నటి హేమ : ప్రస్తుతానికి సినిమాలకు సెలవు!

Actress Hema: No more movies fo
Spread the love

నటి హేమ తాత్కాలికంగా సినిమాల్లో నటించడం ఆపేసారా? ఈమధ్య కాలంలో ఏ సినిమాల్లోను కనిపించడం లేదు! ఇదే విషయం ఒక ఛానెల్ ఇంటర్వ్యూ లో తేల్చి చెప్పేసారు! ప్రస్తుతానికి సినిమాలకు గుడ్ బై అన్నారు. శివగామి లాంటి పాత్రలు వచ్చినా చేయనన్నారు. తన 14 వ ఏట నుంచి నటిస్తున్నా అని, ఇప్పుడు చిల్ అవుతున్న అని హేమ తెలిపారు. ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్న, నాకోసం చిల్ అవుతున్న, ఎవరికోసమో ఎందుకు కష్టపడాలి అని ఎదురు ప్రశ్నించారు హేమ.
హేమ మంచి ఈజ్ వున్న నటి! ఏ పాత్రలో నైనా ఒదిగిపోయే నటి! ముఖ్యంగా వదిన, ఆడపడుచు పాత్రల్లో, అలాగే భార్య పాత్రల్లో అద్భుతంగా సహజంగా ఆయా పాత్రలకు వన్నె తెచ్చే నటి హేమ! అతడు సినిమాలో బ్రహ్మానందం జోడిగా అమాయక భార్య పాత్రలో జీవించింది! ఇలాంటి జీవించే పాత్రలు చాలా పోషించారు. 1989లో భలేదొంగ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన హేమ 510 సినిమాల్లో నటించారు. బహుశా ఆమె చివరి సినిమా కొండపొలం కావచ్చు!
రాజోలు కు చెందిన హేమ సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలో కూడా రాణించడానికి కృషి చేశారు. టిడిపి సానుభూతిపరురాలు గా మొదట్లో ప్రచారం చేసిన హేమ తరువాత 2014లో కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరి రాజోలు నుంచి అసెంబ్లీ కి పోటీ చేసి ఓడిపోయారు. తరువాత వైసీపీ పార్టీలో చేరారు. అనంతరం బిజెపి కండువా కప్పుకున్నారు. సినిమాకు సంబంధించి “మా” ఎన్నికల్లో రెండు సార్లు కార్యవర్గ సభ్యురాలు గా ఒకసారి సంయుక్త కార్యదర్శి గా గెలిచి, మొన్నటి ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు.
సినిమా నటులతో కలివిడిగా ఉండి, సంక్షేమ కార్యక్రమాల్లోను చురుగ్గా పాల్గొనే హేమ ఇప్పుడు అదే రంగం పట్ల విముఖతగా ఉన్నారు! ఆమె రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు ఇండస్ట్రీ తనకు మద్దతు ఇవ్వలేదని, కనీసం విచారించకుండా, నిర్ధారణ కాని కేసులో తనను మా నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. సినిమా రంగంలో కొన్ని కుటుంబాల్లో ఏదయినా జరిగినప్పుడు క్యూ కట్టి పరామర్శ యాత్రలు చేసే నటులు తన విషయంలో చిన్న చూపు చూసారని ఆమె బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది! పైగా ఆమెకు ఈ మధ్య సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి! ఇంత మంచి నటి అయిన తన పట్ల ఇండస్ట్రీ నిర్లక్ష్యం చూపిందనే ఉద్దేశ్యంతో ఆమె సినిమాలకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది! కొన్నాళ్ళు చిల్ అయ్యాక, నటించాలని అనిపించినప్పుడు సినిమాల గురించి ఆలోచిస్తా అని అంటున్నారు హేమ. ఎంత మంచి ప్రతిభ వున్నా కొందరి నిష్క్రమణలు ఇలాగే ఉంటాయి సడి చప్పుడు లేకుండా!
– డా. మహ్మద్ రఫీ

Related posts

Leave a Comment