంగా మారింది. చివరకు ఆమె మూడో బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు, తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్నారు. ఇది ఆమె జీవితంలో అత్యంత బాధాకరమైన దశ. అయినా, ఆ తర్వాత ఆమె ఎలాంటి పగ పెంచుకోకుండా, తన పిల్లలపై దృష్టి పెట్టి, ప్రశాంతంగా తన జీవితాన్ని తిరిగి నిర్మించుకున్నారు. మొదటి భర్త నుంచి విడిపోయిన తర్వాత, ఆశా భోస్లే జీవితంలోకి లెజెండరీ కంపోజర్ ఆర్.డి. బర్మన్ రూపంలో ప్రేమ మళ్లీ వచ్చింది. వీరిద్దరూ 1980లో పెళ్లి చేసుకున్నారు. వీరి బంధం ఎంతో ప్రేమగా, గౌరవప్రదంగా సాగింది. వారి బంధంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. వాటిని దాటుకుంటూ.. సంతృప్తికరమైన జీవితానని కొనసాగించారు. వీరిద్దరూ కలిసి భారతీయ సంగీతంలో కొన్ని ఐకానిక్ పాటలను సృష్టించారు. చరిత్రలో గొప్ప గాయకులలో ఒకరిగా ఆమె స్థానాన్ని సుస్థిరం చేశారు.
దమ్ మారో దమ్.. కిక్కెక్కించిన వీడియో
ఆశా భోంస్లే పాడిన దమ్ మారో దమ్ సాంగ్ ఓ సూపర్‌హిట్. హిప్ కల్చర్‌ను ప్రజెంట్ చేసిన సాంగ్ అది. ఆ రోజుల్లో ఈ పాట ఓ బంపర్ హిట్. డ్రగ్ కల్చర్‌ను.. ఆ నాటికి తగ్గ రీతిలో ఈ ఫిల్మ్‌లో చూపించారు. 1971లో రిలీజైన హరే కృష్ణ హరే రామ్ చిత్రంలో ఓ సన్నివేశంలో ‘దమ్ మారో దమ్’ సాంగ్ వస్తుంది. జీనత్ అమన్ పాత్ర ఈ సాంగ్ పాడుతుంది. ఆర్డీ బర్మన్ అందించిన సంగీతం ఓ హైలెట్. పాశ్చాత్య సంప్రదాయం వైపు మొగ్గ చూపుతున్న యువతను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆ సాంగ్ సీక్వెన్స్‌ను రూపొందించారు. వాస్తవానికి ఫిల్మ్‌లో ఈ పాట ముందు అనుకోలేదు. కానీ డ్రగ్ సీన్‌ను క్రియేట్ చేసే సమయంలో దాన్ని మరింత ఎఫెక్ట్‌గా ప్రజెంట్ చేయాలనుకున్నారు. ఆ సమయంలో రైటర్ ఆనంద్ భక్షీ రాసిన కొన్ని పదాలు సంగీత దర్శకుడు ఆర్డీ బర్మన్‌ను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఈ పాట కట్టేశారు. ఆ నాటి హిప్పీ కల్చర్‌లో ఉన్న మజాను.. సింగర్ ఆశా భోంస్లే తన వాయిస్‌లో వినిపించారు. మత్తులో చిత్తై తూగుతున్నట్లుగా ఆమె తన స్వరాన్ని పలికించారు. డ్రగ్ బానిసల భావోద్వేగాన్ని ఆశా భోంస్లే తన వాయిస్ రూపంలో అత్యద్భుతంగా ఒలికించారు. నేపాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ పాటను షూట్ చేశారు. సినిమాను రిలీజ్ చేస్తున్న సమయంలో ఓ దశలో నిర్మాత దేవానంద్ ఈ పాటను సినిమా నుంచి తీసివేయాలనుకున్నారు. కానీ ఈ సాంగ్ హిట్ అవుతుందని ఆశా భోంస్లే చెప్పడం వల్లే దాన్ని ఫిల్మ్‌లో క్యారీ చేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. బాలీవుడ్‌తో పాటు యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీనే ఈ సాంగ్ కిక్కెక్కించిందనడంలో సందేహం లేదు. దమ్ మారో దమ్.. అంటూనే హరే కృష్ణ హరే రామ్ అన్న పదాలను వాడడం పట్ల విమర్శలు వచ్చినా.. మ్యూజిక్ టీమ్ అనుకున్నట్లు ఈ సాంగ్ ఫుల్ పాపులర్ అయ్యింది. కానీ ఆల్ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్‌లోనూ ఈ పాటపై బ్యాన్ విధించారు. హరే కృష్ణ హరే రామ్ చిత్రాన్ని దూరదర్శన్‌లో ప్రదర్శించిన ప్రతిసారి ఈ పాటను కట్ చేశారు. తాజాగా రిలీజైన సూపర్‌హిట్ మూవీ ధురంధర్2లో ఈసాంగ్‌ను ఓ సీన్‌లో సౌండ్‌ట్రాక్‌గా వాడారు. సోషల్ మీడియాలోనూ ఈ ట్రాక్ ఊపేస్తోంది. మంగేష్కర్ కుటుంబంలో జన్మించిన ఆశా భోస్లే, చిన్న వయస్సులోనే సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు. సుమారు ఎనిమిది దశాబ్దాల పాటు నిరంతరాయంగా సాగిన ఆమె గాన ప్రయాణం భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచింది. 20కి పైగా భాషల్లో 12 వేలకుపైగా పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక పాటలు రికార్డ్ చేసిన గాయనిగా గుర్తింపు పొందారు. ఆమె గాన వైవిధ్యం అసాధారణం. మెలోడీ పాటలు, ఉత్సాహభరితమైన డ్యాన్స్ నంబర్స్, గజల్స్, భజనలు ఏ జానర్ అయినా ఆమె స్వరంలో ప్రత్యేక మాధుర్యం కనిపించేది. ముఖ్యంగా ఉమ్రావ్ జాన్, ఇజాజత్ వంటి చిత్రాల్లో ఆమె ఆలపించిన గజల్స్ సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఆమె సోదరి, గానకోకిల లతా మంగేష్కర్ తర్వాత భారతీయ సంగీత సామ్రాజ్యంలో అదే స్థాయి గౌరవాన్ని పొందిన గాయని ఆశా భోస్లే. సంగీత రంగానికి చేసిన అపార సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను ‘పద్మ విభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలతో సత్కరించింది. అలాగే రెండు జాతీయ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె మరణంతో టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ సంగీత ప్రపంచం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది.
<p style=”text-align: left;”>-ఎం.డి అబ్దుల్
