Arjuna Phalguna Review: పనికిరాని అర్జునుడు.. ప్రయాజనం లేని పల్గుణుడు!

Arjuna phalguna movie review
Spread the love

చిత్రం: అర్జున ఫల్గుణ
విడుద‌ల : 31 డిసెంబర్ 2021
హాయ్ బాక్సాఫీస్ రేటింగ్ : 1.5
న‌టీన‌టులు:
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్
నరేష్, శివాజీరాజా, సుబ్బరాజు
దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్
రాజ్‌కుమార్, చైతన్య తదితరులు.
ద‌ర్శక‌త్వం: తేజ మర్ని
నిర్మాణం : మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సంగీతం: ప్రియదర్శన్-బాలసుబ్రహ్మణ్యన్
ఎడిటింగ్ : ఎన్‌.విప్లవ్
సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి

హీరో శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ తర్వాత న‌టించిన చిత్రం ‘అర్జున ఫ‌ల్గుణ’‌. ‘జోహార్’ చిత్రం ఫేమ్ తేజ మర్ని దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమిది. విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాట‌లు అందర్నీ ఆకట్టుకునేలా ఉండటంతో సహజంగానే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలు ఏర్పడ్డాయి. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నేడు (31 డిసెంబర్ 2021)న విడుదలైంది. మరి ఈ ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..
డిగ్రీలు చదివినప్పటికీ ఎలాంటి ఉద్యోగం లేక సొంతూరులోనే కాలం గడుపుతుంటారు ఆ ఊరిలో ఉండే ఐదుగురు మిత్రులు అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావ‌ణి (అమృతా అయ్యర్‌), రాంబాబు (రాజ్‌కుమార్), త‌డ్డోడు (‘రంగ‌స్థలం’ మ‌హేష్‌), అస్కర్ (చైత‌న్య గ‌రికిపాటి). ఈ బ్యాచ్ గోదావ‌రి జిల్లాలోని ముల్కల్లంక అనే ఊరులో ఖాళీగా తిరుగుతూ చక్కర్లు కొడుతుంటారు. జీవితం గడవడం కోసం పట్టణాలకు వెళ్లడంకంటే సొంతూరులోనే కుటుంబానికి ఆసరాగా ఉంటూ కాలం గడిపేయాలన్నది వీరి ఆలోచన. ఈ నేపథ్యంలో స్నేహితులంతా కలిసి ఓ సోడా కంపెనీ పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటారు. అయితే అందుకు కావలసిన పెట్టుబ‌డి కోసం వారు పడే వేదన అంతాఇంతా కాదు. ఇదిలా ఉండగా త‌డ్డోడు కుటుంబానికి బ్యాంక్‌ అప్పులు సమస్యగా మారతాయి. తీసుకున్న అప్పు క‌ట్టకుంటే ఇల్లు జ‌ప్తు చేయాల్సి వ‌స్తుంద‌ని బ్యాంకు అధికారులు హెచ్చరిక‌లు సైతం జారీ చేస్తారు. సహ మిత్రుడు త‌డ్డోడు కుటుంబాన్ని ఆదుకునే క్రమంలో అర్జున్ త‌న మిత్రుల‌తో క‌లిసి చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొడతాయి. సుల‌భంగా డ‌బ్బు సంపాదించేందుకు ఎంచుకున్న గంజాయి స్మగ్లింగ్ ఆ మిత్ర బృందానికి పూర్తిగా రివర్స్ అనుకోని స‌మ‌స్యలను తెచ్చిపెట్టడంతో ఒక్కసారిగా వాళ్ల జీవితాలు త‌ల‌కిందుల‌వుతాయి. ఓ వైపు పోలీసులు .. మ‌రోవైపు రౌడీ గ్యాంగ్ వారిని వెంటాడుతుంది. ఆ ఊరితో క‌ర‌ణం (న‌రేష్‌)కు ఉన్న లింకేంటి? అర్జున్-శ్రావ‌ణి ప్రేమ‌క‌థ ఏమలుపు తిరిగింది? మిత్ర బృందానికి ఎదురైన సమస్యలేంటి? వాటిని ఎలా అధిగమించారు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హీరో శ్రీ విష్ణు పై ఉన్న ప్రేక్షకుల అంచనా మనకు తెలిసి ఓ ప్రేక్షకుడిగా మంచి కథలు, సహజమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ మధ్య తరగతి ప్రేక్షకులని మెప్పిస్తాడు అని. ఆ విధంగా ఇదివరకే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాంటి హీరో కూడా యాక్షన్ సీన్స్, బిల్డప్ షాట్స్ తో ఫైటింగులు చేస్తే హౌ….కైసా? అనిపిస్తుంది. సినిమా బిగినింగ్ లొనే ఓ బిల్డప్ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చి సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల్లోనే ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేకుండా సీన్స్ రావడం తో ప్రేక్షకులకు ..కథకు దూరం పెరిగింది. మనకు ఏదైనా కష్టం సమస్యలు వస్తే ‘అర్జున ఫాల్గుణ’ అనాలి అని మన పెద్దలు చెబుతుంటారు. నిజానికి పెద్దలు చెప్పే మాట ఈ సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులకు ఎదురైంది. అంటే ఈ చిత్రం అంతగా ప్రేక్షకులకు కష్టాలు తెచ్చిపెట్టిందన్నమాట. పైగా పెద్దలు చెప్పిన మాట /సినిమాలో ఓ పాత్ర కూడా దాదాపు చెప్పిన మాట ఏంటంటే ఏదైనా పెద్ద పిడుగు పడినప్పుడు ..పిడుగులాంటి కష్టం వచ్చినప్పుడు అర్జున ఫాల్గుణ అనాలట! ఆవారాగా తిరిగే స్నేహితులు.. వాళ్లను వెంటాడే ఆర్థిక క‌ష్టాలు.. ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేందుకు అడ్డదారి తొక్కాల్సి రావ‌డం.. ఈ క్రమంలో అనుకోని చిక్కుల్లో ప‌డ‌టం..ఇలాంటి రొటీన్ కథలు టాలీవుడ్ లో ఎన్నిచూడలేదు? ‘అర్జున ఫ‌ల్గుణ’ కూడా అదే కోవ‌కు చెందిన రొటీన్ కథే! గోదావ‌రి జిల్లాల నేపథ్యాన్ని కథకు జోడించి ద‌ర్శకుడు తేజ మర్నిచేసిన ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. ప్రారంభంలో అర్జున్ మిత్రబృందం చేసే అల్లర్లు..అనుబంధాలతో కథ మొదలుపెట్టినప్పటికీ అదే టెంపోను దర్శకుడు చివరివరకు కొనసాగించలేకపోయాడు. చివరి వరకు క‌థ‌న‌మంతా నెమ్మదిగా సాగి నిద్రావస్థలోకి జారుకునేలా చేస్తుంది. మిత్రుల మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న్ స‌న్నివేశాలు సైతం బ‌ల‌హీనంగా ఉండ‌టంతో సినిమా పేలవంగా తయారైంది. విరామానికి ముందు అర్జున్ బృందం గంజాయి స్మగ్లింగ్ కోసం అర‌కు వెళ్లడం.. స‌ర‌కుతో తిరిగొస్తుండ‌గా పోలీసుల‌కు చిక్కడం.. ఆ మధ్యలోనే కథానాయిక అనబడే శ్రావ‌ణి అరకు అడవుల్లోకి రావడం..ద్వితీయార్థంలో అర్జున్ బృందం పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డం.. అనుకోకుండా ఒడిషాలోని ఓ రౌడీ గ్యాంగ్ చేతుల్లో ప‌డ‌టం.. ఈ సన్నివేశాలన్నీ మ‌రీ సిల్లీగా అనిపించి సగటు ప్రేక్షకుడిని పూర్తిగా విసిగిస్తాయి. .
నటీనటుల విషయానికొస్తే.. అర్జున్ పాత్రలో శ్రీవిష్ణు మాస్ లుక్‌లో చక్కటి నటన కనబరిచినప్పటికీ.. అతడొక్కడే సినిమాని కాపాడలేకపోయాడు. గోదావ‌రి యాస‌లో ఆయ‌న ప‌లికిన సంభాష‌ణ‌లు జస్ట్ ఒకే! ప‌ల్లెటూరి అమ్మాయిగా శ్రావ‌ణి పాత్రలో అమృతా అయ్యర్ ఫర్వాలేదనిపించింది. అర్జున్‌తో ఆమె ల‌వ్‌ట్రాక్ సోసోనే! ఆమె నటించడానికి పెద్దగా స్కోప్ లేని పాత్రే కావడంతో అలా కానిచ్చేసింది. విష్ణు బృందంలో రాజ్‌కుమార్ పాత్ర ప్రేక్షకుల‌కు కాస్త కాల‌క్షేపాన్నిస్తుంది. పోలీస్ అధికారిగా సుబ్బరాజు, క‌ర‌ణంగా న‌రేష్ పాత్రలు ప‌రిధి మేర ఆక‌ట్టుకుంటాయి.
సాంకేతికంగా చూస్తే.. ప్రియ‌ద‌ర్శన్ బాల‌సుబ్రహ్మణ్యన్ సంగీతం, జ‌గదీష్ ఛాయాగ్రహ‌ణం ఒకే అనిపిస్తుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గట్లుగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘అర్జునుడు’ ప్రేక్షకులను సమస్యల్లోకి నెట్టి.. వారి కష్టాల్ని తీర్చమంటూ వచ్చినంత వేగంగా ‘అర్జునా పాల్గుణ’ అంటూ వెళ్ళిపోయాడు.

-ఘంటసాల జానకీ సృజన

Related posts

Leave a Comment