యాక్షన్ కింగ్ అర్జున్ ‘పొలిమేర 3’ ప్రారంభం

Spread the love

ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, థియేటర్లలో ‘పొలిమేర 2’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కిస్తున్న విజయవంతమైన  హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ఇప్పుడు ‘పొలిమేర-3’గా మరింత పవర్‌ఫుల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో  ‘పొలిమేర 3’ చిత్రాన్ని  వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్‌, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దివంగత నారాయణదాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ   బ్యానర్స్‌పై   వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్‌లు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   ఈ రెండు సంస్థల కలయికతో మరింత పవర్‌ఫుల్‌గా  భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం సోమవారం సికింద్రాబాద్‌లోని ఓ గణేష్‌ ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ నారంగ్ జయంతి సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించడం విశేషంగా నిలిచింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తొలి క్లాప్ ఇవ్వగా, సీనియర్ నిర్మాత డి. సురేష్ బాబు కెమెరా స్వీచ్చాన్‌ చేశారు. యువ నిర్మాత బన్నీవాస్‌, ఎగ్జిబిటర్‌ సదానంద్‌ గౌడ్‌ చిత్ర బౌండెడ్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందించి విజయాన్ని ఆకాంక్షించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రకటనలో అతిపెద్ద ఆకర్షణగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘పొలిమేర’ వరల్డ్‌లోకి  అడుగుపెట్టడం నిలిచింది. ‘బ్లాస్ట్ జోన్’ విజయానంతరం అర్జున్ ఈ ఫ్రాంచైజీలో కీలకమైన శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. దక్షిణ భారతదేశవ్యాప్తంగా తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, శక్తివంతమైన నటనతో అభిమానులను సంపాదించుకున్న అర్జున్ చేరికతో ‘పొలిమేర 3’పై అంచనాలు మరింత పెరిగాయి. యాక్షన్ కింగ్ అర్జున్ చేరికతో ‘పొలిమేర 3’ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించిన అర్జున్, తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘పొలిమేర’లో చేరడం ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. తన ఉత్కంఠభరిత కథనం, ఊహించని మలుపులతో ‘పొలిమేర’ను కల్ట్ ఫేవరెట్‌గా నిలిపిన దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ ఈసారి తన అత్యంత ప్రతిష్ఠాత్మక కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడో భాగంలో మరింత లోతైన రహస్యాలు, భయానక అతీంద్రియ అంశాలు, సంచలనాత్మక మలుపులతో ‘పొలిమేర’ ప్రపంచాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ‘పొలిమేర 2’తో ఈ ఫ్రాంచైజీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన డైనమిక్‌ నిర్మాత వంశీ నందిపాటి, ఇప్పుడు మరో పాషనేటెడ్‌ నిర్మాత జాన్వీ నారంగ్‌తో కలిసి  అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సత్యం రాజేష్ మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకున్న కొమరయ్య పాత్రలో కనిపించనున్నారు. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.