అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు

happy birthday to megastar chiranjivi annaiah
Spread the love

చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి.
చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత.
చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు.
ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని కనులార చూశాను. ఒక అసామాన్యునిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నా.. తెలుగు సినిమాను భారత చలనచిత్ర రంగంలో అగ్రపథాన నిలబెట్టినా.. అవార్డులు రివార్డులు ఎన్ని వరించినా… నందులు తరలి వచ్చినా… పద్మభూషణ్ గా కీర్తి గడించినా… చట్ట సభ సభ్యునిగా.. కేంద్ర మంత్రిగా పదవులను ఆలంకరించినా.. ఆయన తల ఎగరేయలేదు. విజయాలు ఎన్ని సాధించినా.. రికార్డులు ఎన్ని సృష్టించినా అదే విధేయత, అదే వినమ్రత శ్రీ చిరంజీవి గారి సొంతం. అందువల్లేనేమో ఆయనను సొంత మనిషిలా భావిస్తారు లక్షలాది మంది. విద్యార్థి దశలోనే సేవాభావాన్ని పెంపొందించుకున్న శ్రీ చిరంజీవి గారు నాడు రక్త నిధిని, నేడు ప్రాణ వాయువు నిధిని స్థాపించి… కొడిగడుతున్న ప్రాణాలకు ఆయువునిస్తూ తనలోని సేవాగుణాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారు. ఆపదలో ఎవరైనా వున్నారంటే ఆదుకోవడంలో ముందుంటారు. దానాలు.. గుప్తదానాలు ఎన్నో చేశారు… చేస్తూనే వున్నారు. కరోనాతో పనులు లేక అల్లాడిపోయిన సినిమా కార్మికుల ఆకలి తీర్చడానికి అన్నయ్య ఎంతో తపనపడ్డారు. అందువల్లే సినీ కార్మికులు అందరూ శ్రీ చిరంజీవి గారిని తమ నాయకునిగా ఆరాధిస్తున్నారు. వర్తమాన చరిత్రగా ఆయన జీవితాన్ని లిఖిస్తున్నారు.
శ్రీ చిరంజీవి గారు మా కుటుంబంలో అన్నగా పుట్టినా మమ్మల్ని తండ్రిలా సాకారు. తండ్రి స్థానంలో నిలిచారు. ఆ ప్రేమమూర్తి పుట్టిన రోజు సందర్భంగా ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ చిరంజీవి గారికి ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షు ప్రసాదించాలని, చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

ప్రేమతో… పవన్ కల్యాణ్
(అధ్యక్షులు – జనసేన)

Related posts

Leave a Comment