శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ : పరిణతి లేని ప్రేమకథ!
Srinivasa Mangapuram Movie Review: An immature love story!
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడే జయకృష్ణ ఘట్టమనేని. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, దివంగత కథానాయకుడు రమేశ్ తనయుడు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మించిన ‘శ్రీనివాస మంగాపురం’ ద్వారా జయకృష్ణ తెరంగేట్రం చేయడం, మహేశ్ తొలి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలైన జులై 30నే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్‌గా పరిచయమైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బాగానే చేయడంతో ‘శ్రీనివాస మంగాపురం’పై హైప్ క్రియేట్ అయింది. ఈ గురువారం (జులై 30) థియేటర్లలోకి వచ్చిన ‘శ్రీనివాస మంగాపురం’ ఎలా ఉంది? భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కథ ఎలా ఉంది? జయకృష్ణ తొలి సినిమాతో ఆకట్టుకున్నాడా? అజయ్ భూపతి మరో విజయాన్ని అందుకున్నాడా? ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం…
కథ: శీను (జై కృష్ణ) కాలేజీ గొడవల కారణంగా సొంత ఊరు బళ్లారికి కొద్ది రోజులు దూరంగా ఉండాలని తిరుపతి వస్తాడు. అక్కడ తొలి చూపులోనే మంగను (రషా తడానీ) చూసి ప్రేమలో పడతాడు. తిరుపతిలో పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) పేరు చెబితే అందరూ భయపడిపోతుంటారు. మంగ….పెద్దిరెడ్డి కూతురు అని తెలిసి కూడా ఆమె వెంటపడతాడు. మంగకు మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అవుతుంది. అయినా శీను తన ప్రేమను మంగకు వ్యక్తం చేస్తాడు. అదే టైమ్‌లో శీనుపై కొందరు ఎటాక్ చేస్తారు. వారు ఎవరు? బళ్లారిని గడగడలాడించే వెంకటప్పయ్య నాయుడు (మోహన్‌బాబు) మనవడైన వాసు బాబు… తన పేరును శీనుగా మార్చుకొని మంగ ప్రేమ కోసం తిరుపతి ఎందుకు వచ్చాడు? వాసును ప్రాణంగా ప్రేమించిన మంగ అతడిని ఎందుకు గుర్తుపట్టలేదు? కూతురి ప్రేమ విషయం పెద్ది రెడ్డికి తెలిసిందా? శీను ప్రేమను మంగ అర్థం చేసుకుందా? వారు ఒక్కటయ్యారా? వారి జీవితాల్లోకి వచ్చిన వరలక్ష్మి (వాసుకి), స్వతంత్ర బాబు (సీనియర్ నరేష్), బాలు (బ్రహ్మాజీ) ఎవరు? వాసు బాబు ఎందుకు శ్రీనుగా తిరుపతిలో అడుగుపెట్టాడు? మంగ రిజెక్ట్ చేస్తున్నా ఆమె ప్రేమ కోసం శ్రీనుగా ఎందుకు పాకులాడాడు? తిరుపతిలో ఉన్న శ్రీనునే తన మనవడు వాసురావు అని తెలిసిన తర్వాత వెంకటప్ప నాయుడు రియాక్షన్ ఏమిటి? ప్రమాదంలో పడిన మనవడు వాసురావును కాపాడుకొనేందుకు వెంకటప్ప నాయుడు ఏం చేశాడు? పెద్ది రెడ్డికి, వెంకటప్ప నాయుడు మధ్య రిలేషన్ ఏమిటి? చివరకు వాసు, మంగ ఒక్కటయ్యారా? లేదా? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ : ఈ సినిమా కథ, కథనాల విషయానికి వస్తే.. ఏ మాత్రం కొత్తదనం లేని పరమ రొటీన్ స్టోరీ. కథగా చూసుకుంటే ఇది కొత్త కథ ఏమీ కాదు. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలలో కనిపిస్తూ వస్తున్న ఒక లవ్ స్టోరీకి కొంత రివెంజ్ డ్రామా జోడించి ఈ కథ రాసుకున్నాడు అజయ్ భూపతి. కాకపోతే ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వారసుడిని దింపుతున్న క్రమంలో, పూర్తిస్థాయిలో కమర్షియల్ హంగులతో సినిమా మొత్తం నింపేశాడు. ఒకరకంగా చెప్పాలంటే కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమాని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేసి కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ప్రారంభమైన వెంటనే హీరో గాయపడటం, ఆ తరువాత హీరో హీరోయిన్ వెంటపడుతూ ఆమె ప్రేమ కోసం పరితపిస్తూ ఉండడం ఆసక్తికరంగా చూపించారు. అలాగే హీరోయిన్ తండ్రిగా పెద్దిరెడ్డి పాత్రను పరిచయం చేసి ఫస్టాఫ్ అంతా సస్పెన్స్ క్రియేట్ చేస్తూనే కథ నడిపించారు. సెకండ్ హాఫ్ వచ్చే వరకు కూడా అసలు కథ ఎటు వెళుతుంది అనే విషయం అర్థం కాకుండానే స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు అజయ్ భూపతి. కథ, కథనాల్లో పస లేని కారణంగా యాక్టర్లు కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ లేకపోయింది. మొదటి అర్ధగంట సినిమా చూస్తే.. అసలు ఏం జరుగబోతుందో అంతా సులభంగా ఊహించవచ్చు. ప్రతి సన్నివేశం గతంలో మనం ఏదో ఒక సినిమాలో చూసిన భావనే కలుగుతుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్ ఆసక్తికరంగా ఉంది. అలానే హీరోయిన్ మనసు దోచుకునే క్రమంలో హీరో పడే తపన కూడా బాగానే ఉంది కాకపోతే… ద్వితీయార్థంలో హీరోయిన్ గతాన్ని రివీల్ చేసిన విధానం, హీరో నేపథ్యం అవన్నీ పరమ రొటీన్ గా ఉన్నాయి. అయినా… ఎక్కడా బోర్ కొట్టకుండా కథను చకచకా నడిపేశాడు దర్శకుడు. అయితే… ద్వితీయార్థంలో ఎంటరయ్యే పాత్రలకు సరైన ప్రాధాన్యం దక్కలేదు. మోహన్ బాబుది ఇందులో చాలా కీలకమైన పాత్ర అనే భావన ప్రచార సమయంలో కల్పించారు. తీరా చూస్తే… ఆయన హీరో తాతయ్యగా కాస్తంత పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు అంతే! మోహన్ బాబు పోషించిన వెంకటప్ప నాయుడు పాత్రకు అతని తమ్ముళ్ళ కొడుకుల మధ్య వైరానికి బలమైన కారణమే చూపలేదు. దాంతో ఆ పాత్రలు, వాటి మధ్య పగప్రతీకారాలు మరీ తెచ్చిపెట్టినట్టుగా ఉండిపోయాయి. బలమైన విలనీ లేకపోవడం ఈ సినిమాకు మెయిన్ మైనస్. రొటీన్ టెంప్లేట్ స్టోరీతో శ్రీనివాస మంగాపురం మూవీ రూపొందింది. క్లైమాక్స్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. నాయకానాయికల మధ్య ప్రేమ సన్నివేశాలతో పాటు, ప్రథమార్ధం దాదాపుగా ఓ ఫార్ములా ప్రకారమే సాగుతుంది. అమ్మాయిని చూడటం, ఆ తర్వాత ఓ పాట రావడం.. ఆమెని పలకరించడం, ఆ తర్వాత ఓ పాట పాడుకోవడం, మధ్యలో ఓ ఫైట్.. అచ్చంగా ఇంతే. మంగ నాదే… మంగ నాదే… అంటూ హీరో అనడం చూసి ఓ దశలో ఏమాత్రం పరిణతి లేని ప్రేమకథ అని కూడా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో తప్ప కథానాయిక మనసులో సహజంగా ప్రేమ పుట్టే సన్నివేశాలేవీ సినిమాలో ఉండవు. విరామానికి ముందు, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలే సినిమాపై ప్రభావం చూపించాయి. పెద్దిరెడ్డి, వెంకటప్పయ్య నాయుడు ముఠాలు, వాళ్ల శత్రువులు.. ఇలా తెరనిండా పెద్ద పెద్ద ముఠాలు కనిపిస్తుంటాయి కానీ, ఆ ప్రభావం కథపై ఏమాత్రం కనిపించదు. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ఇది రొటీన్ లవ్‌స్టోరీ అని అర్థమైపోతుంది. గతంలో చూసిన చాలా సినిమాలు గుర్తుకు వచ్చేలా సన్నివేశాలు సాగుతుంటాయి. ఈ సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే ఇందులోని పాయింట్ ఏంటి అనేది ఓ క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మనం మునుపెన్నడూ చూడనిది కాదు. అలానే అక్కడక్కడా కొన్ని సీన్స్ మాత్రం చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ గానే సాగాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న లవ్ అండ్ ఫ్యాక్షన్, పరువు ఎమోషన్స్ లలో ఇంకాస్త బ్యాలెన్సుడ్ గా కథనాన్ని నడిపించి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: ఇక కొత్త హీరో, హీరోయిన్లు పరిశ్రమకు పరిచయమయ్యే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం అనుభవం ఉన్న దర్శకుల సినిమాలు చూస్తే తెలుస్తుంది. మొదటి సినిమాలోనే భారం మొత్తం హీరో, హీరోయిన్లపై వేయకుండా.. సీనియర్ యాక్టర్ల చుట్టూ కథ నడిపించి.. వారికి కీలక భాగాల్లో అవకాశం కల్పిస్తే.. ఎలాంటి ప్రెజర్ లేకుండా తమ వంతుగా బెటర్‌గా నటించడానికి స్కోప్ ఉంటుంది. కానీ జై కృష్ణ, రషా తడానీ విషయానికి వస్తే.. సినిమా భారమంతా వారిపైనే పడటం వల్ల పూర్తిగా తేలిపోయారు. బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది తమ శక్తికి మించిన భారంగా మారిందనే చెప్పాలి. జయకృష్ణకు ఇది పరిచయ చిత్రమే అయినా.. చాలా చోట్ల తన నటనలో మంచి పరిణతి ప్రదర్శించాడు. తను సినిమా కోసం బాగా సన్నద్ధమయ్యారనే విషయం స్పష్టమవుతుంది. డాన్సులు పెద్దంతగా చేయలేదు కానీ ఫైట్స్ మాత్రం బాగానే చేశాడు. డైలాగ్ డెలివరీ ఓకే. కళ్ళు చిన్నగా ఉండటమే కాస్తంత మైనస్. కథానాయిక రషా తడానీ లుక్స్‌తో ఆకట్టుకుంది. ముఖ్యంగా పాటల్లో ఆమె చాలా బాగుంది. జైకృష్ణ సరసన రాషా తడాని బాగానే ఉంది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. వెంకటప్పయ్య నాయుడుగా మోహన్‌బాబు కనిపించిన తీరు బాగుంది కానీ.. ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానమే అంతంత మాత్రంగా అనిపిస్తుంది. చాలా రోజుల మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించినా.. ఆయన స్థాయికి తగిన పాత్రను చేసినట్టు అనిపించదు. అలాగే సెకండాఫ్‌లో ఏదో మొక్కుబడిగా ఆయనను చూపించే ప్రయత్నం మాత్రమే కనిపిస్తుంది. ఇక వాసుకి, కిక్ శ్యామ్, వడ్లమాని శ్రీనివాస్ పాత్రలకు మంచి స్కోప్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా జాగ్రత్తలు తీసుకొన్నట్టు కనిపించదు. వీకే నరేష్, బ్రహ్మాజీ పాత్రలు చాలా నాసిరకంగా ఉన్నాయి. బ్రహ్మాజీ పాత్రకు బాలు అని పేరు పెట్టడం, స్వతంత్రబాబు పాత్రలో వీకే నరేశ్‌ని చూపించిన తీరు, కొన్ని సన్నివేశాలు హుందాగా అనిపించవు. వారి కామెడీ ట్రాక్ బోరింగ్‌గా, వెగటుగా ఉంటుంది. ఓవరాల్‌గా నటీనటులకు పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ లేని సినిమాగా కనిపిస్తుంది. అజయ్, వాసుకి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం: సాంకేతిక విభాగాల్లో జయకృష్ణ గుమ్మడి కెమెరాకు మంచి మార్కులు పడతాయి. ప్రేమకథకి తగ్గట్టుగా మంచి విజువల్స్‌ని అందించారు. జి.వి.ప్రకాశ్‌కుమార్ పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంతోనూ ప్రభావం చూపించారు. పాటల్లో ‘అల్లల్లే…’ ఆకట్టుకునేలా ఉంది. మిగిలిన విభాగాలు పర్వాలేదనిపిస్తాయి. దర్శకుడు అజయ్ భూపతి కథలు, పాత్రలు, ఆయన సినిమాల్లోని సాంకేతిక హంగులు బలమైన ప్రభావం చూపిస్తుంటాయి. కానీ ఈ సినిమాలో అవి పెద్దగా కనిపించలేదు. రచనలో బలం లేకపోవడం సినిమాకి మైనస్. సీనియర్ నిర్మాతలు కావడంతో అశ్వనీదత్, కిరణ్ ఎక్కడా నిర్మాణ పరంగా రాజీ పడలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మాధవ్ కుమార్ గుళ్లపల్లి ఎడిటింగ్ బాగానే ఉంది. ఇక దర్శకుడు అజయ్ భూపతి విషయానికి వస్తే.. తన వర్క్ లవ్ ట్రాక్ లో ఇంప్రెస్ చేస్తుంది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరి వెర్షన్ లలోనూ తను రాసుకున్న కథనం మంచి లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ‘శ్రీనివాస మంగాపురం’ అక్కడక్కడా మంచి ఎమోషన్స్ తో సాగే డీసెంట్ లవ్ డ్రామాగా నిలుస్తుంది. అలానే ఇందులో లవ్, ఎమోషన్స్ అక్కడక్కడా యాక్షన్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. కానీ కొంచెం రొటీన్ ప్లాట్, కొన్ని రెగ్యులర్ మూమెంట్స్ మాత్రం ఇందులో బలహీనంగా అనిపించాయి. ఇవి పక్కన పెడితే ఈ ఎమోషనల్ లవ్, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది.
(రేటింగ్: 2.75/5)

