తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ (73) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు.. సంగీత దర్శకుడిగా సింగర్‌గా కూడా ఆయన అలరించారు. కె.భాగ్యరాజ్ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ‘ముందనై ముడిచ్చు’ (తెలుగులో ‘మూడు ముళ్లు’) చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఆయన రాసిన ఎన్నో అద్భుతమైన కథలు హిందీ, తెలుగు వంటి ఇతర భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’, అనిల్ కపూర్ నటించిన ‘వో 7 దిన్’ చిత్రాలకు ఆయనే కథ అందించారు. ఇటీవలే తెలుగులో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ చిత్రంలో సాధు పాత్రలో కనిపించారు. స్క్రీన్‌ప్లే మాంత్రికుడిగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు.
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్‌లో జన్మించిన ఆయన 1981లో నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కామెర్ల వ్యాధితో ఆమె 1983లో మరణించారు. ఆ తర్వాత 1984లో పూర్ణిమ జయరామ్‌ను పెళ్లాడారు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. కొడుకు శంతను భాగ్యరాజ్ హీరోగా చేస్తున్నారు. కూతురు శరణ్య ‘పారిజాతం’ వంటి కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) చిత్రానికి సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు భాగ్యరాజ్. ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలోనూ మెరిశారు. 1979లో ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత హీరోగా, దర్శకుడిగా ఆయన చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ‘అన్థా 7 నాట్కళ్’ (రాధా కళ్యాణం), ‘ముంధానై ముడిచ్చు’ (మూడు ముళ్లు), ‘దూరల్ నిన్ను పోచ్చు’ వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. తమిళంలో ఆయన రూపొందించిన ఎన్నో కథలు తెలుగు, హిందీ భాషల్లోకి రీమేక్ అయ్యాయి. అమితాబ్ బచ్చన్ నటించిన ‘ఆఖరి రాస్తా’ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే భాగ్యరాజ్ అందించడం విశేషం. భాగ్యరాజ్ కేవలం సినీ రంగానికే పరిమితం కాలేదు. ఆయన ‘భాగ్యవారపత్రిక’కు సంపాదకుడిగా వ్యవహరించడమే కాకుండా పలు నవలలు కూడా రచించారు. కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు. భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు, నటుడు కె.భాగ్యరాజ్ మృతి పట్ల చిరంజీవి, వెంకటేశ్, రాధిక, సుహాసిని వంటి స్టార్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గురువారం ఆయన నటి కుష్బూ కూతురు పెళ్లికి హాజరయ్యారు. అక్కడి చిరంజీవి, వెంకటేశ్, నాగార్జునలతో సరదాగా సంభాషించారు. వారితో కలిసి వేదికపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే పలువురు సినీతారలు కూడా భాగ్యరాజ్‌కు నివాళులు అర్పిస్తూ వీడియోలు పోస్ట్ చేశారు.
‘నేను 50 ఏళ్ల క్రితం పరిచయం చేసిన కె.భాగ్యరాజ్ ఈరోజు లేదనే వార్త తీవ్ర వేదనకు గురిచేసింది. తమిళ చిత్ర పరిశ్రమ ఒకే నెలలో ఇద్దరు రాజుల్ని కోల్పోయింది’ అని విశ్వనాయకుడు కమల్‌హాసన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘భాగ్యరాజ్ నాకు మంచి స్నేహితుడు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావడానికి ముందు తమిళంలో చేసిన చివరి చిత్రం ‘డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్’ ఆయన దర్శకత్వంలోనే! కష్టపడి ఎదిగిన దర్శకుడాయన. ఇప్పుడు ఆయన మన మధ్య లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా’ అని సుమన్ పేర్కొన్నారు. ‘దర్శకుడు భాగ్యరాజ్ ఇకలేరని విషయం నమ్మలేకపోతున్నా. గొప్ప దర్శకుడు, అసాధారణ నటుడు. సామాజిక సందేశాలున్న ఎన్నో సినిమాలు ఆయన దర్శకత్వంలో వచ్చాయి. తమిళ చిత్రసీమ గొప్ప మేధావుల్లో ఒకరిని కోల్పోయింది’ అని సిమ్రాన్ సంతాపం ప్రకటించారు.
ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు కె. భాగ్యరాజ్ మృతి పట్ల చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కొన్ని గంటల ముందు ఖుష్బూ కుమార్తె పెళ్లిలో జోకులేసుకుంటూ ఫొటోలు దిగిన సహచరుడు.. సడెన్‌గా మరణించాడనే విషయం తెలిసి హృదయం ముక్కలైందని అన్నారు. అందులోనూ ఆ ఫ్యామిలీతో చిరంజీవికి చాలా మంచి అనుబంధం ఉంది. భాగ్యరాజ్ వైఫ్ పూర్ణిమ.. చిరంజీవి సరసన హీరోయిన్‌గా కూడా నటించారు. 80స్ రీ యూనియన్ పార్టీలో వీరంతా.. ఎంత స్నేహంగా ఉండేవారో తెలియంది కాదు. అలాంటి స్నేహితుడు, సన్నిహితుడు ఇక లేరనే విషయాన్ని.. అసలు చిరంజీవి నమ్మలేకపోతున్నారు. అదే విషయాన్ని తన ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
‘‘ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు మాటలు రావడం లేదు. మొన్న గోవాలో ఖుష్బూ కుమార్తె పెళ్లి వేడుకలో మేమంతా కలిసి నవ్వుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, ఫొటోలు దిగుతూ ఎంతో ఆనందంగా గడిపాం. భాగ్యరాజ్ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా కనిపించారు. అలాంటి ఆయన ఈ ఉదయం ఇక లేరనే వార్త వినడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అద్భుతమైన దర్శకుడిగా, అసాధారణమైన స్క్రీన్‌ప్లే రచయితగా, గొప్ప నటుడిగా భారతీయ సినీ పరిశ్రమకు భాగ్యరాజ్ అందించిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన భార్య పూర్ణిమకు, కుమారుడు శాంతనుకు, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. నా ప్రియమైన మిత్రమా.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ మా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు..’’ అని చిరంజీవి ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు.
‘‘భాగ్యరాజ్ మరణవార్త నన్ను తీవ్ర విచారానికి గురిచేసింది. ఆయన సృష్టించిన కళాఖండాలు భాషా సరిహద్దులను దాటి కోట్లాది మంది హృదయాలను స్పృశించాయి. ఆయన అద్భుతమైన కథల నుంచి రూపుదిద్దుకున్న ‘సుందరకాండ, అబ్బాయిగారు’ వంటి సినిమాల్లో నేను భాగమవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. భారతీయ సినిమా ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, కోట్లాది మంది అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని వెంకటేష్ ట్వీట్ చేశారు.
”ప్రముఖ దర్శకులు, నటులు, రచయిత శ్రీ కె.భాగ్యరాజ్ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్ గారు తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి విజయవంతం అయ్యాయి. ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలచిన విధానం ఒక తరం ప్రేక్షకులను మెప్పించింది. భాగ్యరాజ్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపాన్ని తెలిపారు.
నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ ఇకలేరు
