సంగీత దర్శకుడిగా అందరికీ సుపరిచితుడైన రఘు కుంచె ప్రధాన పాత్రలో, చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘గేదెల రాజు’. ‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’ అనే క్యాప్షన్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం…
కథా నేపథ్యం: కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు (రఘు కుంచె) కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. టికెట్ ఆశించిన మరో నేత దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్)తో రాజుకు విభేదాలు తలెత్తుతాయి. అయితే, ఊహించని విధంగా అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు. ఈ హత్య వెనుక ఉన్నది రాజకీయ ప్రత్యర్థులా? లేక రిచ్-మీరా, విజయ్-సత్య వంటి యువ జంటలకు ఈ మరణంతో సంబంధం ఉందా? పోలీసు విచారణలో తేలిన షాకింగ్ నిజాలేమిటి అనేదే ఈ సినిమా ఇతివృత్తం.
విశ్లేషణ: దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. హత్యతోనే కథను మొదలుపెట్టి, ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ ప్రేక్షకుల బుర్రకు పని పెట్టారు. ప్రతి పాత్ర ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నట్లుగా చూపించి, చివరి వరకు హంతకుడు ఎవరనేది సస్పెన్స్ గా ఉంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. మహాభారతంలోని ‘కనిక నీతి’ని ప్రస్తుత కథకు ముడిపెట్టిన తీరు మేధోపరంగా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సగటు ప్రేక్షకుడు ఊహించని విధంగా ఉంటుంది.
నటీనటుల ప్రతిభ : రౌడీ షీటర్ పాత్రలో రఘు కుంచె ఒదిగిపోయారు. ఆయన బాడీ లాంగ్వేజ్, గోదావరి యాసలో డైలాగ్ డెలివరీ బాగున్నాయి. రఘు కుంచె నటన ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలిచింది. ఇతర పాత్రల్లో వికాస్, రామచంద్రం, టీనా శ్రావ్య, మౌనిక తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. రవి ఆనంద్ (శివయ్య) నటన ఆకట్టుకుంటుంది.
సాంకేతిక విభాగం: రఘు కుంచె అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ గోదావరి పరిసర ప్రాంతాలను సహజంగా చూపించింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద మర్డర్ మిస్టరీ సినిమాలను ఇష్టపడే వారికి ‘గేదెల రాజు’ ఒక మంచి ఆప్షన్. రాజకీయ పగలు, వ్యక్తిగత ప్రతీకారాల మధ్య సాగే ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది.
రేటింగ్: 3.25/5
