తెలంగాణ బతుకు చిత్రం!

telanganadevudu movie review
Spread the love
  • చిత్రం: తెలంగాణ దేవుడు
    విడుదల : 12 నవంబర్ 2021
  • రేటింగ్: 4/5
    నిర్మాణం: మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్
    మూల కథ, నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్
    రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
  • తారాగణం: పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం)
    సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ,
    వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు,
    బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత,
    ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు,
    కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు.
  • సంగీతం: నందన్ బొబ్బిలి
    సినిమాటోగ్రఫీ: అడుసుమిల్లి విజయ్ కుమార్
    ఎడిటింగ్: గౌతంరాజు
    లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
    పి.ఆర్.ఓ : బి. వీరబాబు

ఉద్యమాల పురిటిగడ్డలో ఉరకలెత్తే ఉత్సహంతో సరికొత్తగా వచ్చిన ప్రజా ఉప్పెన ప్రత్యేక తెలంగాణ పోరాటం. ఎన్నో ఏళ్లుగా ప్రజావాణితో బాటు, రాజకీయ సంక్షోభాలకు కారణమైన ఉద్యమ తీవ్రత గూర్చి వివరిస్తూ తెలంగాణా కళాకారుల మమేకంతో జనప్రవాహంలా సాగిన జనజీవిత వ్యవస్థను అద్దంలో చూపే ప్రయత్నం ఎన్నదగినదే. అయితే ప్రజా నాయకులు, రాజకీయ యవనికపై ఈ ఉధృత పోరాటానికి ఎంతమంది బావుటాలెత్తారు? వారి ఉద్యమ ప్రస్థానం ఎలా సాగింది? అందులో కష్టనష్టాలు, ఒడిదుడుకులు , ఒక ప్రాంతం విడిపోతే ఎవరికి ఖేదం? మరెవరికి మోదం అన్న ప్రశ్నలు వేస్తూ , వాటికి జవాబులు కూడా ఎవరికి వారు చెప్పుకునే స్క్రీన్ ప్లే తో ‘తెలంగాణ దేవుడు’ ఆసాంతం సాగుతుంది. ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా తొలిసారి సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యారు. ప్రఖ్యాత దర్శకుడు సాగర్ శిష్యుడైన వడత్యా హరీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఎన్నో ఆశల మధ్య ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘తెలంగాణ దేవుడు’ చిత్రం ఎలా వుందో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

నిధులు లేవు…నియామకాలు అసలే జరగడం లేదు… పైగా నీళ్ల విషయంలో పాలకుల నిర్లక్ష్య ధోరణి తీవ్రస్థాయికి చేరింది. పాలకులు ఇలా వ్యవహరించడంతో తెలంగాణ ప్రాంతం ఏ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అదే ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే యువతకు ఉద్యోగాలు…నియామకాలతో పాటు, తెలంగాణ సస్యశ్యామలం కావడానికి పుష్కలంగా నీళ్లు… ఈ ప్రాంతం అభివృద్ధికి కావాల్సిన నిధులను పుష్కలంగా తెలంగాణా ప్రాంతంలోనే ఉపయోగించుకుని… బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకోవచ్చన్నది అందరి ఆశ. ఈ నేపథ్యంలో మలిదశ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవితకథ ఆధారంగా వెండితెరపై పురుడుపోసుకున్న కథే ‘తెలంగాణ దేవుడు’. కేసీఆర్ చిన్ననాటి సంగతులు.. బాల్యంతో పాటు,అటు తరువాత కళాశాల జీవితంలో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వైపు అతని అడుగులు.. ఆ తరువాత వెంటనే రాజకీయ జీవితం.. మళ్ళీ ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీని స్థాపించి… ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించాడనేది తెలుసుకోవాలంటే ‘తెలంగాణ దేవుడు’ని తెరమీద చూడాల్సిందే.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రపై ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఉద్యమం సమయంలో జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘జై భోలో తెలంగాణ’ సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం మీద ‘తెలంగాణ దేవుడు’ పేరుతో కేసీఆర్ జీవిత చరిత్రను బాల్యం నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రధాన ఘట్టాలు ఓ వైపు చూపిస్తూనే, మరో వైపు ఆంధ్ర, తెలంగాణ కాలిపోయి ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తరువాత… మళ్లీ ప్రత్యేక తెలంగాణ కోసం మళ్ళీ ఉద్యమం మొదలు కావడం లాంటి ఘట్టాలను… మరోవైపు చూపిస్తూ… ఎక్కడా బోర్ లేకుండా దర్శకుడు సినిమాను చక్కగా తెరపై ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీని వదిలి తెలంగాణ సాధన కోసం.. ఉద్యమ పార్టీని స్థాపించి… ఆ తరువాత రాజకీయ పార్టీగా తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి… ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం, బంగారు తెలంగాణ సాకారం నెరవేరడం అన్న విషయాలు తెరపై ఆసక్తిగా ఆవిష్కరించారు.
ప్రతీ సన్నివేశంలోనూ ఎంతో ఉత్కంఠ.. మరెంతో భావోద్వేగం.. కళ్ళముందు కదలాడింది. ప్రజల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు, రైతులకోసం కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తదితర వాటిని ప్రధానంగా చూపిస్తూ కథను నడిపిన తీరు అందర్నీ కట్టిపడేసింది. ఈ కథను…కేసీఆర్ ఇప్పటి జీవితానికి అనుగుణంగా రాసుకొని పాటలు, డ్యూయెట్ లతో ఓ కమర్షియల్ బయోపిక్‌లా సాగింది. సినిమా మొత్తం ఫ్రెష్‌గా తోచింది. ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ పండాలి? అని బాగా ఆలోచించి ఈ సినిమాని నడిపించారు. ఓవరాల్ గా తెలంగాణాకు కేసీఆర్ నిజంగానే ‘తెలంగాణ దేవుడు’ అయ్యారు. ఈ విషయాలన్నీ ఎంతో హృద్యంగా తెరకెక్కించారు. శ్రీకాంత్ ని కేసీఆర్ పాత్రకోసం ఎన్నుకోవడమే ప్రశంసించ తగ్గ విషయం. హీరో శ్రీకాంత్ కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎంతో చక్కని హావభావాలు ప్రదర్శించి కేసీఆర్ పాత్రలో జీవించారు.
ఇక కేసీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన నటుడు జిషాన్ ఉస్మాన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎంతో ఈజీగా నటించాడు. చూడచక్కని కలర్, బాడీ లాంగ్వేజ్ తో పాటు, ప్రతీ సన్నివేశంలో జిషాన్ పలికించిన హావభావాలు వేటికవే సాటిగా నిలిచాయి. హీరోగా తొలి పరిచయమే అయినా.. అతడు ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలగనీయలేదు. ఇదివరకే అనుభవమున్న నటుడిలా విభిన్న కోణాలతో చాకచక్యాన్ని ప్రదర్శించాడు. సినిమా చూసిన ప్రేక్షకులు జిషాన్ ఉస్మాన్‌ అంత త్వరగా మరచిపోలేరు. తెలంగాణ ఉద్యమమంతా కసిగా గట్టిగా సిల్వర్ స్క్రీన్ పై ప్రయత్నిస్తే మంచి నటుడవుతాడు.
కేసీఆర్ భార్య పాత్రలో సంగీత, కవిత పాత్రలో మధుమిత, హరీష్ రావు పాత్రలో అజయ్, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలో సుమన్, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కాశీ విశ్వనాథ్, జగన్ పాత్రలో సునీల్, జానారెడ్డి పాత్రలో పృథ్వి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ముఖ్యంగా రోశయ్య పాత్ర అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది.
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతికత విషయానికొస్తే… సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. అందుకు సంగీతం సైతం తోడయ్యింది. ఎడిటింగ్ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా వివిధ పాత్రల కోసం ఎంపిక చేసుకున్న భారీ తారాగణం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. అందుకు నిర్మాత మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ ను అభినందించి తీరాల్సిందే..

Related posts

Leave a Comment