చిత్రపురి కాలనీ శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా బోనాల పండగ

Spread the love

చిత్రపురి కాలనీలో బోనాల ఫెస్టివల్ భక్తి శ్రద్ధలతో జరిగింది. కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాల పండగ సందడి నెలకొంది. ఉదయం నుంచే కాలనీ వాసులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కాదంబరి కిరణ్ బోనాల వేడుకలో పాల్గొన్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ ద్వారం దగ్గరే మాస్కుల పంపిణీ ఏర్పాటు చేశారు, అమ్మవారిని దర్శించుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలంటూ భక్తులకు సూచించారు.

ఈ సందర్భంగా చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ…చిత్ర పురి కాలనీలో ఉన్న ప్రజలందరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బోనాల పండగను నిర్వహిస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లు బోనాల పండగకు దూరంగా ఉంటూ వచ్చాం. కనకదుర్గమ్మ అమ్మవారు కోరుకున్న వరాలు ఇచ్చే దేవత. చిత్రపురి కాలనీ ఇంత అభివృద్ధి జరిగిందంటే అమ్మవారి దయ వల్లే. బోనాలు తెచ్చి అమ్మవారికి భక్తులు సమర్పించారు. కోవిడ్ నిబంధనలన్నీ ఇక్కడ పాటించేలా చర్యలు తీసుకున్నాం. మధ్యాహ్నం అమ్మవారి ప్రసాదం స్వీకరించి, సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అని చెప్పారు.

చిత్రపురి కాలనీ సెక్రటరీ కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…కనకదుర్గ అమ్మవారి మహిమ మాకు తెలుసు, ఆమె మా పట్ల చూపిస్తున్న కరుణ తెలుసు, అందుకే బోనాల పండగను మా శక్తి మేరకు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కనకదుర్గమ్మను నమ్ముకుంటే కష్టాలన్నీ తీరిపోతాయన్నది నిజం. చిత్రపురిలోని వాసులంతా బోనాల పండగలో పాల్గొంటున్నారు. ఏటా ఇక్కడ భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మా కమిటీ ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. మేము చిత్రపురి కాలనీలో చేపట్టబోయే భవిష్యత్ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయని ఆశిస్తున్నాం. అన్నారు.

Related posts

Leave a Comment