“మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి
కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోముందడుగు
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిన్నతనం నుంచి సేవ చేయడం అంటే తెలియని ఇష్టం ఉండేది. నేనే రంగంలో ఉన్నా నాలో సేవాగుణం పెరుగుతూ వచ్చింది. పేదలకు చేతనైన సాయం చేయాలనే మనం సైతం సంస్థను ప్రారంభించాం. ఇవాళ ఆ సంస్థ వేలాది మందికి చేరువైంది. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఎంతోమందికి సహాయ కార్యక్రమాలు చేశాం. మా సంస్థకు సొంత ఆంబులెన్స్ సమకూర్చుకున్నాం. ఈ ఆంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితంగా అందిస్తాం. ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమతో పాటు వివిధ రంగాల పెద్దలు వచ్చి ఆశీర్వదించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. భవిష్యత్ లో ‘సపర్య’ పేరుతో వృద్ధాశ్రమం స్థాపించాలి, అక్కడ నిరాదరణకు గురైన వారికి ఆశ్రయం కల్పించాలి అనేది నా కల. అన్నారు.